iDreamPost
android-app
ios-app

Veerraju Over Expectation – ఎబ్బెట్టుగా అనిపించడం లేదా వీర్రాజు..?

Veerraju Over Expectation – ఎబ్బెట్టుగా అనిపించడం లేదా వీర్రాజు..?

విషయం వీక్‌గా ఉన్నప్పుడే ప్రచారం పీక్‌లో ఉంటుందని ఓ సినిమా డైలాగ్‌. ప్రస్తుతం ఈ డైలాగ్‌ ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహరిస్తున్న తీరునకు అతికినట్లుగా సరిపోతుంది. వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ఈ నెల 30వ తేదీన జరగబోతోంది. నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిసింది. పోటీ దారులు ఎవరో తేలిపోయింది. వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ సహా ఇతర చిన్నా చితకా పార్టీలు, స్వతంత్రులు సహా 15 మంది బరిలో ఉన్నారు. టీడీపీ పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించగా.. జనసేన మాత్రం బీజేపీకి మద్ధతు ఇస్తున్నట్లు తెలిపింది.

ఎన్నిక ఏదైనా ఏపీలో ఫలితం వన్‌సైడెడ్‌గా వస్తోంది. బద్వేలు ఉప ఎన్నికల్లోనూ ఇదే జరుగుతుందని అధికారపార్టీ ధీమాగా ఉంది. తిరుపతి ఉప ఎన్నికల్లో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రచారం నిర్వహించకపోయినా.. వైసీపీ భారీ విజయం అందుకుంది. ఇక బద్వేలులో ప్రధానప్రతిపక్షం టీడీపీ పోటీలో లేకపోవడంతో.. సాధారణ ఎన్నికలలో వచ్చిన ఓట్లతో పోల్చుకుంటే ఈ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయన్నదే ఆసక్తికరం. కానీ బీజేపీ మాత్రం.. ఏదో జరగబోతున్నట్లు, వైసీపీకి తాము బలంగా పోటీ ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటోంది. తద్వారా ప్రజలు, మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ ప్లాన్‌లో భాగంగానే.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. బద్వేలు ఉప ఎన్నికల్లో అధికారపార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని అందులో పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలపై కేసులుపెట్టి పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఎస్సై నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకు బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు కేంద్ర బలగాలను పంపాలని కోరారు. అంతేకాకుండా.. మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేకతకు భయపడే సీఎం జగన్‌ బద్వేలు ఉప ఎన్నిక ప్రచారానికి రాలేకపోతున్నారంటూ మాట్లాడారు.

Also Read : Financial Experts – కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికవేత్తలు ఎందుకు వెళ్లిపోతున్నారు?

సోము వ్యాఖ్యలు చూస్తే.. పైన పేర్కొన్న సినిమా డైలాగ్‌ గుర్తుకురాక మానదు. ఏపీలో బీజేపీ పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఎమ్మెల్యే సీటు నెగ్గడం కాదు కదా.. అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోయింది. 1.28 శాతం ఓట్లు వచ్చిన నోటాతో 0.85 శాతం ఓట్లు తెచ్చుకుని బీజేపీ పోటీ పడింది. సరే.. ఈ రెండున్నరేళ్లలో బీజేపీ బలపడింది..పైగా జనసేనతో పొత్తు పెట్టుకుంది కాబట్టి.. ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని అనుకుందామనుకున్నా.. బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే మాదిరిగా ఉందని తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్ఫుటమైంది.

2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీకి మొత్తంగా వచ్చిన ఓట్లు 2,63,849.. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తికి వచ్చిన మెజారిటీ 2,71,592 ఓట్లు కన్నా తక్కువ. ఆ ఎన్నికల్లో బీజేపీ, జనసేనలు కలసి పోటీ చేస్తే.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు వచ్చిన ఓట్లు కేవలం 57,080 మాత్రమే. అంటే ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో సరాసరి పది వేల ఓట్లు కూడా రాలేదు.

ఇక సోము వీర్రాజు అన్నట్లు ప్రజా వ్యతిరేకతను చూసి వైఎస్‌ జగన్‌ ప్రచారానికి రాలేదనుకుందామంటే.. తిరుపతి ఉప ఎన్నిక జరిగి ఆరు నెలలే కావస్తోంది. ఇంతలోనే వైసీపీ అంత ప్రజా వ్యతిరేకతను తెచ్చుకునేలా పాలన చేసిందా..? బీజేపీ బలంగా ఎలా తయారైంది..? అనే విషయాలు సోము వీర్రాజే చెప్పాలి.

2019 ఎన్నికల్లో బద్వేలులో బీజేపీ తరఫున మాజీ ఎమ్మెల్యే తిరువూరి జయరాములు పోటీ చేయగా.. ఆయనకు వచ్చిన ఓట్లు కేవలం 735 మాత్రమే. అదే ఎన్నికల్లో నోటాకు వచ్చిన ఓట్లు 2004. బీజేపీ కన్నా నోటాకే మూడు రెట్లు ఓట్లు ఎక్కువగా వచ్చాయి. గణాంకాలు, పార్టీ పరిస్థితి ఎలా ఉందో బాగా తెలిసిన సోము వీర్రాజు.. కేంద్ర బలగాలు పంపండి.. సీఎం జగన్‌ ప్రజా వ్యతిరేకత వల్ల ప్రచారానికి రావడంలేదు.. అంటూ మాట్లాడితే ఎబ్బెట్టుగా గాక మరెలా ఉంటుంది..?

Also Read : Kakinada Corporation – మేయర్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం.. ఆ 9 మంది మినహా అందరూ వైసీపీనే..