iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ ఎందుకు ఓడిపోతోందో, అసలు ఇక్కడి జనం అభిమతం ఏమిటో తెలుసుకోకుండా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఉద్యమాలు చేస్తామని ప్రకటనలు చేయడంపై జనంలో విస్మయం వ్యక్తమవుతోంది. విజయవాడలో మంగళవారం బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విలేకర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు విస్తుగొలిపేలా ఉన్నాయని ఆ పార్టీ అభిమానుల సైతం వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ఒక ప్రణాళిక రూపొందించాలనే నిర్ణయాన్ని పార్టీ తీసుకొందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై బీజేపీ ఉద్యమం చేస్తుందని.. రానున్న రోజుల్లో ఆందోళనలు చేపడతామని చెప్పారు. ఈ నెల 26న విజయవాడలో జరిగే పార్టీ సమావేశంలో ఉద్యమ కార్యకలాపాలను రూపకల్పన చేస్తామని కూడా స్పష్టం చేశారు.
ప్రత్యేక శ్రద్ధ అంటే?
ప్రత్యేక హోదా కంటే.. ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేక శ్రద్ధతో చూద్దామని తిరుపతి వచ్చిన అమిత్ షా తమకు స్పష్టం చేశారని సోము వీర్రాజు వెల్లడించారు. ప్రత్యేక శ్రద్ధ అంటే ఏం చేస్తారు? గత తెలుగుదేశం హయాంలో ప్రత్యేక హోదాకు బదులు స్పెషల్ ప్యాకేజీ ఇస్తామని బీజేపీ చెప్పడం, అందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంగీకరించడం, ఆ హామీ అటకెక్కడం తెలిసిందే కదా అన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడి ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదాను పక్కన బెట్టిన కారణంగానే 2019 ఎన్నికల్లో రెండు పార్టీలకు జనం గుణపాఠం చెప్పారు. టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓటమి చెందగా, బీజేపీకి నోటా కన్న తక్కువ ఓట్లు వచ్చాయి. ఆ విధంగా ఓడిపోవడానికి కారణమైన బీజేపీ ఏపీ పట్ల అనుసరిస్తున్న వైఖరిని సమీక్షించుకోకుండా ఉద్యమాలు నిర్మిస్తామంటే ఉపయోగం ఏమిటి? రాష్ట్ర విభజనకు కారణమైన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలపైఆంధ్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అందుకే అన్నేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించారు. పార్లమెంట్‌లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించిన ప్రత్యేక హోదా హామీని కూడా అమలు చేయని బీజేపీపై కూడా ఏపీ జనం అంతే గుర్రుగా ఉన్నారు. ఈ విషయం కమలనాథులు గ్రహించకుండా మళ్లీ ప్రత్యేక శ్రద్ద చూపుతామంటే జనం నమ్ముతారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
Also Read : Amit Sha,Sujana,CM Ramesh – సుజనా, సీఎంలకు అమిత్ షా టార్గెట్…? గురువుగారి గుండెల్లో గునపం…!
విశాఖ ఉక్కు గురించి చెప్పలేదా?
ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే జోన్, ట్రైబల్ యూనివర్సిటీకి నిధులు, మిగతా యూనివర్సిటీలను సత్వరం పూర్తి చేయాలని, రైతులకు సంబంధించిన సమస్యలను అమిత్ షా తిరుపతికి వచ్చిన సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు సోము వీర్రాజు చెప్పారు. మరి ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా అపే అంశం, ఇక్కడి కార్మికులు నెలల తరబడి చేస్తున్న ఆందోళన విషయం అమిత్ షా దృష్టికి తీసుకెళ్లలేదా? విభజన చట్టంలోని అంశాలు, జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం సత్వర పూర్తి విషయం కనీసం రాష్ట్ర నాయకులు అమిత్ షా వద్ద ప్రస్తావించలేదా అన్న అనుమానాలు జనానికి కలుగుతున్నాయి.
అధికారం ఇవ్వకుంటే అంతేనా..
మాది సంస్కారమైనటువంటి పార్టీ.. మాకు అధికారం ఇవ్వండి.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం అంటున్న సోమువీర్రాజు అధికారం ఇవ్వకపోతే ఐదుకోట్ల ఆంధ్రుల సమస్యలను కనీసం పట్టించుకోరా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. అధికారం ఇవ్వనందుకే ఇన్నాళ్లూ రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన సమస్యలను పరిష్కరించలేదా? కేంద్రంలో అధికారం ఉన్నా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య విషయాలపై ఉదాసీనంగా వ్యవహరిస్తూ మాది సంస్కారమైనటువంటి పార్టీ అనడం భావ్యమేనా? మీరు మా పార్టీకి ఓట్లు వేయకపోయినా మేం రాష్ట్రానికి ఇన్ని పనులు చేశాం. ఇంత అభివృద్ధి సాధించామని చెప్పి జనాన్ని ఓట్లు అడిగితే బావుంటుంది. వారి అభిమతం తెలుసుకోకుండా అధికారం కోసం ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రయోజనం ఉంటుందా అన్నది కమలనాథులు తెలుసుకుంటే మంచిది అన్న సూచనలు ఆ పార్టీ అభిమానుల నుంచే వినిపిస్తున్నాయి.
Also Read : ABN Andhra Jyothi, Amit Shah, AP BJP – నాపై దాడి చేసిన వారికి సన్మానం చేయలేదా ?