Idream media
Idream media
గురివింద తన నలుపు ఎరగదనే సామెత ప్రస్తుత రాజకీయాల్లో కొంత మంది నేతలు వ్యవహరిస్తున్న తీరునకు అతికినట్టు సరిపోతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు.. రాష్ట్రాలలో ఉన్న పార్టీల ప్రభుత్వాల నిర్ణయాలపై చేస్తున్న విమర్శలు చూస్తుంటే.. పైన పేర్కొన్న సామెత గుర్తుకువస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఈ రోజు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం విశాఖలోని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతోందని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేబదులు.. లోటస్ పాండ్‌లోని ఆస్తులను తాకట్టు పెట్టువచ్చు కదా..? అంటూ ఆయన ఉచిత సలహా కూడా ఇచ్చారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన వీర్రాజు మాట్లాడిన తీరు విడ్డూరంగా ఉంది. మనం ఒక వేలు ఇతరుల వైపు చూపిస్తే.. నాలుగు వేళ్లు మనవైపు చూపిస్తాయనే తర్కాన్ని సోము ఇక్కడ మరిచిపోయినట్లున్నారు. జాతీయ వాదాన్ని తరుచూ వినిపించే బీజేపీ ప్రభుత్వం.. దేశ సంపదను పెంచుతూ, కొత్త కంపెనీలు ఏర్పాటు చేస్తూ పరిపాలన చేస్తుంటే సోము వీర్రాజు.. రాష్ట్ర ప్రభుత్వ తాకట్టు విధానాలపై విమర్శలు చేసేందుకు అకాశం ఉండేది. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోంది..? ప్రభుత్వ రంగ సంస్థలు ఒక్కొక్కదాన్ని తెగనమ్ముతోంది. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో… ప్రభుత్వ కంపెనీల అమ్మకానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. లాభాల్లో ఉన్న సంస్థలు, నష్టాల్లో ఉన్న సంస్థలు అనే వ్యత్యాసం లేకుండా.. ప్రతి సంస్థను అమ్మేస్తున్నారు. ఈ జాబితాలో విశాఖ ఉక్కు పరిశ్రమ కూడా ఉంది.
ఆస్తులను అమ్మడమే కాదు.. బీజేపీ ప్రభుత్వ ఏడేళ్ల పాలనలో కొత్తగా 80 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది. 2014 వరకు దేశం అప్పులు 50 లక్షల కోట్లు అయితే.. మోదీ ప్రభుత్వం ఏడేళ్లలోనే 80 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది. వీటికి అధనంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటాయి. ఎరువులపై రాయితీలను ఎత్తివేశారు. జీఎస్టీ రూపంలో ప్రతి నెలా లక్ష కోట్ల రూపాయలకుపైగా ఆదాయం వస్తోంది. మరి ఈ నగదు అంతా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందనే ప్రశ్నకు సోము వీర్రాజు ఏం సమాధానం చెబుతారు..?
ఆస్తులను తాకట్టు పెడితే.. ఐదేళ్లకో, పదేళ్లకో మళ్లీ వాటిని విడిపించుకోవచ్చు. అవే ఆస్తులను అమ్మేసిన తర్వాత మళ్లీ కావాలంటే వస్తాయా..? తాకట్టు పెట్టాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ముఖ్యమంత్రి సొంత ఆస్తులను తాకట్టు పెట్టవచ్చు కదా..? అంటూ ఉచిత సలహాలు ఇస్తున్న సోము వీర్రాజుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆస్తులను తెగనమ్మే విధానం కన్నా.. రాష్ట్ర ప్రభుత్వ తాకట్టు విధానం పెద్ద పొరపాటుగా తోస్తుండడం విడ్డూరంగా ఉంది.
Also Read : AP High Court, Housing Scheme నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు పథకానికి తొలగిన అడ్డంకులు