Idream media
Idream media
సందర్భానుసారంగా కొన్ని రాజకీయ పార్టీలు తమ విధానాలను మార్చుకుంటుంటాయి. కొంత మంది నేతలు భిన్నమైన తీరుతో వ్యవహరిస్తుంటారు. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో.. ఇది సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం అధికారమే కాబట్టి.. ఆయా పార్టీలు ఆ దిశగా తమ విధానాలు మార్చుకుంటూ ఉంటాయి. ప్రజలు వాటిని విశ్వసిస్తే.. అధికారం దక్కుతుంది. లేదంటే మళ్లీ ఐదేళ్ల వరకు వేచి చూడాల్సిందే. ఈ తరహా రాజకీయాన్నే ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అవలంభిస్తోంది. చరిత్రలో తొలిసారి.. ఏపీలో బీజేపీ సొంతంగా ఎదగాలని ఆశిస్తోంది. ప్రతిపక్ష స్థానం.. ఆ పై అధికారం అంటూ ఆ పార్టీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు.
ఇన్నాళ్లు ఓ పార్టీ భుజాలపై చేతులేసి అడుగులు వేసిన బీజేపీ.. ఆ మచ్చ తొలగించుకునేందుకు, సొంతంగా ఎదిగేందుకు ఆలోచనలు చేసింది. సోము వీర్రాజు అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. ఆ పార్టీ సొంతంగా ఆలోచించడం మొదలుపెట్టింది. సొంత విధానాలను అవలంభించింది. సొంత ఎజెండాతో రాజకీయ కార్యక్రమాలు నిర్వహించింది. ప్రజల అభీష్టం మేరకు కొన్ని నిర్ణయాలకు కట్టుబడి ఉంది. విశాఖ ఉక్కు, రైల్వే జోన్ వంటి విషయాల్లో జాతీయ విధానానికి కట్టుబడి ఉంది. రాయలసీమలో హైకోర్టు పెట్టాలనే తన రాయలసీమ డిక్లరేషన్‌కు కట్టుబడి ఉంది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని.. మూడు రాజధానులు కాదు 30 రాజధానులు అయినా పెట్టుకోవాలని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ సోము వీర్రాజు మాట్లాడారు.
Also Read : కష్టకాలంలో రాష్ట్రాలకు ఉరటనిచ్చేలా కేంద్రం నిర్ణయం
ఇది నిన్న, మొన్నటి వరకు ఏపీ బీజేపీ నేతలు, ముఖ్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడిన మాటలు. అవలంభించిన విధానాలు. కట్ చేస్తే.. సోము వీర్రాజు పూర్తిగా మారిపోయారు. సొంతంగా బలపడడం సాధ్యం కాదనుకున్నారో, లేక ఒంటరి పోరు చేయలేమనుకున్నారో, రిస్క్ ఎందుకు.. మునుపటిలాగే ఓ పార్టీ భుజంపై చేతులు వేసి వెళదామనుకున్నారో గానీ.. సోము వీర్రాజు టీడీపీ బాటలోకి వచ్చేశారు. ఎంతగా అంటే.. టీడీపీ పలికిన మాటలనే పలికేంతగా సోము వీర్రాజు మారిపోయారు. తాజాగా ఆయన చేసిన ఓ వ్యాఖ్య.. సోము వీర్రాజు ఎంతలా మారిపోయారనేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. మోదీ పంజాబ్ పర్యటనలో చోటు చేసుకున్న ఘటనపై కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేసేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సోము.. అదే సమావేశంలో ఏపీ రాజధాని అంశంపై మునుపటికి భిన్నంగా మాట్లాడారు. ఒక వర్గం వారిని ఇబ్బంది పెట్టేందుకే వైసీపీ రాజధాని తరలింపు అంశాన్ని తెరపైకి తెచ్చిందంటూ సోము వీర్రాజు విమర్శించి.. రాజధాని అంశంపై తన స్టాండ్‌ను మార్చుకున్నారు.
ఓ వర్గం వారిని ఇబ్బంది పెట్టేందుకే వైసీపీ మూడు రాజధానులను ఏర్పాటు చేస్తోందంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి ఆ పార్టీ నేతల వరకు మాట్లాడుతున్నారు. టీడీపీ అనుకూల మీడియా కూడా ఇదే విషయంపై చర్చలు నడుపుతోంది. ఇప్పుడు వీర్రాజు కూడా.. అదే మాట మాట్లాడుతుండడం రాజకీయాల్లో నేతలు ఎంత వేగంగా తమ తీరును మార్చుకుంటారో తెలియజేస్తోంది. మొన్నటి వరకు మూడు రాజధానులు కాదు 30 రాజధానులు పెట్టుకోండి.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న సోము.. ఈ రోజు వైసీపీ రాజధానిని తరలించే అంశాన్ని తెరపైకి తెచ్చిందంటూ.. ఏ మాత్రం అవగాహన లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. పైగా తాము అధికారంలోకి వస్తే.. మూడేళ్లలో అమరావతిలో రాజధాని కడతామంటూ చెప్పుకొస్తున్నారు. వైసీపీ రాజధానిని తరలించడం లేదు.. అమరావతితోపాటు మరో రెండు రాజధానులను ఏర్పాటు చేస్తోందన్న విషయం.. సోముకు తెలిసినా.. కావాలనే టీడీపీ వారు మాట్లాడుతున్నట్లుగా.. రాజధానిని తరలించేస్తున్నారంటూ పూర్తిగా టీడీపీ బాటలోకి వెళ్లిపోయారు. మరి రాబోయే రోజుల్లో ఏపీ బీజేపీని ఏ దిశగా సోము వీర్రాజు నడిపిస్తారో చూడాలి.
Also Read : యూపీ ఎటో ‘వీటో’ తేల్చేసింది..!