Idream media
Idream media
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. గురువారం కడప, కర్నూలు జిల్లా ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సోము వీర్రాజు.. ఆ తర్వాత తాను ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడానో అర్థమైనట్లుంది. రాయలసీమ ప్రజల నుంచి.. ముఖ్యంగా కడప, కర్నూలు జిల్లా ప్రజలు, రాజకీయ నేతలు, మేథావులు, కవులు, సాహిత్యకారులు, మేథావులు, విద్యావంతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో మేల్కొన్న సోము వీర్రాజు.. తాను అలా అనలేదంటూ వివరణ ఇచ్చారు. కడప జిల్లా ప్రజలకు వరుసబెట్టి క్షమాపణలు చెబుతున్నారు.
ఆవేశంలోనో లేక మాట తూలినో అంటే.. సోము వీర్రాజు క్షమాపణలను కడప, కర్నూలు జిల్లాల ప్రజలు స్వీకరించేవారు. కానీ సోయలో ఉండే.. మీడియా సమావేశంలో ప్రజలను కించపరిచేలా సోము వీర్రాజు మాట్లాడారు. ‘‘కర్నూలులో ఒక ఎయిర్‌పోర్ట్, కడపలో ఇంకో ఎయిర్‌పోర్ట్.. చంపుకునే వారికి ఎయిర్‌పోర్ట్స్ ఎందుకు..’’ అంటూ.. అహంకార ధోరణితో సోము మాట్లాడడం ఆ ప్రాంత ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. రాలయసీమ, కడప చరిత్ర తెలుసుకో అంటూ.. మేథావులు తమ కలాలకు పని చెబుతూ సోము వీర్రాజును, బీజేపీని తూర్పారబడుతుండడంతో మరో సారీతో వీర్రాజు ముందుకొచ్చారు.
ఈ సారి సారీలో రాయలసీమ ప్రాంతాన్ని పొగుడుతూ.. క్షమాపణలు చెప్పారు. ‘‘ రాయలసీమ రతనాల సీమ.. ఈ పదం నా హృదయంలో పదిలం. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వతీరును విమర్శించే విషయంలో వాడిన పదాల వల్ల రాయలసీమ ప్రజల మనసులు గాయపడ్డాయి. ఈ పదాలను వాపసు తీసుకుంటున్నాను. ఈ విషయంలో క్షమాపణలు చెబుతున్నాను. నేను నిరంతరం రాయలసీమ అభివృద్ధి విషయంలో అనేక వేదికలపై ప్రస్తావిస్తున్న విషయం ఆ ప్రాంత ప్రజలకు తెలుసు. రాయలసీమ నికర జలాలు, పెండింగ్ ప్రాజెక్టుల విషయాలను అనేక సందర్భాల్లో ప్రస్తావించాను. రాయలసీమ ఇంకా వేగవంతం కావాలని భారతీయ జనతా పార్టీ ఆలోచన..’’ అంటూ సోము వీర్రాజు తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశారు.
సోము వీర్రాజు మరోసారి సారీ చెప్పినా.. ఆయన మాటల్లో నిజాయితీ లోపించినట్లు కనిపిస్తోంది. ప్రజల నుంచి విమర్శలు రావడంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా ఇది పోస్టు చేశారనే భావన నెలకొంది. మొదటి సారి క్షమాపణలు చెప్పిన సమయంలో చెప్పిన కారణం.. ఈ రోజు సారీ చెప్పడంలో పేర్కొన్న కారణం వేర్వేరుగా ఉండడం సోము వీర్రాజు వైఖరిని తెలియజేస్తోంది. నిన్న చెప్పిన సారీలో.. ‘‘ కడప ప్రజలకు హత్య రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. నా మాటలను కొంతమంది వక్రీకరించారు. మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుని దృష్టిలో పెట్టుకుని మాత్రమే నేను మాట్లాడాను. ఆయన హత్యలో కొంత మంది రాజకీయ నాయకులు ఉన్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో నేను మాట్లాడాను..’’ అంటూ వివరణ ఇచ్చిన సోము వీర్రాజు.. ఈ రోజు అందుకు భిన్నమైన కారణం చెబుతూ.. సారీ చెప్పడం ఆయన ద్వంద్వ వైఖరిని తెలియజేస్తోందనే విమర్శలు వస్తున్నాయి.
Also Read : కడప ప్రజలకు సోము వీర్రాజు క్షమాపణలు