రామ్ మాధవ్ ఘర్ వాపసి!!

  • Published - 02:22 PM, Fri - 26 March 21
రామ్ మాధవ్ ఘర్ వాపసి!!

వారణాసి రామ్ మాధవ్.. చాలామందికి ఈ పూర్తి పేరు వింటే ఎవరో కొత్త వ్యక్తి అని గుర్తుపట్టక పోయే ప్రమాదం ఉంది. ఆర్ఎస్ఎస్ రామ్ మాధవ్ లేదా బిజెపి రామ్ మాధవ్ అంటేనే టక్కున ఢిల్లీ స్థాయి నేతలు సైతం గుర్తుపడతారు. తన సంస్థ పేరును తర్వాత పార్టీ పేరును ఇంటి పేరుగా మార్చుకున్న రామ్ మాధవ్ శకం బిజెపిలో ఇక ముగిసిపోయి నట్లే అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వెంకయ్యనాయుడు తర్వాత బిజెపిలో కీలకమైన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్థానం వరకు వెళ్లిన రామ్ మాధవ్ ప్రస్తుతం సైలెంట్గా మళ్లీ తన మాతృ శాఖ సంఘపరివార్ లోకి వెళ్లిపోయారు.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన వారణాసి రామ్ మాధవ్ చాలా లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తారు. ఆయన ఆర్ఎస్ఎస్ లో గాని బీజేపీ లోకి వచ్చిన తర్వాత గాని కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. అయినప్పటికీ బిజెపి రాష్ట్ర నేతలతో ఆయనకు అద్భుతమైన పరిచయాలు ఏమీ లేవు. ఇక సొంత కేడర్, అనుచరుల మాట అస్సలు లేవు. కేవలం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నీడనే నమ్ముకొని తర్వాత బీజేపీ లోకి వెళ్ళిన ఆయన పూర్తిగా సిద్ధాంతాల మీదే రాజకీయాలు నడిపారు.

1964 లో జన్మించిన రామ్ మాధవ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో పట్టభద్రులు. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో పొలిటికల్ సైన్స్ ను కర్నాటకలోని మైసూర్ యూనివర్సిటీలో పూర్తి చేశారు. యుక్తవయసులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంగ్ తో ఏర్పడిన అనుబంధం ఆయనను పూర్తిస్థాయిలో దానిలో పనిచేసేలా ప్రోత్సహించింది.

1981లో ఆర్ఎస్ఎస్ లో చేరిన ఆయన పలు విభాగాలకు, కీలకమైన కేడర్ల లో పనిచేశారు. హిందుత్వ సంస్థలు నిర్వహించే భారతీయ ప్రజ్ఞ మాసపత్రిక ఎడిటర్ గా వ్యవహరించిన ఆయన, తెలుగు వారాంతపు పత్రిక జాగృతికి అసోసియేట్ ఎడిటర్గా పనిచేశారు. ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో వచ్చే పత్రికకు ఆయన పూర్తిస్థాయి జర్నలిస్టుగా బాధ్యతలు నిర్వర్తించారు. 2003 నుంచి 2014 వరకు ఆర్ఎస్ఎస్ కు జాతీయ అధికార ప్రతినిధిగా సేవలందించిన రామ్ మాధవ్ ను బీజేపీ అధికారంలోకి రాగానే లాంచనంగా పార్టీ జనరల్ సెక్రటరీ గా తీసుకుంది.

Also Read : రాజధాని వికేంద్రీకరణపై కదలిక

2014 నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న రామ్ మాధవ్ కు బిజెపి లోను కీలకమైన బాధ్యతలు అప్పగించారు. పార్టీ ఈశాన్య భారత దేశపు బాధ్యతలను నిర్వర్తించారు. అస్సాం లాంటి రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకు రావడం లోనూ కీలకంగా వ్యవహరించారు. బీజేపీలో చేరిన తర్వాత ప్రధాని మోడీ, బిజెపి అప్పటి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలూ రామ్ మాధవ్ కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించారు.

బిజెపికి తీవ్రమైన రాజకీయ పార్టీలను సైతం తమ స్నేహ తీసుకురావడంలో రామ్ మాధవ్ చాకచక్యం ఎంతో పని చేసింది అన్నది బిజెపి నాయకులు చెబుతారు. కాశ్మీర్ వ్యవహారాల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొని పీడీపీతో కలిసి కాశ్మీర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పెద్ద విషయం గా ఇప్పటికి చెప్పుకుంటారు. పూర్తి బావ వైరుధ్యం ఉన్న ఆ పార్టీతో కలిసి బీజేపీ ముందుకు వెళ్లడం దేశ చరిత్రలోనే కీలకంగా చెప్పవచ్చు.

మోదీ విదేశీ పర్యటన లోనూ రాంమాధవ్ కీలకంగా వ్యవహరించే వారు. నరేంద్ర మోదీ ఏదైనా దేశానికి పర్యటనకు వెళ్లడానికి ముందుగానే రామ్ మాధవ్ ఆ దేశానికి వెళ్ళి అక్కడి పరిస్థితులను వ్యక్తులను కలిసి ఆరా తీయడం, పరిస్థితులను సమీక్షించడం చేసేవారు. రామ్ మాధవ్ వెళ్లిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులను ఆయన ఇచ్చే నివేదికను బట్టి మోడీ పర్యటన ఖాయం అయ్యేది. ప్రధాని హోదాలో మోదీ వెళ్లి వచ్చిన తర్వాత మళ్లీ అదే దేశానికి మరో సారి వెళ్ళి ఫాలోఅప్ చేసేవారు. ప్రధాని వెళ్లిన తర్వాత అక్కడ ఉన్న వ్యక్తుల, పరిస్థితులను అంచనా వేయడంలో రామ్ మాధవ్ చురుగ్గా వ్యవహరించే వారు అన్నది ఆ పార్టీ నేతల మాట. ఒకానొక దశలో రామ్ మాధవ్ కు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి, మోదీ తన క్యాబినెట్ లో కీలకమైన శాఖలు అప్పగిస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అది కొద్ది కాలానికే అది ప్రచారం గానే ముగిసిపోయింది.

Also Read : రత్నప్రభనే ఖాయం చేసిన బీజేపీ, కమలదళం ఆశలు పండేనా

ఇంతటి కీలక హోదాల్లో, బిజెపిలో ముఖ్య నాయకుల్లో ఒకడిగా భావిస్తున్న రాంమాధవ్ ను తన మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వెనక్కి పిలవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనిపై పెద్దగా చర్చ జరగలేదు గానీ, ఓ కీలకమైన హోదాలో ఉన్న తెలుగు వ్యక్తి తిరిగి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లోకి వెళ్లిపోవడం ముఖ్యమైన విషయమే. ఆర్ఎస్ఎస్ లోని కోర్ కమిటీలో రామ్ మాధవ్ కు కీలకమైన బాధ్యతలు అప్పగించడానికి ఆయనను వెనుకకు పిలిచారు అని చెబుతున్నా , రాజకీయపరంగా బిజెపిలో ఇక ఆయన శకం ముగిసినట్లే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపై ఆర్ఎస్ఎస్ పెద్దలు మాత్రం సంఘ్ లోని కీలకమైన 12 మంది సభ్యుల కోర్ కమిటీలో  రామ్ మాధవ్ బాధ్యతలు వ్యవహరించాల్సి ఉండటంతోనే వెనక్కి వెళ్లినట్లు చెబుతున్నారు.

మరోపక్క ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ బిజెపిల మధ్య సఖ్యత పూర్తిగా చెడిందని, సంఘ్ పరివార్ మాటలు బిజెపిలోని కీలకమైన నేతలు వినే పరిస్థితి క్రమంగా కనుమరుగు కావడంతోనే తమ నేతలు బీజేపీ కు పని చేయాల్సిన అవసరం లేదు అనే కోణంలో రామ్ మాధవ్ ను వెనక్కు పిలిపించి ఉంటారు అనే మాటలు ఢిల్లీ సర్కిల్ లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఏది ఏమైనా దీనిపై ఎలాంటి స్పష్టత లేకుండానే చాలా నిశ్శబ్దంగా తెలుగు వాడు రామ్ మాధవ్ మళ్ళీ సంఘ్ పరివార్ ఆఫీసుకు వెళ్లి పోయి తన పనిలో నిమగ్నమయ్యాడు.

Also Read : మంటూరు ఎస్టేటు భూములు ఎవరికి దక్కుతాయి?

Show comments