ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలను బలికొంది. దేశంలో మృతుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమైనట్లు కనిపిస్తున్నా…. అందరిలోనూ ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళన ఉంది. మాస్కులు, శానిటైజర్లు వినియోగిస్తున్నా సామూహిక కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ఇప్పటికీ జనం జంకుతూనే ఉన్నారు. ఈ అభద్రతలోంచి బయటపడాలంటే వాక్సిన్ ఒక్కటే మార్గం. ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా వాక్సిన్ వస్తుందన్న భరోసాను కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. స్వయంగా ప్రధాని మోదీ ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు ఉద్ఘాటించారు. నిజంగానే వాక్సిన్ అందుబాటులోకి వచ్చినా… అది అందరికీ చేరుతుందా? లేదా? అనే ప్రశ్న ఇప్పుడు సామాన్యులను వెంటాడుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ఈ సందేహానికి మరింత బలాన్నిస్తోంది.
వాక్సిన్ అభివృద్ధి చేయడానికి దాదాపు ఏడెనిమిదేళ్ల సమయం పడుతుంది. కానీ కరోనా తీవ్రత దృష్ట్యా ప్రపంచ దేశాలు త్వరితగతిన వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసే పనిలోపడ్డాయి. ఇప్పటికే పలు దేశాల్లో ఈ ప్రయోగాలు మూడో దశకు చేరుకున్నాయి. తాజాగా ప్రధాని మోదీ దేశంలోని వేరు వేరు ప్రాంతాల్లో వాక్సిన్ అభివృద్ధి కోసం జరుగుతున్న ప్రయోగాలను పరిశీలించారు. మరోవైపు రష్యా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కూడా దేశంలో ప్రారంభమయ్యాయి. స్పుత్నిక్ వీ టీకా ప్రయోగాలకు డాక్టర్ రెడ్డీస్ సంస్థ కేంద్రం నుంచి అనుమతులు పొందింది. మొత్తానికి ఈ ప్రయోగాలు ఫలిస్తే మరో ఏడాదిలో వాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. వాక్సిన్ అందుబాటులోకి వచ్చినా…. అది దేశ ప్రజలందరికీ చేరుతుందా? లేదా? అనేది అసలు ప్రశ్న.
తూచ్…. మేమలా అనలేదు!
కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని, వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే అందరికీ అందిస్తామని ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. కానీ.. ఇప్పుడు కేంద్రం మాటమార్చింది. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇస్తామని తామెప్పుడూ చెప్పలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అంటున్నారు. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి అందరికీ టీకాలు వేయాల్సిన అవసరం లేదని తేల్చేశారు. దీంతో ఇంతకాలం కేంద్రప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ వట్టివే అని మరోమారు రుజువైంది. కోవిడ్ 19 వైద్యం కార్పోరేట్ ఆసుపత్రులకు లాభాలు చేకూర్చింది. కరోనా సోకిన అందరికీ ఒకేరకమైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఫలితంగా ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఆర్థికంగా నష్టపోయారు. ఇప్పుడు వ్యాక్సి్న్ విషయంలోనూ అలాంటి అంతరాలు రిపీట్ అవుతాయానే అనుమానాలు మొదలయ్యాయి.
తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, గ్రేటర్ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే అందరికీ కరోనా వ్యాక్సిన్ ను అందిస్తామని బీజేపీ ప్రకటించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజా ప్రకటనను, బీజేపీ ఎన్నికల వాగ్దానంతో పోల్చితే ఒక విషయం స్పష్టమవుతోంది. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే వాక్సిన్ ను అందించే ప్రయత్నం జరుగుతున్నట్లు అర్థమవుతుంది. త్వరలో జరగనున్న బెంగాళ్, తమిళనాడు ఎన్నికల్లో కూడా బీజేపీ ఇలాంటి వాగ్దానాన్ని ఇచ్చే అవకాశం లేకపోలేదు. అంటే.. ప్రజలకు వ్యాక్సిన్ చేరాలంటే ఎన్నికలు రావాల్సిందేనా? మొత్తానికి ప్రాణాలు గుప్పిటపెట్టుకొని బతుకుతున్న జనాల నెత్తిన మరో పిడుగువేసింది కేంద్ర ప్రభుత్వం. వ్యాక్సిన్ తయారీ పూర్తయ్యే సరికి ఇంకా ఎన్ని ట్విస్ట్ లు ఇస్తుందో?