Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో బలపడేందుకు భారతీయ జనతా పార్టీ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. సోము వీర్రాజు అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చేయని ప్రయత్నమంటూ లేదు. 2019 ఎన్నికల వరకు బీజేపీ రాష్ట్రంలో ఒంటిరిపోరు చేసింది లేదు. ఏదో ఒక పార్టీతో కలసి కమలం పార్టీ ఏపీలో రాజకీయాలు చేసింది. ఫలితంగా ఆ పార్టీకి ఎదుగుదల లేకుండా పోయింది. దీంతో పార్టీ నిర్మాణం ఆది నుంచి చెపట్టాల్సి వస్తోంది. బూత్ స్థాయి నుంచి మండల స్థాయి నేతలు, నియోజకవర్గ స్థాయి నేతల కొరతను ఆ పార్టీ ఎదుర్కొంటోంది.
సోము వీర్రాజు పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను పార్టీలో చేర్చుకునేందుకు యత్నించారు. ఆ మేరకు పలువురు నేతలను స్వయంగా కలసి పార్టీకిలోకి ఆహ్వానించారు. టీడీపీలో నిరాదారణకు గురైన మాజీ ప్రజా ప్రతినిధులు కొందరు బీజేపీలో చేరారు. సోము రాకతో ప్రారంభంలో బీజేపీలో కొనసాగిన ఊపు.. ఆ తర్వాత తగ్గిపోయింది. ఏపీ పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో నేతల చేరిక ఆగిపోయింది. తిరుపతి ఉప ఎన్నిక వేళ బీజేపీ సత్తా ఏమిటో తెలిసింది. ఆ ఎన్నికల్లో ప్రధానంగా ద్వితియ శ్రేణి నేతల కొరతను బీజేపీ గమనించింది. దాన్ని అధిగమించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని తాజాగా ప్లాన్ చేసింది.
మండల స్థాయి నేతలను పార్టీలో చేర్చుకోవాలనే లక్ష్యాన్ని బీజేపీ నిర్ధేశించుకుంది. ఈ మేరకు పల్లె నిద్ర పేరుతో కార్యక్రమాన్ని రూపొందించుకుంది. ఈ నెల 20, 21 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు 500 పల్లెల్లో నిద్ర చేయాలని నిర్ణయించుకున్నారు. టీడీపీ బలహీనంగా ఉన్న పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకుంటూ ఆ పార్టీలోని మండల స్థాయి నేతలను బీజేపీలోకి ఆహ్వానించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఆ రెండు రోజుల పాటు బీజేపీ నేతలు పల్లెల్లో నిద్ర చేసి మండల స్థాయి నేతలలో మంతనాలు జరపనున్నారు.
టీడీపీ స్థానాన్ని తామే భర్తీ చేస్తామని సోము వీర్రాజు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలో బీజేపీ నేతలు ప్రకటనలు చేశారు. జాతీయ స్థాయి నేతల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకూ ఈ ప్రకటనను బలంగా వినిపించారు. బీజేపీ నేతల ప్రకటనలతో కొంత ఊపు వచ్చింది. నిజంగా బీజేపీ రెండో స్థానంలోకి వస్తుందేమోనని భావించారు. కొంత మంది నేతలు పార్టీలో చేరారు. అయితే అది మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. కమలం పార్టీకి ఆ స్థాయిలేదని తేలిపోయింది. మరి ఇప్పుడే ఏం చెప్పి మండల స్థాయి టీడీపీ నేతలను బీజేపీ ఆకర్షిస్తుందనేది ప్రధాన ప్రశ్న.
టీడీపీ ఏపీలో గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం నడుస్తోంది. భవిష్యత్‌లోనూ ఈ రెండు పార్టీల మధ్యే పోటీ ఉంటుంది. స్థానిక నేతలు ఈ రెండు పార్టీలలో ఏదో ఒక దానిలో ఉంటేనే తమకు ఉపయోగమని భావిస్తారు. ఈ రెండు పార్టీలు కాకుండా బీజేపీలో ఉంటే ప్రయోజనమని కమలం నేతలు వారిని ఎలా మెప్పిస్తారనే అంశంపైనే పల్లె నిద్ర కార్యక్రమం విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నంత మాత్రాన మండల స్థాయి నేతలకు ఒరిగేది ఏమీ ఉండదు.
Also Read : మోదీకి అనుమానం మొదలైందా..?