iDreamPost
iDreamPost
వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే.. 70 సీట్లు గెలుచుకుంటాం.. తెరాసను గద్దె దించుతాం.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి తరుణ్ చుగ్ చేసిన వ్యాఖ్యలివి. ఆయనే కాదు.. ఆ పార్టీ రాష్ట్ర నేతలు కూడా తరచూ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. రాజకీయాల్లో ఇవి సాధారణమే గానీ.. మరీ అతిగా స్పందించడం, నేల విడిచి సాము చేయడం చేటు చేస్తుందని ఆ పార్టీ కిందిస్థాయి నేతలే అంతర్గత భేటీలో చర్చించుకుంటున్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో పార్టీకి జోష్ వచ్చిన మాట, అధికార తెరాసకు బీజేపీ గట్టి పోటీదారుగా మారిందన్న మాట వరకు ఓకే గానీ.. ఏకంగా 70 సీట్లు గెలిచేటంత సీను లేదని అంటున్నారు. చాలా చోట్ల అభ్యర్థులే దొరకని పరిస్థితుల్లో తరుణ్ చుగ్ తో సహా రాష్ట్ర నేతలు చేస్తున్న ప్రకటనలు గాలిలో మేడలు కడుతున్న చందంగా ఉన్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
గత ఎన్నికల్లో ఒకే ఒక్కటి
2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 స్థానాల్లో బీజేపీకి దక్కింది ఒకే ఒక్కటి. 105 స్థానాల్లో పార్టీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి. తర్వాత జరిగిన దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించగలిగారు. దాంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు పెరిగింది. బహుశా ఉప ఎన్నికల విజయాల మత్తే వారిని అధికారంపై ఆశలు రేపుతున్నట్లుంది. పార్టీలో పాత నాయకులు, కొత్తగా చేరిన వారిని కలుపుకున్నా కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేసే స్థాయి ఉన్న అభ్యర్థులు 40కి మించి దొరకరు. కానీ 70 స్థానాలు గెలిచేస్తామని అంటున్నారు. ఉప ఎన్నికలు వేరు, సాధారణ ఎన్నికలు వేరు. పైగా తెరాస తోపాటు మరో పోటీదారు కాంగ్రెసును తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఆ రెండు పార్టీలను ఢీకొనగలిగే అభ్యర్థులు ఎక్కడ ఉన్నారన్న ప్రశ్న పార్టీ శ్రేణుల్లోనే తలెత్తుతోంది. వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లకు పోటీ చేయాలనుకుంటే.. ఇప్పటి నుంచే ఆయా నియోజకవర్గాల్లో ఒకరిని ఎంపిక చేసి పార్టీ అభ్యర్థిగా బొట్టు పెడితే కొంతైనా వారు పుంజుకునే అవకాశం ఉంటుందని ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలువురు నేతలు సూచించారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందికదా అని ఉపేక్షిస్తే చివరికి అనామకులకు అభ్యర్థిత్వాలు కట్టబెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
ప్రభుత్వ వ్యతిరేకత, మోదీ ఆకర్షణపైనే ఆశలు
క్షేత్రస్థాయిలో చూస్తే అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులు దొరకడమే బీజేపీకి కష్టం. చాలా జిల్లాల్లో పార్టీ ఉనికే అంతంతమాత్రం. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలే దీనికి నిదర్శనం. మిగిలిన చాలా జిల్లాలలోనూ తెరాసను ఢీకొనేంత పటిష్ట స్థితిలో ఆ పార్టీ ఉందని కూడా చెప్పలేని పరిస్థితి. ఇంకా చెప్పాలంటే వేలాది పోలింగ్ కేంద్రాల్లో పార్టీకి క్రియాశీల కార్యకర్తలే లేరు. ఇక అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ దొరుకుతారన్నది ప్రశ్న. అయితే నేతల లెక్కలు వేరేగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని.. ఆ వ్యతిరేక ఓటు తమకు లభిస్తుందని వారు ఆశ పడుతున్నారు. ప్రధాని మోదీ ఆకర్షణ అదనపు బలంగా తోడవుతుందని భావిస్తున్నారు. అవన్నీ వర్కౌట్ అవ్వాలంటే ముందు సరైన అభ్యర్థులు ఉండాలి కదా!
Also Read : Kcr Trs – కేసీఆర్ వ్యూహకర్త కోసం చూస్తున్నారా?