Idream media
Idream media
తెలంగాణ రాజకీయాల్లో హఠాత్తుగా అందరి దృష్టీ తమవైపు తిప్పుకున్న బీజేపీ, దుబ్బాక, జీహెచ్‌ఎంసీలో ఊహించని ఫలితాలతో అంతర్మథనంలో ఉన్న టీఆర్‌ఎస్.. ఉనికే ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్.. ఇప్పుడు ఈ పార్టీల ప్రతిష్ఠ నాగార్జునసాగర్‌పై ఆధారపడి ఉంది. ప్రధానంగా టీఆర్‌ఎస్, బీజేపీలు ఆ నియోజకవర్గంపై ఇప్పటి నుంచే కన్నేశాయి. నోముల నర్సింహయ్య మృతితో త్వరలో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనుంది. తీవ్రమైన వ్యాఖ్యలు, ఆరోపణలు, ప్రత్యారోపణల అనంతరం జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ బలం భారీగా పుంజుకుంది. 4 నుంచి 48 సీట్లకు చేరుకుంది. తమకు తెలంగాణలో తిరుగులేదని ఇప్పటి వరకూ భావించిన టీఆర్‌ఎస్ గ్రేటర్ ఎన్నికల్లో ఎక్కువ సాట్లు సాధించిన పార్టీగా ఉన్నప్పటికీ గత ఎన్నికలతో పోల్చుకుంటే సంఖ్యాబలం భారీగా తగ్గింది. దీనిపై ఇప్పటికే పార్టీలో పోస్టుమార్టం కొనసాగుతోంది.
ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో..
నోముల ఆకస్మిక మృతితో తెలంగాణలో నాగార్జునసాగర్ స్థానం ఖాళీ అయింది. ఇప్పట్లో ఎన్నికలు లేవునుకున్న తరుణంలో త్వరలోనే మరో ఉప ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్నాయి. గ్రేటర్ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని పార్టీలన్నీ ఇప్పటి నుంచే ఆ నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీలలోని బలమైన నేతలపై దృష్టి పెట్టింది. వలసలను ప్రోత్సహిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో ఊపు మీదున్న బీజేపీ నాగార్జునసాగర్‌ను కూడా ఎలాగైనా కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ కూడా అప్రమత్తమైంది. జీహెచ్‌ఎంసీ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని నాగార్జున సాగర్ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అధిష్ఠానం పెద్దలు స్థానిక నేతలతో సంప్రదింపులు జరుపుతూ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
కేసీఆర్ వరాలు..
నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీంతో పాటు కేసీఆర్ కొత్త వరాలూ ప్రకటించారు. నల్లగొండ జిల్లా పరిధిలోని రెండు ప్రధాన ఎత్తిపోతల పథకాలతో పాటు మరికొన్ని ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నియోజకవర్గంలోని హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ఎత్తిపోతల పథకాల మంజూరుపై నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మూసీ నదిపై కేశవాపురం వద్ద కొండ్రపోల్ ఎత్తిపోతల పథకానికి రూ.75.93 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద 5875 ఎకరాలకు సాగు నీరు అందనుంది. సాగర్ ఎగువన ఉన్న నెల్లికల్ ఎత్తిపోతల పథకానికీ అనుమతినిచ్చారు. రూ.72.16 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. తద్వారా 4175 ఎకరాలు సాగులోకి రానుంది. దీంతో పాటు చిట్యాల వద్ద బల్నేపల్లి- చంప్లాతండా ఎత్తిపోతల ప్రాజెక్టును కూడా చేపట్టనున్నారు. రూ.219.90 కోట్లతో దీన్ని చేపట్టనున్నారు. వాడపల్లి ఎత్తిపోతల పథకం రూ.229.25 కోట్లతో నిర్మాణం జరగనుంది. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎంఆర్‌పీ) హైలెవెల్ కెనాల్, లో లెవెల్ కెనాల్‌ల పునరుద్ధరణకు రూ.2.47 కోట్లను మంజూరు చేశారు. ఈ ప్రాజెక్టులు, పథకాలన్నీ కూడా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ప్రయోజనం చేకూర్చేవే కావడం గమనార్హం. సంబంధిత జీవోలు విడుదల చేయడంతో హాలియాలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గ్రేటర్ ఎన్నికల వేడి ఇంకా చల్లారకముందే నాగార్జున సాగర్ హాట్‌టాపిక్‌గా నిలవడం గమనార్హం.