Idream media
Idream media
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించి మూడు రాజ«ధానులకు జై కొట్టిన బీజేపీ ఎంపీ, కర్నూలు జిల్లా నేత టీజీ వెంకటేష్.. తాజాగా రాజధానులపై సరికొత్త ప్రతిపాదన చేశారు. మూడు రాజధానుల ఏర్పాటు అంశం కోర్టులకు వెళ్లినందును ఇప్పట్లో తేలే అవకాశం లేదని టీజీ వెంకటేష్ అంచనా వేస్తున్నారు. అందుకే రాష్ట్రంలో వేసవి, శీతాకాల రాజధానులు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో వేసవి, శీతాకాల రాజధానులు ఏర్పాటు చేయాలని టీజీ పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని పనులు కంప్యూటర్లలో జరుగుతున్న తరుణంలో కార్యదర్శులు ఎక్కడ కంప్యూటర్ పెట్టుకుని కూర్చుంటే అదే రాజధాని అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీ తీసుకుని ఉత్తరాంధ్ర, రాయలసీమలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని కోరారు.
టీజీ వెంకటేశ్ తన ప్రతిపాదనల్లో కేవలం రాజధానుల పేర్లను మాత్రమే మార్చారు. వైసీపీ ప్రభుత్వం విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, రాయలసీమలో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని సమర్థించిన టీజీ.. తాజాగా కార్యనిర్వాహక రాజధాని పేరు స్థానంలో వేసవికాల రాజధాని, న్యాయ రాజధాని పేరు స్థానంలో శీతాకాల రాజధాని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం విశేషం. దేశంలో మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్ తదితర రాష్ట్రాలలో వేసవి, శీతాకాల రాజధానులు ఉన్నాయి.
మూడు రాజధానుల ఏర్పాటుకు బీజేపీ కూడా మద్ధతు తెలిపింది. ఆ పార్టీ నేతల్లోనే కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజ్యసభ సభ్యుల్లో సుజనా చౌదరి అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని ఉద్యమాలు చేస్తుండగా.. అదే బాటలో నడిచిన టీజీ వెంకటేష్ తన రాయలసీమ ప్రాంత ప్రయోజనాలు లక్ష్యంగా మూడు రాజధానులకు మద్ధతు తెలిపారు. ప్రస్తుతం మూడు రాజధానుల అంశంపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు ప్రతి రోజూ విచారణ చేస్తోంది. సుప్రిం కోర్టు ఆదేశాలతో హైకోర్టు వేగం పెంచింది. మరికొద్ది నెలల్లో విచారణ పూర్తయ్యే అవకాశం ఉంది. కొత్త ఏడాదిలోపు విచారణ పూర్తయి.. మూడు రాజధానుల అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి.