Arjun Suravaram
Arjun Suravaram
సాధారణంగా రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలు కనిపిస్తే పలకరిస్తుంటారు. అయితే కొన్ని పార్టీలు మాత్రం ఉప్పు నిప్పులాగా ఉంటాయి. అలాంటి పార్టీలకు చెందిన నేతలు అయితే దాదాపు పలకరించుకోవడమే కష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితి కర్ణాటకలోని కాంగ్రెస్,బీజేపీ మధ్య ఉంది. ఈ నేపథ్యంలో ఓ బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కాళ్లను మొక్కారు. ఈ ఘటన చూసిన బీజేపీ నేతలు షాకి గురయ్యారు. అయితే అసలు ఏం జరిగింది? ఎందుకు డీకే కాళ్లుకి బీజేపీ ఎమ్మెల్యే మొక్కారు? ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర్ నుంచి మునిరత్నం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆ నియోజకవర్గంలో బీజేపీ గెలవడంతో అభివృద్ధి పనులను ఆపేసినట్లు మునిరత్నం ఆరోపిస్తున్నాడు. తన నియోజకవర్గ అభివృద్ధి విషయంలో అన్యాయం జరిగిందని, మంజూరు చేసిన నిధులను వెనక్కి తీసుకున్నారని ఆరోపిస్తూ మునిరత్న బుధవారం నిరాహార దీక్ష చేశారు. రాజకీయ వైషమ్యాలతో తన నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆయన సోదరుడు సురేష్‌లకు వ్యతిరేకంగా విధాన సౌధలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప అక్కడకు చేరుకుని నచ్చజెప్పడంతో మునిరత్న నిరసన విరమించారు.
అక్కడి నుంచి బెంగళూరులోనే వేరే కార్యక్రమంలో పాల్గొన్న డీకే శివకుమార్ ను కలవడానికి మునిరత్నం వెళ్లారు. కొందరు యాక్టింగ్ చేసేందుకు వచ్చారని, వారి గురించి తర్వాత మాట్లాడతానని మునిరత్నంను ఉద్దేశించి డీకే శివకుమార్ అన్నారు. ఇక కార్యక్రమం ముగిసిన తర్వాత బయటకు వస్తున్న డీకే శివకుమార్ వద్దకు వెళ్లిన మునిరత్న.. అందరూ చూస్తుండగానే వంగి ఆయన కాళ్లకు నమస్కరించారు. దీంతో ఈ దృశ్యాన్ని చూసినవారంతా షాకయ్యారు. అయితే, వెంటనే డీకే ఆయన్ను వారించి ఇంటికి వస్తే కూర్చుని మాట్లాడుకుందామని తెలిపారు. ఆ తర్వాత నేరుగా సదాశివనగర్‌కు వెళ్లిన మునిరత్నతో డిప్యూటీ సీఎం చర్చలు జరిపారు.