iDreamPost
android-app
ios-app

హరీష్‌రావును కూడా టీఆర్‌ఎస్‌ నుంచి పంపేస్తారా..? ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యల్లో నిజమెంత..?

హరీష్‌రావును కూడా టీఆర్‌ఎస్‌ నుంచి పంపేస్తారా..? ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యల్లో నిజమెంత..?

తన్నీరు హరీష్‌ రావు.. తెలంగాణ రాజకీయాల్లో బలమైన నేత. కేసీఆర్‌ మేనళ్లుడుగానే కాకుండా.. తన పనితీరుతో తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో మామకు చేదోడు వాదోడుగా ఉన్న హరీష్‌ రావుపై తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై, కేసీఆర్‌ ప్రభుత్వం పాలన మొదలైన తర్వాత.. ఆయనకు, కేసీఆర్‌ కుటుంబానికి మధ్య పొరపొచ్చాలు వచ్చాయనే ప్రచారం పలుమార్లు జరిగింది. కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌కు, హరీష్‌రావుకు మధ్య ఆధిపత్యపోరు సాగుతోందని, పార్టీపై పట్టు కోసం ఎవరికి వారు పావులు కదుపుతున్నారనే వార్తలు అప్పుడప్పుడు హల్‌చల్‌ చేశాయి.

హరీష్‌ రావు టీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వస్తే.. తమ పార్టీలలో చేరాలని కాంగ్రెస్, బీజేపీలు ఆశించాయి. 2018లో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేటీఆర్‌కు, హరీష్‌రావుకు కేబినెట్‌లో దాదాపు 10 నెలల తర్వాత దక్కాయి. ఈ సమయంలోనూ మరోసారి కేటీఆర్, హరీష్‌ రావుల మధ్య విభేధాలు ఉన్నాయని, ఆ పంచాయతీ ఉండడం వల్లే వారిద్దరికీ మంత్రి పదవులు ఇవ్వలేదనే వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ప్రభుత్వం ఏర్పడిన పది నెలలకు సెప్టెంబర్‌ 8, 2019న హరీష్‌కు, కేటీఆర్‌కు మంత్రి పదవులు లభించాయి.

Also Read : కాంగ్రెస్‌కు డిపాజిట్‌ వస్తే రాజకీయ సన్యాసం.. కౌషిక్‌ రెడ్డి రిస్క్‌ చేశారా..?

ఈ గతాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పటికీ హరీష్‌రావుపై అనేక ప్రచారాలు సాగుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీ నేతలు.. హరీష్‌ రావును టీఆర్‌ఎస్‌ నుంచి సాగనంపుతారనే వ్యాఖ్యలు తరచూ చేస్తుంటారు. తాజాగా హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లోనూ మరోమారు హరీష్‌ రావు – టీఆర్‌ఎస్‌ బంధంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొన్న తనను, నిన్న ఈటల రాజేందర్‌ను టీఆర్‌ఎస్‌ నుంచి పంపేసినట్లే.. రేపు హరీష్‌రావును కూడా వెళ్లగొడతారని రఘునందన్‌ రావు కామెంట్‌ చేశారు. గతంలో టీఆర్‌ఎస్‌లో ఉన్న రఘునందన్‌ రావు.. అధిష్టానంతో విభేధాల కారణంగా పార్టీని వీడి బీజేపీలో చేరారు. గత ఏడాది జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో మరోసారి బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచారు.

ఈటల గెలవాని హరీష్‌ కోరుకుంటున్నారట..

హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలవాలని హరీష్‌ రావు కోరుకుంటున్నారంటూ కూడా రఘునందన్‌రావు వ్యాఖ్యానించారు. ఈ విషయం తనకు పోలీసులు చెప్పారని తన వ్యాఖ్యలకు బలం చేకూర్చే ప్రయత్నం చేశారు రఘునందన్‌రావు. దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ బాధ్యతలను హరీష్‌రావు నిర్వర్తించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు విజయం సాధించడంతో అందరూ షాకయ్యారు. సిట్టింగ్‌ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ కోల్పోయింది. తాజాగా హజురాబాద్‌ ఉప ఎన్నికల్లోనూ అధికార పార్టీ తరఫున హరీష్‌రావు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నియోజకవర్గంలోనే తిష్టవేసి.. ప్రచారం మొత్తం తన భుజస్కంధాలపై మోస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈటల గెలవాలని హరీష్‌రావు కోరుకుంటున్నారంటూ రఘునందన్‌ రావు చెప్పడం ఆసక్తికరమైన అంశం. ఈ నెల 30వ తేదీన హుజురాబాద్‌ ఉప ఎన్నికల పోలింగ్‌ జరగబోతోంది. నవంబర్‌ 2వ తేదీన వెల్లడయ్యే ఫలితాలతో అభ్యర్థుల భవితవ్వం తేలిపోనుంది.

Also Read : ఈటలను గెలిపించేందుకే రేవంత్‌ ‘ప్రమాదకరం’ వ్యాఖ్యలు చేశారా..?