మోదీకి షాక్‌.. వారణాసీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి

దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి వరుస దెబ్బలు తగులుతున్నాయి. మహారాష్ట్రలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల కోటాలో ఆరు స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కేవలం ఒక్క స్థానంలో గెలవగా.. తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోనూ ఆ పార్టీకి చేదు ఫలితాలు వచ్చాయి. ఐదు పట్టభద్రులు, ఆరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు గత మంగళవారం ఎన్నికలు జరిగాయి. 11 స్థానాల్లో బీజేపీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. ఎస్పీ మూడు చోట్ట, ఉపాధ్యాయ నియోజకవర్గాలో స్వతంత్రులు రెండు చోట్ల విజయం గెలుపొందారు.

బీజేపీకి మిశ్రమ ఫలితాలు వచ్చినా.. ప్రధాని మోదీకి మాత్రం ఈ ఫలితాలు మింగుడుపడని విధంగా ఉన్నాయి. ఎస్పీ గెలిచిన మూడు స్థానాల్లో రెండు ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసీ లోక్‌సభ నియోజకవర్గంలోని కావడం విశేషం. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు రెండింటినీ సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకుంది.

2014, 2019లోనూ వారణాసీ లోక్‌సభ నుంచి ప్రధాని మోదీ వరుసగా భారీ మెజారిటీతో గెలుపొందారు. బీజేపీకి కంచుకోటగా, ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసీలో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ విజయం సాధించడం కమలం పార్టీకి ఏ మాత్రం మింగుడుపడడం లేదు. 11 సీట్లలో మూడు సీట్లు మాత్రమే సమాజ్‌వాదీ పార్టీ గెలిచినా.. అందులో రెండు ప్రధాని మోదీ నియోజకవర్గంలోని కావడం ఆ పార్టీలో జోష్‌ నింపింది. విద్యావంతులు, ఉపాధ్యాయులు మోదీకి వ్యతిరేకంగా ఉన్నట్లు ఈ ఫలితాలను సమాజ్‌వాదీ పార్టీ ప్రచారం చేసుకుంటోంది.

Show comments