iDreamPost
android-app
ios-app

మోడీకి షాక్ ఇచ్చిన మాఫియా డాన్ సతీమణి..!

  • Published Apr 12, 2022 | 7:17 PM Updated Updated Apr 12, 2022 | 8:29 PM
మోడీకి షాక్ ఇచ్చిన మాఫియా డాన్ సతీమణి..!

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయంతో రెండోసారి అధికారం చేపట్టి జోరు మీదున్న భారతీయ జనతా పార్టీ తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయ ఢంకా మోగించింది. ఎన్నికలు జరిగిన 36 స్థానాల్లో 32 చోట్ల విజయం సాధించి.. ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీని ఒక్క సీటుకే పరిమితం చేసింది. అయితే ఒకే ఒక్క నియోజకవర్గంలో ఓటమి ఆ పార్టీని కుంగదీస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్సభ స్థానానికి కేంద్ర స్థానమైన వారణాసి ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మాఫియా డాన్ భార్య విజయం సాధించడం బీజేపీ శ్రేణులను బాధిస్తోంది.

దశాబ్దాల తర్వాత యూపీ ఉభయ సభల్లోనూ బీజేపీ ఆధిక్యం

ఉత్తరప్రదేశ్ శాసనమండలిలో 100 సీట్లు ఉండగా వాటిలో 36 ఖాళీగా ఉన్నాయి. స్థానిక సంస్థల నియోజకవర్గాలైన ఆ 36 సీట్లకు ఈ నెల తొమ్మిదో తేదీన ద్వైవార్షిక ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తి అయినా ఫలితాలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మొత్తం 36 స్థానాల్లో అధికార బీజేపీ 32 చోట్ల గెలిచింది. ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) కేవలం ఒక్క సీటుకే పరిమితం అయ్యింది. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో రెండింటిని మాఫియాతో సంబంధాలు ఉన్నవారే చేజిక్కించుకోగా ఆజంగఢ్ నియోజకవర్గంలో బీజేపీ తిరుగుబాటు నేత యశ్వంత్ తన కుమారుడు విక్రాంత్ సింగ్ ను నిలబెట్టి పార్టీ అధికారిక అభ్యర్థి రమాకాంత్ యాదవ్ ను ఓడించారు. ఈ విజయాలతో శాసనమండలిలోనూ బీజేపీ పూర్తి మెజారిటీలోకి వస్తుంది. ప్రస్తుతం మండలిలో బీజేపీకి 34 మంది, ఎస్పీకి 17 మంది, బీఎస్పీకి నలుగురు సభ్యులు ఉన్నారు. కొన్ని దశాబ్దాల తర్వాత అటు శాసనసభ, ఇటు శాసన మండలిలోనూ బీజేపీ తిరుగులేని ఆధిపత్యం వహించనుంది.

ఆ రెండు చోట్లా మాఫియా ఆధిపత్యం

మండలి ద్వైవార్షిక ఎన్నికల్లో లభించిన ఈ భారీ విజయం బీజేపీ శ్రేణులను సంతోష పెట్టలేకపోయింది. దానికి కారణం మోడీ ఎంపీగా ఉన్న వారణాసి లోక్సభ స్థానం పరిధిలో ఉన్న వారణాసి-ఛందోలి-బదౌనీ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మాఫియా డాన్ కుటుంబం విజయం సాధించడమే. ప్రస్తుతం జైలులో ఉన్న మాఫియా డాన్ బ్రజేష్ సింగ్ సతీమణి అన్నపూర్ణ సింగ్ ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించగా బీజేపీ ఏకంగా మూడో స్థానానికి దిగజారిపోయింది. అన్నపూర్ణ సింగ్ కు 4234 ఓట్లు లభించగా రెండో స్థానంలో నిలిచిన ఎస్పీ అభ్యర్థి ఉమేష్ యాదవ్ కు 345, బీజేపీ అభ్యర్థి సుధామ పటేల్ కు కేవలం 170 ఓట్లు లభించాయి. బ్రజేష్ సింగ్ కుటుంబం ఈ నియోజకవర్గంపై 1998 నుంచి పట్టు కొనసాగిస్తోంది. 2016 ఎన్నికల్లో బ్రజేష్ సింగ్ స్వయంగా పోటీ చేయగా బీజేపీ అభ్యర్థిని నిలపకుండా ఆయనకు లోపాయికారీగా సహకరించింది. కానీ ఈసారి అభ్యర్థిని నిలబెట్టి బ్రజేష్ భార్య చేతిలో పరాభావానికి గురైంది. మరోవైపు ప్రతాపగఢ్ నియోజకవర్గంలోనూ బీజేపీ ఓటమి పాలైంది. మాఫియా ముఠాకు చెందిన రాజాభయ్యా సన్నిహితుడు అక్షయ్ ప్రతాప్ సింగ్ చేతిలో బీజేపీ అభ్యర్థి హరిప్రతాప్ సింగ్ ఓటమి పాలయ్యారు.