iDreamPost
android-app
ios-app

తిరుపతి ఉప ఎన్నికలు : జనసైనికులను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ పాట్లు

తిరుపతి ఉప ఎన్నికలు : జనసైనికులను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ పాట్లు

తిరుపతి ఉప ఎన్నికలు బీజేపీకి కత్తిమీద సాములా మారాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతలు ఓటర్లను ఆకట్టుకోవడం కన్నా.. జనసేన కార్యకర్తలను తమ వైపు తిప్పుకునేందుకు, జనసేన మద్ధతుదారుల ఓట్లు పొందేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. జనసేన తప్పక పోటీ చేస్తుందనుకున్న స్థానంలో బీజేపీ అభ్యర్థి నిలబడడంతో.. ఆ పార్టీ కార్యకర్తల పని చేస్తారా..? లేదా..? అనే అనుమానాలు బీజేపీ నేతలను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే జనసైనికులను ఆకట్టుకునేందుకు బీజేపీ నేతలు ప్రతి సమావేశంలోనూ పవన్‌ కల్యాణ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

తమ అభిమాన నటుడును సీఎంగా చూడాలనుకునే జనసైనికులు.. పదే పదే సీఎం సీఎం.. అంటూ ప్రతి బహిరంగ సభలో నినాదాలు చేస్తుంటారు. ఈ మాటను బీజేపీ నేతలు కూడా అని వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పవన్‌ కల్యాణ్‌ ఏపీకి కాబోయే సీఎం అంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రానికి పవన్‌ను అధిపతిని చేయాలన్నదే తమ లక్ష్యమంటూ చెప్పి.. జనసైనికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

Also Read : అవకాశాన్ని అందిపుచ్చుకున్న సోము

అయితే.. ఐదు శాతం ఓట్లు ఉన్న జనసేన అధినేతను, ఒక శాతం ఓట్లు కూడా లేని బీజేపీ సీఎంగా చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందనే వ్యాఖ్యలు వినిపించాయి. సోము స్టేట్‌మెంట్‌పై సర్వత్రా విమర్శలు కూడా వచ్చాయి. సాధ్యం కాని సీఎం పదవిలో కూర్చోపెడతామంటున్న బీజేపీ నేతలు.. ఇప్పటికి ప్పుడు సాధ్యమయ్యే.. రాజ్యసభ సభ్యత్వం, కేంద్ర మంత్రి పదవి ఇవ్వొచ్చు కదా..? అనే విశ్లేషణలు సాగాయి. దీంతో బీజేపీ నేతల పాట్లు మళ్లీ మొదటికి వచ్చాయి.

జనసైనికులను ఆకట్టుకునే ప్రయత్నాలు ఇంకా కొనసాగించాల్సి వచ్చింది. అందుకే ఈ సారి బీజేపీ నేతలు పవన్‌ను మరోలా పొగడ్తల వర్షంతో ముంచెత్తుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ జాతీయ స్థాయి నాయకుడు అని బీజేపీ ఏపీ సహ ఇంఛార్జి సునిల్‌ ధియోధర్‌ కీర్తించారు. అంతేకాకుండా టీడీపీ, వైసీపీలలో ఎవరూ జాతీయ స్థాయి నాయకులు లేరని చెప్పుకొచ్చారు. తద్వారా పవన్‌ కల్యాణ్‌ ఒక్కడే ఏపీ నుంచి జాతీయ స్థాయి నాయకుడనే భావనను జనసైనికుల్లో కలిగించే ప్రయత్నం చేశారు.

ప్రస్తుతం ఎన్నికల ప్రచారం ముమ్మురంగా సాగుతోంది. బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా తిరుపతికి వస్తున్నారు. జనసేనాని పవన్‌ కూడా ఈ రోజు సాయంత్రం తిరుపతిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. పవన్‌ సభ తర్వాతైనా బీజేపీ నేతలకు జనసైనికులను ప్రసన్నం చేసుకునే పని తప్పుతుందా..? లేదా..? చూడాలి.

Also Read : కొత్తగా తమరు చెప్పేది ఏంది సునీల్ గారు ..?