iDreamPost
android-app
ios-app

కేరళ సీఎం అభ్యర్థిగా శ్రీధరన్‌.. విమర్శలెదుర్కొంటున్న మోడీ, అమిత్‌షా

కేరళ సీఎం అభ్యర్థిగా శ్రీధరన్‌.. విమర్శలెదుర్కొంటున్న మోడీ, అమిత్‌షా

రాజకీయంలో ఎత్తులు పైఎత్తులు ఉంటాయి. ప్రత్యర్థులను ఎదుర్కొనే ముందు సొంత పార్టీలోని ప్రత్యర్థులతో పోటీ పడాలి. అందకే రాజకీయ పార్టీల విధానాలు తరచూ మారుతుంటాయి. పరిస్థితులను బట్టి వాటిలో మార్పులు చేర్పులు తప్పనిసరి. నిన్న సరికానిది నేడు సరైనది కావచ్చు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఇదే పరిస్థితి ఏర్పడింది. 2019 ఎన్నికలకు ముందు తెచ్చిన వయో పరిమితి విధానాన్ని రెండేళ్లలోపే ఎత్తివేశారు. 2019 ఎన్నికలకు ముందు 75 ఏళ్లు పైబడి వారందరూ పోటీ చేసేందుకు వీలులేదని, వారంతా పార్టీకి మార్గదర్శనం చేసేందుకు సేవలు అందించాలనే వయో నిబంధనను మోడీ, అమిత్‌షా ధ్వయం ప్రతిపాదించి, అమలు చేసింది. ఫలితంగా బీజేపీ కురువృద్ధులైన లాల్‌కృష్ణ అధ్వానీ (93), మురళీమనోహర్‌ జోషి(87), శాంతకుమార్‌(86) వంటి సీనియర్‌ నేతలు పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. 2014 లోక్‌సభ ఎన్నికలే వారికి చివరివి అయ్యాయి.

అయితే ఇప్పుడు బీజేపీ తన విధానం మార్చుకుంది. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగుతున్న విషయం తెలిసిందే. కేరళలో తనకు బలం లేకపోయినా.. మోట్రోమ్యాన్‌ శ్రీధరన్‌తో ఏమైనా మేలు జరుగుతుందేమోనన్న ఆశతో ఉంది. అందుకే ఆయన వయస్సుతో సంబంధం లేకుండా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. శ్రీధరన్‌ వయస్సు 89 ఏళ్లు. పోటీ చేసేందుకు వయసుతో సంబంధం లేకపోయినా.. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు వయో పరిమితిని బీజేపీ పెట్టుకుంది. ఇప్పుడు వయో పరిమితితో సంబంధం లేకుండా 89 ఏళ్ల శ్రీధరన్‌ను సీఎం అభ్యర్థిగా నిలబెట్టింది. ఆరోగ్యంగా ఉన్నా అధ్వానీ, జోషి తదితరులను పోటీకి దూరం చేసిన మోడీ, షా ధ్వయం ఇప్పుడు 89 ఏళ్ల శ్రీధరన్‌ను ఏకంగా సీఎం అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారనే ప్రశ్నలు కమలం పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి.

తాజా పరిణామంపై బీజేపీ సీనియర్‌ నేత, ముక్కుసూటి మనిషిగా పేరొందిన 81 ఏళ్ల సుబ్రమణ్యస్వామి స్పందించారు. పార్టీ విధానాల్లో లోపాలు ఉంటే నిర్మోహమాటంగా చెప్పే సుబ్రమణ్యస్వామి కేరళ సీఎం అభ్యర్థిగా 89 ఏళ్ల శ్రీధర్‌ను ప్రకటించడంపై బీజేపీ గత లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించిన వయో విధానాన్ని గుర్తు చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ కేరళ సీఎం అభ్యర్థిగా 89 ఏళ్ల శ్రీధరన్‌ను పార్టీ ప్రకటించింది. దీంతో 75 ఏళ్లకు పైబడిన పార్టీ వృద్ధ నాయకులు మార్గదర్శన మండలి పేరుతో వనవాసం పంపించాలనే నిర్ణయాన్ని పార్టీ తనకు నచ్చినరీతిలో మార్చుకుంటుందని భావించవచ్చా..? అయితే ఎల్‌.కె. అధ్వానీ, మురళీ మనోహర్‌జోషి, శాంతకుమార్‌ వంటి అగ్రనేతలకు 2024 లోక్‌సభ ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వాలి’’ అంటూ సుబ్రమణ్యస్వామి ట్వీట్టర్‌లో గళమెత్తారు. దీనిపై ఆ పార్టీ ముఖ్యనేతలెవ్వరూ స్పందించలేదు. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ప్రస్తుత నాయకత్వానికి, సీనియర్లకు మధ్య సంబంధాలను ఎటు తీసుకెళతాయో చూడాలి.