iDreamPost
android-app
ios-app

త్రిపుర గవర్నర్ గా తెలంగాణ BJP నేత నల్లు ఇంద్రసేనారెడ్డి!

  • Published Oct 19, 2023 | 8:54 AM Updated Updated Oct 19, 2023 | 8:54 AM
త్రిపుర గవర్నర్ గా తెలంగాణ BJP నేత నల్లు ఇంద్రసేనారెడ్డి!

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది.. ఈసారి అధికారం కోసం ప్రధాన పార్టీలు ఢీ అంటే ఢీ అను విధంగా పోటీలో ఉన్నాయి. మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించాలని అధికార పార్టీ బీఆర్ఎస్ గట్టి పట్టుమీదే ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ప్రజా ఆశీర్వాద సభ’ పేరుతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక కాంగ్రెస్ జాతీయ స్థాయి నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ములుగు నుంచి బస్సు యాత్రతో ప్రచారం మొదలు పెట్టారు. బీజేపీ కూడా ప్రచారం కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి బీ-ఫారాలు కూడా ఇచ్చారు. కాంగ్రెస్ 55 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. బీజేపీ సైతం అభ్యర్థుల లీస్ట్ ఖరారు చేసి విడుదల చేయడానికి సిద్దంగా ఉంది. తాజాగా తెలంగాణ బీజేపీ ముఖ్యనేత నల్లు ఇంద్రసేనారెడ్డి త్రిపుర రాష్ట్ర గవర్నర్ గా నియమితులయ్యారు. వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. తెలంగాణ బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి ఇక్కడ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీబీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అండగా ఉంటూ.. పార్టీ తరుపు నుంచి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు ఇంద్రసేనారెడ్డి. ఈ క్రమంలో ఆయనను త్రిపుర గవర్నర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం  చర్చనీయాంశంగా మారింది. అలాగే ఒడిశా రాష్ట్ర గవర్నర్ గా రఘుబర్ దాస్ లను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం నుంచి బుధవారం రాత్రి ఓ ప్రకటన వెలువడింది. తెలంగాణలో ప్రస్తుతం మూడు పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు ఉత్కంఠంగా సాగబోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకోవడానికి ఎవరి వ్యూహాలతో వారు ముందుకు సాగుతున్నారు.

ఇక నల్లు ఇంద్రసేనారెడ్డి విషయానికి వస్తే.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుబండ గ్రామం. నల్లు రాంరెడ్డి దంపతులకు 1953లో జన్మించారు ఇంద్రసేనారెడ్డి. ఆయన రాజకీయ ప్రస్థానం ఏబీవీపీ నుంచి ప్రారంభం అయ్యింది.. తర్వాత బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లారు. 1983తో తొలిసారిగా మలక్ పేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత బీజేపీలో కీలక వ్యక్తిగా మారారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో వెనుతిరిగి చూసుకోలేదు. 1983,1985,1999లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన బీజేపీ శాసన సభ పక్ష నేతగా కీలక బాధ్యతలు నిర్వహించారు. 2003లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించబడ్డారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ వచ్చారు. 2020లో నల్లు ఇంద్రసేనారెడ్డి బీజేపీ జాతీయ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపికయ్యారు. తెలంగాణ బీజేపీ నేతలను గవర్నర్లుగా నియమించడం కొత్తేమీ కాదు.. ఇప్పటికే బీజేపీ ముఖ్యనేత అయిన బంగారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్ గా కొనసాగుతున్నారు.