Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కు తున్నాయి. నూతన రాజకీయ ఒరవడికి నాంది పలుకుతున్నాయి. ఎన్నికలో, ఎన్నికలో అంటూ హడావిడి చేసిన తెలుగుదేశం పార్టీ తోక ముడుచింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ. అల్లాంటి పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండడం బహుశా రాష్ట్ర రాజకీయాల్లో ఇదే తొలి సారి. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేయడం రాజకీయ పార్టీ కనీస ధర్మం. అందులోనూ మూడు సార్లు రాష్ట్రాన్ని పాలించిన టీడీపీ ఎన్నికలకు వెనకడుగు వేయడం సిగ్గుచేటు అనక తప్పదు. గత ఎన్నికల్లో జరిగిన అక్రమాలకు నిరసనగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేత చెప్పడం ఎంత వరకూ సబబు. ఈ నిర్ణయంతో టీడీపీ ప్రతిష్ట మరింత దిగజారింది. మొదట్లో టీడీపీ బాటలోనే నడిచే ఆలోచన చేసిన ఏపీ బీజేపీ అనూహ్యంగా రూటు మార్చి వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
ఏపీ బిజెపి అధ్యక్షుడిగా సోము వీర్రాజు భాద్యతలు స్వీకరించినప్పటికీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం వీక్ గా ఉందని, తాము తొలుత బలమైన ప్రధాన ప్రతిపక్షం గా ఎదుగుతానని చెబుతూ వస్తున్నారు. ఆ విధంగానే తొలి నాళ్లలో దూకుడుగా వ్యవహరించారు. కాస్తో, కూస్తో బీజేపీకి ఊపు తెచ్చారు. ఓ దశలో టీడీపీ కన్నా బిజెపి ప్రస్తావనే ప్రచారంలో ఎక్కువుగా ఉండేది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు ఏమాత్రం ఆశాజనకంగా రాకపోవడంతో ఏపీ బీజేపీలో నిస్తేజం ఆవహించింది. తొలినాళ్లలో వచ్చిన ఘాటైన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల నుంచి తగ్గాయి. అలాగే కేంద్రం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల కారణంగా కూడా గట్టిగా మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో పోటీ లో నిలబడింది. అక్కడ కాస్తైనా ప్రభావం చూపించి మళ్లీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి రత్నప్రభ గెలుపు కోసం దారులు వెదుకుతున్న క్రమంలోనే నూతన సీఎస్ నీలం సాహ్నీ పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పుడు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల్లో పోటీ చేసినా ఫలితం ఉండదని భావించిన టీడీపీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. జనసేన నుంచి కూడా అదే ప్రకటన వెలువడింది. దీంతో బిజెపి కూడా ఎన్నికలకు దూరంగా ఉండడం మంచిది అనే ఆలోచిస్తున్నట్లు గా ప్రచారం జరిగింది . గంటల వ్యవధిలో మళ్లీ వ్యూహం మార్చుకుంది.
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు లో పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. పోటీ చేయడం రాజకీయ పార్టీ ధర్మం అని చెప్పారు. జయమో, అపజయమో పోటీలో ఉంటామని అన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నిర్ణయంపై కూడా వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు దూరం అంటున్న టీడీపీ పరిస్థితి రాజకీయంగా అయిపోయినట్లే అన్నారు. బిజెపి ఈ నిర్ణయం ఓ రకంగా ఆ పార్టీకి మంచిదనే చెప్పొచ్చు. మొదటి నుంచి ప్రధాన ప్రతిపక్షం స్థానం పై బిజెపి గురి పెట్టింది. ఇప్పుడు టీడీపీ పోటీలో ఉండకపోతే వైసీపీ, బిజెపి మధ్యే పోటీ ఉంటుంది. ఆ రకంగా అధికార పార్టీతో తలపడిన విపక్ష పార్టీగా బిజెపి మాత్రమే ఉంటుంది. ఫలితాలు ఎలా వచ్చినా మున్ముందు రాజకీయంగా ఇది బీజేపీకి కలిసి వస్తుంది. అలాగే టీడీపీ లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్నవాళ్ళు బిజెపి గూటికి చేరే అవకాశాలు ఉంటాయి. అలా తన కేడర్ ను పెంచుకునే అవకాశం బీజేపీ కి వస్తుంది. దీంతో పాటు గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఈ ఎస్ ఐ, వైద్య కళాశాలలో జరిగిన అవినీతిపై జరుగుతున్న సీఐడీ కేసును దర్యాప్తును వేగవంతం చేయాలని సీఎం వైఎస్ జగన్ కి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాసి మరోమారు టీడీపీని టార్గెట్ చేశారు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని రాజకీయాల్లో బీజేపీ మళ్లీ చర్చనీయాంశంగా మారింది.