iDreamPost
android-app
ios-app

ఎన్నికల వేల అయోమయంలో తెలంగాణ బీజేపీ?

  • Published Oct 19, 2023 | 3:28 PM Updated Updated Oct 19, 2023 | 3:28 PM
ఎన్నికల వేల అయోమయంలో తెలంగాణ బీజేపీ?

తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీ నేతల్లో హడావుడి మొదలైంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అధికార పార్టీ బీఆర్ఎస్ అగ్రనేత, సీఎం కేసీఆర్.. ప్రజా ఆశీర్వాద సభ పేరుతో ప్రచారం చేస్తూ దూసుకు పోతున్నారు. ప్రజల్లో ఇప్పటి వరకు తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ.. మరోసారి ఛాన్స్ ఇవ్వమంటూ ప్రజలను కోరుతున్నారు. అంతేకాదు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం ప్రచారం పర్వానికి శ్రీకారం చుట్టింది. జాతీయ స్థాయి నేతలు రాహుల్ గాంధీ ప్రచారంతో కాంగ్రెస్ లో ఊపు తీసుకువస్తున్నారు. తెలంగాణలో ప్రధాన పార్టీలు గా చెప్పుకునే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికలలో విషయంలో బీజీ బిజీగా ఉంటే.. బీజేపీ మాత్రం సైలెంట్ గా ఉంది. ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు, ప్రచారానికి శ్రీకారం చుట్టలేదు. దీంతో బీజేపీ శ్రేణుల్లో నైరాశ్యం పెరిగిపోతుంది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్నాయి.. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాల్లో తలమునకలైపోతున్నారు. కానీ కొంతకాలంగా తెలంగాణలో బీజేపీ పార్టీ మాత్రం స్తబ్దుగా కొనసాగుతుంది. బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత ఇక్కడ పార్టీ నైరాశ్యంలో మునిగిందని అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ లాంటి అగ్రనేతలు పర్యటిస్తున్నా.. ద్వితీయ స్థాయి శ్రేణుల్లో ఏమాత్రం ఉత్సాహం కనిపించడం లేదని అంటున్నారు. ఓ వైపు అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది.. బీ-ఫారాలు కూడా ఇస్తుంది. కాంగ్రెస్ ఇప్పటికే 55 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల లీస్ట్ రిలీజ్ చేసింది. అగ్ర పార్టీగా చెప్పుకునే బీజేపీ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి లీస్ట్ రిలీజ్ చేయలేదు. దీంతో బీజేపీ శ్రేణుల్లో మరింత అయోమయం మొదలైంది. ప్రజల్లోకి వెళ్లి ఎప్పుడు ప్రచారం మొదలు పెట్టాలన్న ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఇటీవల ప్రధాని మోదీ నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.. కానీ ఏ మాత్రం పస లేదు అని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. షెడ్యూల్ ప్రకటించిన వెంటనే బీఆర్ఎస్, కాంగ్రెస్ దూకుడు పెంచాయి.. కానీ బీజేపీ మాత్రం మిన్నకుండిపోవడం ఒకంత కలవరానికి గురి చేస్తుందని కిందిస్థాయి నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల సరళిపై జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు. బండి సంజయ్ ఉన్నపుడు నిత్యం ప్రజల్లో ఉండేవారని, సమస్యలపై పోరాటం చేస్తూ ఉండేవారని ఆ సమయంలో బీజేపీ పేరు బాగా మారుమోగేదని.. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని బీజేపీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతుంటే.. బీజేపీలో ఆ కదలిక కనిపించడం లేదు.

ఇదిలా ఉంటే బీజేపీ తరుపు నుంచి పోటీ చేసేందుకు ఈసారి బారీగా దరఖాస్తులు వచ్చాయని.. అభ్యర్థుల బలాబలాలు, సామాజిక సమీకరణాలు ప్రాతిపదికన అభ్యర్థులను గురించి టికెట్లు కేటాయించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 40 మంది అభ్యర్థుల జాబిత అధిష్టానానికి పంపించినట్లు తెలుస్తుంది. ఈసారి బీజేపీలో టికెట్ల కేటాయింపులో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు మొదటి జాబితాలో బీసీలకే ఎక్కువ సీట్లు కేటాయించినట్లు సమాచారం. ఈసారి కీలక నేతలు బరిలో నిలవనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి.. అంబర్ పేట్ నుంచి, బండి సంజయ్ కరీంనగర్ నుంచి, ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచే కాకుండా కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నుంచి కూడా పోటీ చేయనున్నట్లు సమాచారం. లీస్ట్ వస్తే కానీ పోటీ ఎక్కడ నుంచి అనేదానిపై స్పష్టత రాదు.

సినీ నటి, బీజేపీ మహిళ నేత విజయశాంతి ఈసారి కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నుంచి పోటీ చేయబోతున్నట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి కాకుండా ఈసారి ఎబ్బీ నగర్ నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. కాకపోతే దీనిపై కూడా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే.. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశం కావడం పై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ గట్టి ప్రచారం చేస్తే కానీ ఏమైనా ఫలితాలు ఉండవు.. కానీ బీజేపీ నేతలు రాష్ట్ర స్థాయి కన్నా.. స్థానికతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుందని కిందిస్థాయి నేతలు వాపోతున్నారు. ఏది ఏమైనా ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీ ఇంకా వెనుకబడటం పై పార్టీ కార్యకర్తలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.