Idream media
Idream media
ట్యాపింగ్ రాజకీయాలకు తెరతీసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు రివర్స్ కౌంటర్ లు పడుతున్నాయి. దర్యాప్తు చేయాలంటూ ఆయన ప్రధానికి లేఖ రాస్తే.. బీజేపీ కి చెందిన నేతలే చంద్రబాబుకు సమాధానం చెబుతున్నారు. గతంలో ప్రధాని మోదీ, బీజేపీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుత లేఖను పోల్చుతూ ఆయన అవకాశవాద రాజకీయాన్ని ఎండగడుతున్నారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి ఈ మేరకు చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ, బీజేపీపై చంద్రబాబు చేసిన దిగజారుడు వ్యాఖలను ప్రజలు మర్చిపోలేదంటూ చురకలు అంటించారు. స్వప్రయోజనాల కోసం అమరావతిని, రైతులను రాష్ట్రాన్ని రావణకాష్టం చేసి రాజకీయ బలిపీఠం ఎక్కించిన విషయంలో బాబు చరిత్రలో నిలిచిపోతారంటూ ఘాటు విమర్శలు చేశారు. ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.
ఇప్పుడెందుకీ భజన
చంద్రబాబు లేఖలో రాసిన అంశాలను కూడా విష్ణువర్ధన్‌రెడ్డి లేవనెత్తారు. ‘‘ మన సాయుధ దళాలు నూతన విశ్వాసాన్ని పొందాయి. అంతర్గతంగా, ఉగ్రవాదులు మరియు ఉగ్రవాద శక్తుల నుండి వచ్చే ముప్పు తగ్గింది, దేశం వెలుపల సరిహద్దులు బలోపేతం చేయబడ్డాయి. ఇవి తాజా లేఖలో మీరు మోదీగారికి చేసిన భజన. రాజకీయాల్లో మీరు, మీ పార్టీ అవసరానుగుణంగా భజన చేయడం మీకు మామూలే. 1998,1999 ,2004 ,2014, 2019 మీ నాయకత్వంలో మాకు చాలా రాజకీయ అనుభవం ఉంది. మీ స్వార్థప్రయోజనాలు, మీ కుటుంబ రాజకీయాల కోసం రాష్ట్ర అభివృద్ధిని తాకట్టు పెట్టి, నీ రాజకీయ అవసరాలకోసం మోడీ, బీజేపీని విమర్శించారు. రాష్ట్ర ప్రజలును, దేశ ప్రజలు క్షమించమని కోరండి’’ అని విష్ణువర్ధన్ రెడ్డి చంద్రబాబుకు హితవు పలికారు. 2018 మర్చి నుంచి 2019 ఏప్రిల్ మధ్య మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.