iDreamPost
iDreamPost
ఏపీలో ఇప్పటి వరకు ఉన్న స్థితికంటే ఉన్నత స్థితికి చేరుకోవాలన్న ఆరాటం బీజేపీలో ఎక్కువైపోయింది. ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలను ఎంత వీలైతే అంతగా వినియోగించ నిర్ణయించుకుంది. ఇందుకు ముందుగానే జనసేన పొత్తును ఓం ప్రథంగా చెబుతారు. ఆ తరువాత కూడా ఇదే విధమైన ఆలోచనా ధోరణిని ఆ పార్టీ రాష్ట్ర నాయకుల ప్రకటనల ద్వారా వెలిబుచ్చుతున్నారు. ప్రజాధరణ ఎక్కువగా ఉన్న అధికార వైఎస్సార్‌సీపీని విమర్శించడం ద్వారా తాము బావుకునేదేమీ లేదన్నది గుర్తించి, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీనీ టార్గెట్ చేయడం ప్రజానీకం గుర్తిస్తున్నదే. ఈ వ్యూహంతోనే ఏపీలో నెంబర్ టూ అనిపించుకోవలన్న ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది.
ఇందుకు తెలంగాణాలో ఇటీవలే వచ్చిన ఫలితాలను నిదర్శనంగా చూపుతోంది. అయితే అక్కడి పరిస్థితులను ఏపీతో పోల్చలేమన్నది ఇప్పటికే పలువురు స్పష్టం చేసేసారు. అయినప్పటికీ ఇన్‌స్టెంట్‌గా ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు ఆపార్టీ నేతలు ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. అందులో భాగంగా రోడ్లు బాగు చేయాలని ఆందోళనలు చేయడం, సీయం వైఎస్ జగన్ మతాన్ని ఎత్తి చూపడం, కేంద్రం చేసింది తప్పితే రాష్ట్రంలో మీరు చేసింది ఏంటి? అని ప్రశ్నించడం వంటివి చేస్తున్నారు. తటస్థ ఓటర్లను ఆకట్టుకోవడంతో పాటు మతత్వ అంశాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో బీజేపీ నాయకులు ఉన్నారన్నది రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.
అయితే ఇంతగా ప్రయత్నిస్తున్న బీజేపీ నాయకులకు ఓ రెండు గుదిబండలను ప్రజలు సిద్ధంగా ఉంచారని కూడా గుర్తు చేస్తున్నారు. ఇందులో ఒకటి ఎప్పటికి మాయని గాయం రాష్ట్రవిభజన కాగా, రాష్ట్రం మొత్త ఎంతో ఆర్తితో ఎదురు చూస్తున్న పోలవరం ప్రాజెక్టు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంత చేసిందో వారితో సమానంగా బీజేపీ కూడా చేసిందన్న విషయం ఇంకా ఏపీ ప్రజానీకం మదిలో నుంచి పోలేదన్నది వాస్తవం. అందుకే ‘నోటా’కిచ్చిన విలువను కూడా గత ఎన్నికల్లో ఏపీ ప్రజలు బిజేపీకి ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. మరోవైపు విభజన చట్టం ప్రకారం కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు పట్ల ప్రస్తుత బీజేపీ అనుసరిస్తున్న వైఖరిపై కూడా రాష్ట్ర ప్రజానీకం సదభిప్రాయంతో లేదని వివరిస్తున్నారు.
ఏపీలో ఉన్నత స్థితికి వచ్చేద్దామని ఎంతో ఆశలు పెట్టుకుంటున్న బీజేపీకి ఇప్పుడీ రెండే పెద్ద గుదిబండలుగా మారతాయన్ని స్పష్టం చేస్తున్నారు. దీనిని అధిగమించేందుకు ఆ పార్టీ నేతలు భారీగానే కసరత్తులు చేయాలంటున్నారు. ఇప్పటి వరకు విభజిత ఏపీకి అండగా ఉండండి అని కోరిన ప్రతిసారీ, ఇతర రాష్ట్రాలను సాకుగా చూపి కేంద్రం తప్పించుకుంటోందని రాష్ట్రాభివృద్ధిని కోరుకునే వారు చెబుతున్న మాట. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం ఏపీపైనే భారీగా కేంద్ర ప్రభుత్వ నిధులను వెచ్చించే పరిస్థితి భవిష్యత్తులో కూడా ఉండదన్న భావన వ్యక్తమవుతోంది.
మరి ఏపీలో తమ స్థాయిని మెరుగుపర్చుకునేందుకు బీజేపీ నేతలు ఏ విధమైన వ్యూహం అనుసరిస్తారో కాలమే తేల్చాల్సి ఉంటుందంటున్నారు.