iDreamPost
iDreamPost
బీజేపీకి ఏపీలో ఊపు తెప్పిద్దామన్న ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఒకప్పుడు ఉద్యమ రీతిలో ఊగిపోయిన ఆయన ప్రస్తుతం కొంచెం నెమ్మదించారన్న అభిప్రాయం నెలకొంటోంది. అయితే దానిని బ్రేక్ చేస్తూ అడపాదడపా ఏదో ఒక సంచలనానికి తెరతీసే ప్రయత్నం మానడం లేదు. సోము పదవీ బాద్యతలు చేపట్టిన కొత్తలో బీజేపీలోకి వలసలు పోటెత్తుతాయని ఆ పార్టీ నాయకులతో పాటు, కొందరు రాజకీయ పరిశీలకులు కూడా అంచనా వేసారు. కానీ అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. దీంతో కొద్దికాలం బీజేపీ తరపున సోము కార్యకలాపాలు నెమ్మదించాయనే చెప్పాలి.
కాగా తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను కలుస్తున్నట్లు స్వయంగా సోము వీర్రాజు ప్రకటించి మరోసారి ఏపీలో రాజకీయ అటెన్షన్ తనవైపునకు డైవర్ట్ చేసారు. దీంతో ఒక్కసారిగా వారి భేటిపై ఆసక్తి నెలకొందనే చెప్పాలి. ఇటీవలే కాకినాడ, కిర్లంపూడి తదితర ప్రదేశాల్లో ముద్రగడ పేరిట కొత్త రాజకీయ పార్టీ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. దీంతో కలకలం రేగింది. స్వయంగా ముద్రగడ అనుచరులే కలుగజేసుకుని అటువంటిదేమీ లేదని ప్రకటించాల్సి వచ్చింది. కొందరు వ్యక్తుల కామెంట్ల నేపథ్యంలో కాపు ఉద్యమం నుంచి వైదొలగుతున్నట్లు ముద్రగడ ఇటీవలే ప్రకటించారు. అప్పట్నుంచి రాజకీయ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. అడపాదడపా సీయంకు లేఖలు రాస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సోము వీర్రాజు, ముద్రగడతో భేటి కానుండడం ఆసక్తి రేపుతోంది.
సోము వీర్రాజు ప్రకటించిందే తడవుగా సోషల్ మీడియాలో సదరు ప్రకటన వైరల్‌గా మారింది. పలు రాజకీయ పార్టీలు ముద్రగడను అవమానించాయనే వారు కొందరైతే, ఆయనకు సముచిత స్థానం కల్పించాలని కోరే వారు కొందరు. భేటీపై అభినందనల తెలిపేవారు కొందరు పోస్టును వైరల్‌గా మార్చేసారు.
ఇదిలా ఉండగా టీడీపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఆయన సోదరుడిని కూడా సోము కలవనున్నారన్న వార్తలు ఒక రకంగా కలకలం రేపాయనే చెప్పాలి. దీంతో స్వయంగా కళా వెంకట్రావు మీడియాకు ప్రకటన విడుదల చేస్తూ అటువంటిదేమీ లేదని ప్రకటించారు. అప్పుడెప్పుడో నాలుగేళ్ళ క్రితం సోముతో మాట్లాడాను తప్పితే, ఇప్పుడేమీ కాదని స్పష్టం చేసారు.
కాగా కాపు ఉద్యమనేతగా పేర్గాంచిన ముద్రగడతో భేటి రాజకీయపరమైనదా? కాదా? అన్నదానిపై స్పష్టత లేదు. కానీ ఏపీలో కాపు సామాజికవర్గాన్ని ఆకట్టుకునేందుకు బీజేపీ పెద్దల డైరెక్షన్‌లో సోము పావులు కదుపుతున్నారన్న సంకేతాలైతే ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీతో పొత్తుకు ముందుకు వచ్చారన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ముద్రగడ భేటీతో సదరు అంచనాలకు మరింత బలం చేకూరుతోందన్నవారు కూడా లేకపోలేదు. అయితే వీరి ఇరువురి భేటీని గురించి ఎవరో ఒకరు ప్రకటిస్తేనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.