iDreamPost
android-app
ios-app

బీజేపీ ఎత్తు.. టీఆర్‌ఎస్‌ పైఎత్తు..

బీజేపీ ఎత్తు.. టీఆర్‌ఎస్‌ పైఎత్తు..

తెలంగాణలోని ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు రాబోతున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 10 లక్షలు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 15 లక్షలు వెరసి పాతిక లక్షల రూపాయలు తెలంగాణ ప్రజలకు వచ్చే అవకాశం ఉంది. ఈ మొత్తం తప్పకుండా దక్కాలంటే.. టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు తాము ఇచ్చిన హామీలను నిలిబెట్టుకోవాలి. ఇదే జరిగితే పేదరికం పారిపోతుంది. ప్రతి కుటుంబంలో లక్ష్మీ దేవీ కళకళలాడుతుంది. ఈ పాతిక లక్షలు ఎలా వస్తాయి..?

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 16వ తేదీన దళిత బంధు పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద తెలంగాణలోని అర్హత కలిగిన ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఆ మొత్తాన్ని వారు ఎలాగైనా ఖర్చుపెట్టుకోవచ్చు. అయితే హుజురాబాద్‌ ఉప ఎన్నికల కోసమే ఈ పథకం తెచ్చారని, ఈ ఎన్నిక తర్వాత కేసీఆర్‌ దళితబంధును అటకెక్కిస్తారనే విమర్శలు చేస్తూ.. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు తెలంగాణ బీజేపీ దరఖాస్తులు ఉద్యమం మొదలుపెట్టాలని నిర్ణయించింది. ఈ నెల 24వ తేదీ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర ప్రారంభంకాబోతోంది. అదే రోజు నుంచి బీజేపీ శ్రేణులు దళితుల నుంచి దళితబంధు పథకం కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. మొత్తం దరఖాస్తులను అక్టోబర్‌ 2వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ పంపబోతోంది. దరఖాస్తులు పరిశీలించి దళిత బంధు ఇవ్వాలనేది బీజేపీ డిమాండ్‌ కాబోతోంది.

Also Read : ప్రజలను మోసం చేసిన టీచర్‌.. టీచర్‌కు నామం పెట్టిన కేటుగాళ్లు..

దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేయాలని బీజేపీ నిర్ణయించింది. తద్వారా కేసీఆర్‌ సర్కార్‌ను ఇరుకునపెట్టవచ్చనే ఎత్తును వేసింది. బీజేపీ ఎత్తుకు టీఆర్‌ఎస్‌ పైఎత్తు వేసింది. మేము పది లక్షలు ఇస్తాం.. మీరు ఇస్తానన్న పదిహేను లక్షలు మాట ఏమిటనేలా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ బీజేపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పదిహేను లక్షలు తమ ఖాతాల్లో వేయాలంటూ ప్రజలందరూ బీజేపీ నేతలకు దరఖాస్తులు ఇవ్వాలని కేటీఆర్‌ కోరారు. ఇలా దరఖాస్తులు ఇవ్వగానే జన్‌ధన్‌ ఖాతాల్లోకి ధనాధన్‌ డబ్బులు వస్తాయంటూ సెటైర్‌ విసిరారు.

విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రతి భారతీయుడు బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తానని 2014 ఎన్నికల సమయంలో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని ఈ సందర్భంగా కేటీఆర్‌ గుర్తుచేశారు. ఎత్తుకు పైఎత్తులతో బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతలు తమ పాత, కొత్త హామీలను గుర్తు చేసుకుంటూ.. రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నారు. ఈ రాజకీయ క్రీడలో వారికి వచ్చే ఫలితం ఎలా ఉన్నా.. ఇచ్చిన హామీలు అమలు చేస్తే మాత్రం పేద ప్రజలు అంటూ ఎవరూ ఉండరు. అందరూ లక్షాధికారులు అవుతారు.

Also Read : ఆ ఇద్దరు నేతల పాదయాత్ర లు – అయోమయంలో పార్టీ నేతలు ..