iDreamPost
android-app
ios-app

బీహార్ పొత్తు రాజకీయంలో కీలక పరిణామం..

బీహార్ పొత్తు రాజకీయంలో కీలక పరిణామం..

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు నామినేషన్ ప్రక్రియ మొదలైన వేళ ప్రతిపక్ష మహాఘట్ బంధన్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు,తర్వాత మాజీ సిఎం జితిన్‌ రామ్‌ మాంఝీ,ఉపేంద్ర కుష్వహ పార్టీలు మహా కూటమి నుంచి బయటకు వచ్చాయి. అయితే తాజాగా ఎర్రజెండా పార్టీలు అధికార ఎన్డీయేని గద్దె దించే లక్ష్యంతో గ్రాండ్ అలయన్స్‌తో చేతులు కలిపాయి.

మహాకూటమిలో భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. బీహార్ అసెంబ్లీలోని 243 స్థానాలలో కాంగ్రెస్‌కు 68 స్థానాలు కొత్తగా కూటమిలో చేరిన సీపీఐ(ఎం.ఎల్)కు మరో 19 సీట్లను ఆర్జేడీ కేటాయించినట్లు ఢిల్లీ వర్గాలు తెలియజేశాయి. అలాగే మహాకూటమిలో భాగస్వాములైన వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం కలిసి10 సీట్లలో పోటీకి దిగనున్నాయి.కాంగ్రెస్‌ డిమాండ్ కి తలొగ్గిన ఆర్జేడీ 70 స్ధానాలు ఇచ్చేందుకు ఎట్టకేలకు అంగీకరించింది. కానీ హస్తం పార్టీ పోటీ చేసే స్థానాల ఎంపికను తాము నిర్ణయిస్తామని తేజస్వీ యాదవ్ స్పష్టం చేయడం కొసమెరుపు.మిగతా 145 స్థానాలలో ఆర్జేడీ బరిలోకి పోటీ చేసే విధంగా సీట్ల పంపకాలు జరిగినట్లు సమాచారం అందుతుంది.కాగా మహాఘట్ బంధన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ వికాస్ శీల్ ఇన్‌సాన్ పార్టీని కూటమిలోకి ఆహ్వానించాడు. ఒకవేళ తమ ఆహ్వానాన్ని ఆ పార్టీ అంగీకరిస్తే తమ కోటా నుండి సీట్లు సర్దుబాటు చేయాలని తేజస్వీ యాదవ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఆర్జేడీ చేదు అనుభవం:

2015 అసెంబ్లీ ఎన్నికలలో మహాఘట్ బంధన్‌ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. మిగతా భాగస్వామ్య పార్టీల కంటే ఎక్కువగా ఆర్జేడీ అత్యధికంగా 80 స్థానాలను గెలిచింది. కానీ ఎన్నికల ముందు జరిగిన ఒప్పందం ప్రకారం 70 సీట్లను దక్కించుకున్న జేడీయూ తరుపున నితీశ్‌ కుమార్ సీఎం పీఠాన్ని అధిష్టించారు.అయితే ఆర్జేడీ నేతలపై అవినీతి ఆరోపణలను సాకుగా చూపుతూ 26 జూలై 2017లో మహాఘట్ బంధన్‌ నుంచి జెడియు వైదొలిగింది. తర్వాతి రోజు కమలం పార్టీ మద్దతుతో మరోసారి సీఎంగా నితీశ్‌ కుమార్ ప్రమాణ స్వీకారం చేశాడు. నితీశ్‌ కుమార్ చేసిన నమ్మక ద్రోహాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎన్నికలలో ఆర్జేడీ మిత్రులకు సీట్ల కేటాయింపులో కొంత కఠిన వైఖరి అవలంబిస్తోందని చెప్పవచ్చు.

ఇక ఎన్నికల ఫలితాల తర్వాత హంగ్ ఏర్పడితే కాంగ్రెస్, జేడీయూతో చేతులు కలిపే అవకాశం ఉందని ఆర్జేడీ నేత తేజస్వీ అనుమానిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.దీంతో తన రాజకీయ వ్యూహంలో భాగంగా తేజస్వీ వామపక్షాలను మహాఘట్ బంధన్‌లో భాగస్వాములను చేసినట్లు ఆర్జేడీ వర్గాలు తెలిపాయి.

మరోవైపు నితీశ్‌ కుమార్‌ సారథ్యంలోని అధికార ఎన్డీయే సైతం సీట్ల ఖరారుపై భాగస్వామ్య పక్షాలతో పట్నాలో కీలక భేటీ నిర్వహించింది.ఎల్‌జెపి కోరుతున్న 40 పైగా స్థానాల కేటాయింపు వ్యవహారం పాలక ఎన్డీయేకి తలనొప్పి వ్యవహారంగా మారింది. కాగా ఎన్డీయే తరపున సీట్ల సర్దుబాటును ఈనెల 4లోగా ఢిల్లీలో ప్రకటించే అవకాశం ఉంది.