iDreamPost
android-app
ios-app

టాక్ ఆఫ్ ద బిహార్ : ఒకే మాట‌పై నితీష్, చిరాగ్..!

టాక్ ఆఫ్ ద బిహార్ : ఒకే మాట‌పై నితీష్, చిరాగ్..!

ఈ నెల 7వ తేదీన బిహార్ మూడో దశ ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. దీం‌తో ఎ‍న్నికల ప్రక్రియ ముగియనుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌చారం కూడా ముగిసింది. ప‌దునైన వ్యాఖ్య‌ల‌తో అధికార‌, ప్ర‌తిప‌క్ష కూట‌ములు ప్ర‌చార ప‌ర్వాన్ని ర‌క్తి క‌ట్టించాయి. మాట‌ల యుద్ధంతో ర‌ణ‌రంగాన్ని త‌ల‌పించాయి. సాధార‌ణంగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో అధికార ప‌క్షం చెప్పే మాట‌ల‌కు ప్ర‌తిప‌క్షం, ప్ర‌తిప‌క్షం చెప్పే మాట‌ల‌కు అధికార ప‌క్షం కౌంట‌ర్ ఇస్తూ వ్య‌తిరేకంగా మాట్లాడుతుంటాయి. కానీ బిహార్ ఎన్నిక‌ల‌లో ఓ విష‌యంలో అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌లు ఇద్ద‌రూ ఒకేలా మాట్లాడారు. అయితే దాని వెనుక ఉన్నఉద్దేశాలు వేరే అనుకోండి.

ఇవే చివ‌రి ఎన్నిక‌లు

జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌కు ఇవే చివరి ఎన్నికలని లోక్‌జన శక్తిపార్టీ (ఎల్జేపీ) చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్ రెండు రోజుల క్రితం జోస్యం చెప్పారు. నితీష్‌ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని, బిహార్‌ ప్రజలు ఆయన పాలనలో విసుగుచెందారని విమర్శించారు. ‘నితీష్‌ ఫ్రీ బిహార్‌ కావాలి, గత 15 ఏళ్లలో రాష్ట్రం అపఖ్యాతి పాలై, దారుణమైన స్థితికి చేరుకుంది. వలసలు, నిరుద్యోగం, వరదలు వంటి పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల లేదు. ఉపాధ్యాయులు, విద్యార్ధులు చీకట్లో జీవిస్తున్నారు. బిహార్‌ నుంచి వలస వెళ్లిన వారు తమను తాము బిహారీ అని చెప్పుకోడానికి వెనకాడుతున్నారు. అయోధ్య రామ మందిరం కంటే పెద్దదైన సీత ఆలయాన్ని బిహార్‌లో నిర్మిస్తామని హామీ ఇస్తున్నా. బిహార్‌ ఫస్ట్‌- బిహారీ ఫస్ట్‌ అనేదే మా నినాదం’ అని అన్నారు. నవంబర్‌ 10 తర్వాత నితీశ్‌ కుమార్‌ మరెన్నడూ ముఖ్యమంత్రి కారని లిఖితపూర్వకంగా రాసివ్వగలనని, బిహార్‌ మొదట-బిహారీ మొదట ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఇదిలా ఉంగా.. ఏడో తేదీన 71 నియోజకవర్గాల్లో మూడో దశ పోలింగ్‌తో ఎ‍న్నికల ప్రక్రియ ముగియనుంది.

అదే మాట నితీశ్ నోట‌..

బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్ కూడా ఎన్నికల ప్రచారం సందర్భంగా గురువారం కీలక ప్రకటన చేశారు. బిహార్‌ 2020 అసెంబ్లీ ఎన్నికలే తన జీవితంలో చివరి ఎన్నికలని.. రాజకీయ జీవితానికి రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు నితీష్‌ తేల్చి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పూర్ణియా జిల్లాలో గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘బిహార్‌ ఎన్నికల ప్రచారానికి ఈరోజు ఆఖరి రోజు. నా రాజకీయం జీవితానికి కూడా ఇదే ఆఖరి రోజు. ఇవే నా చివరి ఎన్నికలు. రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలతో రిటైర్మెంట్‌ పలుకుతున్నా..’ అంటూ ఉద్వేగంతో బహిరంగసభలో పేర్కొన్నారు. ఇవే నా చివ‌రి ఎన్నిక‌లంటూ నితీవ్ సానుభూతి పొందే ప్ర‌య‌త్నం చేశారు. దీనిపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మ‌ళ్లీ స్పందించారు. బీహార్‌ రాష్ట్రాన్ని సీఎం నితీష్‌ అభివృద్ధిపథంలో నడపలేరని ముందు నుంచే తాము చెబుతున్నామని, ఇనాళ్లకు ఆయనే ఆ నిజాన్ని ఒప్పకున్నారని ఎద్దేవా చేశారు. ఓడిపోతామనే విషయం ముందే గ్రహించి సీఎం నితీష్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తేజస్వీ యాదవ్‌ చెప్పుకొచ్చారు.