వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి లాభదాయక పదవుల కేసులో ఊరట లభించింది. విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా దాఖలు అయిన పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొట్టివేయడంతో ఎంపీ పదవి కోల్పోయే ప్రమాదం నుండి బయటపడ్డారు విజయసాయిరెడ్డి.
కొద్దిరోజుల ముందు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత సీహెచ్ రామకోటయ్య ఎంపీ విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా లాభదాయక పదవిలో ఉన్నారని అభియోగం మోపుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఎంపీగా ఉంటూ లాభదాయక పదవిని కలిగి ఉన్నందున విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
కాగా ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన రాష్ట్రపతి ఎన్నికల కమిషన్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని బీజేపీ నేత రామ కోటయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేశారు.విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నా కూడా ఎలాంటి జీతభత్యాలు తీసుకోలేదని కాబట్టి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద పరిగణించలేమని ఎన్నికల కమిషన్ వెల్లడించడంతో పాటు ప్రిపెన్షన్ ఆఫ్ డిస్‌క్వాలిఫికేషన్ యాక్ట్ దీనికి వర్తించదని ఎంపీ విజయసాయిరెడ్డిపై అనర్హత వేటు వేయాల్సిన అవసరం లేదని ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది. దాంతో ఎంపీ విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా దాఖలు అయిన లాభదాయక పదవుల పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొట్టివేశారు.