Idream media
Idream media
రాయలసీమ సమస్యలే కాదు, కళలు, సాహిత్యం గురించి కూడా అధికారికంగా, అనర్ఘళంగా మాట్లాడే వ్యక్తి భూమన కరుణాకర్‌రెడ్డి. స్వతహాగా మంచి చదువరి అయిన ఆయన ఒక విషయంపై మాట్లాడితే కూలంకుషంగా మాట్లాడుతారు. పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతే నోరు విప్పుతారు.
సోమవారం జరిగిన సభలో సీమపై పని గట్టుకుని జరిగిన సాంస్కృతిక దాడిని ఆయన ఖండించారు. వేల కీర్తనలు రాసిన అన్నమయ్య, కాలజ్ఞానాన్ని చెప్పిన బ్రహ్మంగారు, సామాజిక దురన్యాయాలను లేత తెలుగు పదాలతో చీల్చి చెండాడిన వేమన రాయలసీమ వాసులని చెప్పారు.
సినిమా రంగంలో ఆణిముత్యాలు తీసిన బీఎన్‌రెడ్డి , కేవీ రెడ్డిలను గుర్తు చేశారు. చంద్రబాబు సీమకు చేసింది ఏమీ లేకపోగా, రాజశేఖరరెడ్డిని ఎదుర్కోడానికి ఉద్దేశ పూర్వకంగా సీమకు దౌర్జన్యాన్ని అంటగట్టి ప్రచారం చేశారని అన్నారు. వైఎస్ రాజారెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
చంద్రబాబుని సైందవుడితో పోల్చారు. భారతం, రామాయణంలోని పాత్రల గురించి అలవోకగా చెప్పగలరు భూమన. టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఆయన నిర్వహించిన భాషా బ్రహ్మోత్సవాలు సాహిత్య ప్రియులకి చిరకాలం గుర్తుండిపోయే ఉత్సవాలు.
విద్యార్థి దశ నుంచే అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిన నేపథ్యం ఆయనది. టికెట్ ఇవ్వకపోతే నాయకుడి మీద తిరుగుబాటు చేసే ఈ రోజుల్లో , 1999లో టికెట్ వచ్చినట్టే వచ్చి చేజారి పోయినా , వైఎస్ మాటకు కట్టుబడి పార్టీ అభ్యర్థికే ప్రచారం చేసిన నేత భూమన.
TTD చైర్మన్‌గా ఆయన చేసిన సంస్కరణలు, మార్పులు టీటీడీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి.