Idream media
Idream media
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఈ ఉప ఎన్నిక.. ఈ ఏడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే ప్రతిష్టాత్మకమైనది. ముఖ్యమంత్రిగా గెలిచినా ఎమ్మెల్యేగా గెలవలేకపోయిన దీదీ.. భవానీపూర్ నుంచి భారీ మెజార్టీ తో గెలిచేలా ఉప ఎన్నికను చాలెంజ్ గా తీసుకున్నారు. ఓ ముఖ్యమంత్రిని ఓడించాలన్న కసితో బీజేపీ కూడా తన వంతు ప్రయత్నాలు చేసింది. ఈరోజు పశ్చిమబెంగాల్లో జరుగుతున్న మూడు అసెంబ్లీ స్థానాల్లో భవానీపూర్ కూడా ఉండడంతో ఉత్కంఠగా మారింది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ లో ఓట్లు వేసేందుకు ఓటర్లు కూడా అమిత ఆసక్తి చూపుతున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకే 65 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు ఓటర్లు.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీచేసిన దీదీ.. బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం తన సొంత నియోజకవర్గమైన భవానీ పూర్ నుంచి ఆమె బరిలోకి దిగింది. దీదీపై న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్‌ను బీజేపీ పోటీకి నిలిపింది. ఈ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. ఇప్పటికే భవానీపూర్ నుంచి వరుసగా మమతా బెనర్జీ 2011, 2016 ఎన్నికల్లో విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొట్టిన ఆమె ఇక్కడి నుంచి మూడో సారి ఎమ్మెల్యేగా అలవోకగా గెలిచే అవకాశముందని అత్యధిక మంది భావిస్తున్నారు.
Also Read : సిద్ధూ తీరు.. రాహుల్ , ప్రియాంకలను ఇరకాటంలో పడేసిందా?
తనకు కంచుకోట అయిన భవానీపురంలో ఆమెకు ఎదురు నిలిచి ఏ పార్టీ నిలబడలేదని చెప్తున్నారు. కానీ, వచ్చిన అవకాశాన్ని బీజేపీ కూడా అంత ఈజీగా తీసుకోకుండా గట్టిగానే పోరాడింది. అయితే.. ఈసారి మమత గెలుపుపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని మెజార్టీ పరిశీలకులు, టీఎంసీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ నామినేషన్ వేసిన నాటి నుంచే ఫిర్యాదుల పరంపరకు సిద్ధమైంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తన నామినేషన్ పత్రాల్లో తనపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను పొందుపరచలేదని ఆరోపిస్తూ ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది.
బెంగాల్ అంటే రాజకీయ హింసగా మారిపోయిన తరుణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశారు అధికారులు. మరోవైపు కరోనా నిబంధనలు పాటిస్తూ పోలింగ్ నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక ఈ ఎన్నికల్లో సీఎం మమతాబెనర్జీ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. నందిగ్రామ్‌లో సుబేందు అధికారి చేతిలో ఓడిపోయిన మమత..6 నెలల్లోగా ఎమ్మ్యెల్యేగా ఎన్నికల కావలసి ఉంది. ఈ నేపథ్యంలో భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read : అమిత్‌షాతో అమరిందర్ భేటీ.. బీజేపీలో చేరిక, కేంద్రమంత్రి కావటం లాంఛనమే?