iDreamPost
iDreamPost
భారత రత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తుది శ్వాస విడిచారు. ఇతర ఆనారోగ్య కారణాలతోపాటు కరోనా కూడా సోకడంతో ఆయన ఇటీవల ఆస్పత్రిలో చేరారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో పరిస్థితి విషమించింది. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా ఆయన తుది శ్వాస విడిచారు.
ఐదు దశాబ్ధాల రాజకీయ జీవితంలో ప్రణబ్ ముఖర్జీ అనేక ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించారు. అన్ని రాజకీయ పార్టీల నేతలతో సత్సంబంధాలు కొనసాగించి అజాత శత్రువుగా పేరుగాంచారు. రాజకీయాల్లోకి రాక ముందు ఆయన పోస్టల్ శాఖలో ఉద్యోగం చేశారు. రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా పని చేశారు. 1969లో ఇందిరా గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఆ పార్టీలో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఇందిరా గాంధీ ఆయన్ను 1969లో మొదటిసారి రాజ్యసభకు పంపారు. ఆ తర్వాత 1973లో తన కేబినెట్‌లో చేర్చుకున్నారు. 2004 ఎన్నికల్లో తొలిసారి లోక్‌సభకు పోటీ చేసే వరకూ ప్రణబ్ ముఖర్జీ రాజ్యసభకే ప్రాతినిథ్యం వహించారు. 1969, 1975, 1981, 1993,1999లలో ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.
ఇందిరా గాంధీ మరణం తర్వాత ఏర్పడిన రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో ప్రణబ్‌కు మంత్రివర్గంలో స్థానం లభించలేదు. రాజీవ్ గాంధీ ఆయన్ను పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాలకు పరిమితం చేశారు. ఈ క్రమంలో 1986లో ఆయన రాష్ట్రీయ సమాజ్‌వాదీ పేరుపై సొంత పార్టీ ఏర్పాటు చేశారు. మూడేళ్ల తర్వాత 1989లో ఆ పార్టీని కాంగ్రెస్ విలీనం చేశారు. 1991లో రాజీవ్ గాంధీ మర ణం తర్వాత మళ్లీ ప్రణబ్ రాజకీయ జీవితం మునుపటి మాదిరిగా సాగింది. పీవీ నరశింహారావు ప్రణబ్‌ను 1991లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షునిగా నియమించారు. పీవీ మంత్రివర్గంలో 1995 నుంచి 1996 వరకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు.
2004లో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ.. మన్‌మోహన్ సింగ్ కేబినెట్‌లో రక్షణ, ఆర్థిక, విదేశీ వ్యహారల శాఖల మంత్రిగా బాధ్యలు నిర్వర్తించారు. ప్రధానిగా ఉన్న మన్‌మోహన్ సింగ్ రాజ్యసభలో సభ్యుడిగా ఉండడంతో.. ప్రణబ్ లోక్‌సభ నాయకుడిగా వ్యవహరించారు. 1982లో ప్రణబ్ మొదటి సారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలోనే ఐఎంఎఫ్‌లో పని చేస్తున్న మన్‌మోహన్‌ను ఆర్‌బీఐ గవర్నర్‌గా నియమించారు. 22 ఏళ్ల తర్వాత అదే మన్‌మోహన్ సింగ్ కేబినెట్‌లో ప్రణబ్ ఆర్థిక మంత్రిగా పని చేయడం విశేషం.
2004లో ప్రధాని పదవి రేసులో ప్రణబ్ కూడా ఉన్నారు. అయితే ఆ అవకాశం మన్‌మోహన్‌కు దక్కింది. 2007లో రాష్ట్రపతి పదవికి ప్రణబ్‌ను ఎంపిక చేయాలని కాంగ్రెస్ భావించినా.. అప్పటి రాజకీయ అవసరాల దృష్ట్యా ఆయన్ను కేంద్ర మంత్రి మండలిలోనే కొనసాగించింది. తాను ఆర్‌బీఐ గవర్నర్‌గా నియమించిన వ్యక్తి నాయకత్వంలోనే పని చేసిన ప్రణబ్‌కు.. 2012లో దేశ అత్యున్నత పదవి చేపట్టే అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్‌ను ఎంపిక చేసింది. రెండో సారి రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉన్నా తన వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా ప్రణబ్ రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు.
ఐదు దశాబ్ధాల రాజకీయ జీవితంలో వివిధ మంత్రి పదవులతో సహా రాష్ట్రపతిగా దేశానికి ప్రణబ్ చేసిన సేవలకు తగిన గుర్తింపు లభించింది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రణబ్‌కు దేశ అత్యున్నత పురష్కారమైన భారత రత్నను ప్రకటించింది. 2019లో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ప్రణబ్‌కు భారత రత్న పురష్కారం ప్రధానం చేశారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితం సాగించి, మంత్రి పదవుల నుంచి రాష్ట్రపతి వరకూ ఆ పార్టీ తరఫున ఎన్నికైన ప్రణబ్.. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్‌ఎస్‌ఎస్) కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. 84 ఏళ్ల వయస్సులో కరోనా వల్ల ప్రణబ్ తుది శ్వాస విడవడం దురదృష్టకరం. బహుముఖ ప్రజ్ఞశాలి అయిన ప్రణబ్ లేని లోటు తీర్చలేనిది. ఆయన స్థానం ప్రస్తుత రాజకీయాల్లో ఎవరూ భర్తీ చేయలేరంటే అతిశయోక్తి కాదు.