Idream media
Idream media
కోలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు మరియు దర్శకుడైన K. భాగ్య రాజా గారు తన సినిమా కరుత్తుగళై పదివుసెయ్ ఆడియో ఫంక్షన్ నందు “పొలాచ్చి” ఘటనను ఉదహరిస్తూ మహిళలపై అత్యాచారాలు జరగటానికి వారు సెల్ ఫోన్లు ఉపయోగించటమే కారణమని వ్యాఖ్యానించడం విని సభకు హాజరైన వారు కూడా కంగుతిన్నారు. వాస్తవంగా నేటి ఆధునిక సమాజంలో అన్ని రంగాల యందు పురుషులతో పోటీ పడుతున్న స్త్రీలు సాంకేతికతను ఉపయోగించటానికి సెల్ ఫోన్లు, వారికి అవసరం లేదా అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. తల్లి పొత్తిళ్ళలో నిద్రిస్తున్న చిన్నారులను అత్యాచారం చేసి దారుణంగా హత్య చేస్తున్న వ్యక్తులు ఉన్న ఈ సమాజంలో వారు ఏ సెల్ ఫోను ఉపయోగించి లైంగిక దాడికి గురవుతున్నారని ప్రశ్నించుకోవాల్సిన అవసరం భాగ్యరాజా వంటి వారికి ఎంతైనా ఉంది. .
గతంలో బిజెపి ఎంపీ ఒకరు మహిళల మీద అత్యాచారాలు జరగడానికి వారు ధరించే పొట్టి దుస్తులే కారణమని వ్యాఖ్యానించగా,హర్యానా ముఖ్యమంత్రి అందమైన సంతానం కావాలంటే కాశ్మీరీ యువతులను పెళ్ళాడాలని తన నోటి దురుసుతనాన్ని ప్రదర్శించగా ,నేడు భాగ్యరాజా ఒక అడుగు ముందుకు వేసి సాంకేతికతను అందించే స్మార్ట్ ఫోన్ లను మహిళలు ఉపయోగించటమే వారిపై జరుగుతున్న అత్యాచారాలకు కారణమని మాట్లాడటం మహిళలను అవహేళన చెయ్యటమే.
ప్రతి వ్యక్తిలో మంచి చెడు ఉన్నట్లే మహిళ లోకంలో కొంతమంది మహిళలు అక్రమ సంబంధాలు పెట్టుకోవడనేది వారి వ్యక్తిగత ప్రవర్తన మాత్రమే కానీ స్మార్ట్ ఫోన్ల వలన అక్రమ సంబంధాలు నడుపుతారనే భావన సత్య దూరమైనది. తాము పనిచేసే ప్రదేశాలలో ద్వందర్ధాల మాటలు,లైంగిక వేధింపుల బాధలను పంటి బిగువున అణుచుకుంటూ కుటుంబ బాధ్యతలను తమ భుజస్కందాలపై మోస్తున్న మహిళామూర్తులు కూడా ఈ సమాజంలో ఉన్నారనే విషయాన్ని మనందరికీ తెలిసిన విషయమే.
నేటి పోటీ ప్రపంచంలో తమ జీవన ప్రమాణాలు పెంచుకోవటానికి భార్యాభర్తలిద్దరూ సంపాదించాల్సిన అవసరం ఏర్పడటంతో పిల్లల సంరక్షణ చూసుకునేవారు,వారికి చిన్ననాటి నుంచి నైతిక విలువలు బోధించే పెద్దలు లేకపోవటం సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు ప్రధాన కారణం..సమాజంలో మానవతా విలువలు నశించి రాక్షసత్వం,విశృంఖలత్వం పెరిగిపోయిన సందర్భంలో “మన జన్మకు కారణమైన అమ్మ కూడా ఒక ఆడపిల్లేనని” గుర్తెరిగి ప్రవర్తించానంత కాలం మహిళలపైన జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టలేం.
సమాజములో ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులు బాధ్యతాయుతంగా మహిళల సమస్యలపై మాట్లాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మహిళలపై అత్యాచారాలు నిరోధించడానికి “నిర్భయ” వంటి చట్టాలను చేసినప్పటికీ అత్యాచారాలను అరికట్టలేక పోవటానికి కారణం నైతిక విలువలు పతనమే కారణమని గ్రహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్నారులకు పాఠశాల దశ నుండే సత్ప్రవర్తన కలిగి, నైతిక విలువలు పెంపొందించుకోవడానికి కొత్తగా “ఆనంద వేదిక” అనే కార్యక్రమమును ప్రవేశపెట్టడం అభినందదాయకం.
Written By -Srinivas Racharla