iDreamPost
android-app
ios-app

భగత్ సింగ్, అనుచరుల ఉరిశిక్ష ముందు ఏం జరిగింది?

భగత్ సింగ్, అనుచరుల ఉరిశిక్ష ముందు ఏం జరిగింది?

మార్చి 23,1931 న భగత్ సింగ్ అతని అనుచరులు రాజ్ గురు, సుఖ్ దేవ్ లను ఉరి తీసే సమయంలో ఏం జరిగింది, జైలులో అధికారులు ఎవరెవరు ఉన్నారో బయటపడకుండా జాగ్రత్త పడింది బ్రిటిష్ ప్రభుత్వం. వారిని ఉరితీయడం పట్ల ఆవేశంగా ఉన్న ప్రజలు ఆ అధికారుల మీద ప్రతీకార దాడులు చేస్తారేమో అని భయపడి బ్రిటిష్ ప్రభుత్వం దాచిపెట్టిన ఆ సమాచారం దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా మన ప్రభుత్వాలు చాలా కాలం బయటపడకుండా ఉంచాయి.

ఉరిశిక్షకు కారణం

పంజాబ్ కేసరి అన్న పేరు తెచ్చుకున్న స్వాతంత్య్ర సమర యోధుడు లాలా లజపత్ రాయ్ నాయకత్వంలో సైమన్ కమిషన్ రాకను నిరసిస్తూ లాహోర్ నగరంలో శాంతియుత ప్రదర్శన జరుగుతుండగా పోలీసులు లాఠీఛార్జి జరిపారు. జేమ్స్ స్కాట్ అనే పోలీసు అధికారి లజపత్ రాయ్ మీద దాడి చేసి విచక్షణారహితంగా కొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడి, రెండు వారాల తర్వాత ఆసుపత్రిలో మరణించాడు.

దీనికి ప్రతీకారంగా జేమ్స్ స్కాట్ హత్యకు పథకం రూపొందించారు భగత్ సింగ్, రాజ్ గురు శివరామ్, చంద్రశేఖర్ ఆజాద్. డిసెంబర్ 1928లో లాహోర్ పోలీస్ స్టేషన్ దగ్గర కాపుకాచి ఉండగా సాయంత్రం సమయంలో స్టేషన్ లోపల నుంచి మోటార్ సైకిల్ మీద వచ్చిన జాన్ సాండర్స్ అనే యువ పోలీస్ ఆఫీసర్ ని చూసి అతనే జేమ్స్ స్కాట్ అని పొరబడి వీధికి అటువైపు ఉన్న రాజ్ గురు ఒకే బుల్లెట్ తో పడగొట్టాడు. పక్కనే పొంచి ఉన్న భగత్ సింగ్ నేలమీద పడి ఉన్న సాండర్స్ శరీరంలోకి తన చేతిలో ఉన్న తుపాకీలో నుంచి బుల్లెట్లు దించాడు. పారిపోతున్న భగత్ సింగ్, రాజ్ గురులను పట్టుకోవడానికి వారిని వెంబడించిన చానన్ సింగ్ అనే కానిస్టేబుల్ ను చంద్రశేఖర ఆజాద్ కాల్చి చంపాడు.

మారువేషాల్లో తప్పించుకున్న భగత్ సింగ్, రాజ్ గురులు అయిదు నెలలు ఎవరి కంటా పడలేదు. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని ప్రజా వ్యతిరేక చట్టాల మీద ప్రజల దృష్టిని మరల్చడానికి భగత్ సింగ్ తన మరో అనుచరుడు బటుకేశ్వర దత్ కలిసి పార్లమెంటు సెంట్రల్ హాలులో శబ్దం చేయడం తప్ప ఎటువంటి ప్రమాదం కలిగించని బాంబులు పేల్చి, కరపత్రాలు విసురుతూ తమని అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయకుండా ఉన్న చోట నిలబడి ఉన్నారు.

సాండర్స్ హత్య కేసు వెలికితీసి భగత్ సింగ్, రాజ్ గురు, పథకరచనలో పాలు పంచుకున్న సుఖ్ దేవ్ థాపర్ లకు ఉరిశిక్ష విధించింది కోర్టు. లండన్ లోని ప్రీవీ కౌన్సిల్ క్షమాభిక్షను తిరస్కరించడంతో మార్చి 24, 1931 న ముగ్గురునీ ఉరితీయడానికి లాహోర్ జైలులో ఏర్పాట్లు చేశారు అధికారులు.

వెల్లువెత్తిన నిరసన జ్వాలలు

భగత్ సింగ్ అతని అనుచరులకు ఉరిశిక్ష విధించడం పట్ల దేశవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో నిరసన వెల్లువెత్తింది. ఫిబ్రవరి 1931లో పంజాబ్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరైన పంజాబ్ గవర్నర్ జెఫ్రీ మాంట్ మోరెన్సీ మీద భగత్ సింగ్ అభిమాని హరికిషన్ సింగ్ తల్వార్ తుపాకీతో కాల్పులు జరిపాడు. రెండు గుండ్లు అతని చేతిలోకి దూసుకుపోవడంతో తృటిలో ప్రాణాలు పోకుండా బయటపడ్డాడు గవర్నర్. దీంతో పంజాబ్ అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు.

మార్చి 16న పంజాబ్ గవర్నర్ నివాసంలో పోలీసు ఉన్నతాధికారులు, జైలు అధికారులతో సమావేశమైన జెఫ్రీ మాంట్ మోరెన్సీ ప్రజల్లో నిరసన జ్వాలలు రేకెత్తకుండా మార్చి 24 ఉదయం అమలు పరచవలసిన ఉరిశిక్ష 23 సాయంత్రం అమలు పరచాలని ఆదేశించాడు.

ముసుగులు లేకుండా ఉరికంబం ఎక్కిన వీరులు

జైలులోని కిందిస్థాయి సిబ్బందికి ఉరిశిక్ష ఒకరోజు ముందుకు జరిపిన విషయం ఉరితీసే రోజు ఉదయం వరకూ తెలియదు. జైలు సిబ్బందిలో చాలా మంది భగత్ సింగ్ అభిమానులు ఉండటం అందుకు కారణం. జైలు వార్డెన్ మార్చి 23 ఉదయాన్నే భగత్ సింగ్ సెల్ లోకి వచ్చి అతనికి ఆ సంగతి చెప్పాడు. “ఈ ఆఖరి క్షణాల్లో అయినా ఒకసారి దైవప్రార్థన చేసుకో బాబూ” అని వేడుకున్న అతనితో చేతిలో ఉన్న రష్యన్ విప్లవ యోధుడు లెనిన్ రాసిన పుస్తకం చూపించి, “ఇది చదవడం పూర్తి కాగానే చేసుకుంటాను” అన్నాడు. జైలుకొచ్చిన మొదటిరోజు నుంచి తనతో ఆప్యాయంగా ఉంటున్న ముస్లిం స్వీపర్ బేబెతో” ఈరోజు మీ ఇంటి భోజనం తెచ్చిపెట్టు. ఇకముందు తినే అవకాశం ఉండదు కదా” అని చెప్తే, అతను ఇంట్లో రుచికరమైన బిర్యానీ చేయించి తీసుకొస్తే, డ్యూటీలో లేని వారిని జైలులోకి అనుమతించక పోవడంతో అతను లోపలికి ప్రవేశించలేక పోయాడు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా 23 సాయంత్రం ఉరిశిక్ష సంగతి బయటకు పొక్కింది. జైలు బయట ప్రజలు గుమికూడసాగారు. ఎంత గట్టి బందోబస్తు చేసినా నెల క్రితం పంజాబ్ గవర్నర్ మీద జరిగిన కాల్పుల ఘటన అందరి మనస్సుల్లో మెదులుతూనే ఉంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని అధికారులు ఆందోళనతో ఉండగా శిక్ష అమలు చేసే సమయం దగ్గర పడింది.

స్నానం చేసి, జైలు అధికారులు ఇచ్చిన బట్టలు ధరించి ముగ్గురూ ఉరికంబం వైపు నడుస్తూ “ఇంక్విలాబ్ జిందాబాద్” అని గట్టిగా నినాదాలు చేశారు. వారితో మిగిలిన ఖైదీలు గొంతు కలపడంతో ఆ శబ్దం బయట ఉన్న జనానికి వినిపించి, వారు ఆ ప్రాంతాన్ని తమ నినాదాలతో హోరెత్తించారు. ముగ్గురు ఒకరినొకరు కౌగిలించుకుని “బ్రిటిష్ సామ్రాజ్యం నశించాలి” అని నినాదం చేశారు. భగత్ సింగ్ మొదటగా ఉరికంబం ఎక్కాడు. అతని మొహానికి కప్పిన నల్లని ముసుగు తీసి పక్కన ఉన్న మెజిస్ట్రేట్ వైపు విసిరేశాడు. “భారత స్వాతంత్య్ర యోధుడు ఎంత ధైర్యంగా మృత్యువును ఆహ్వానిస్తాడో ప్రపంచం చూడాలి. నన్ను ఇలాగే ఉరి తీయండి”అన్నాడు భగత్ సింగ్. లాహోర్ పక్కన ఉన్న ఒక గ్రామం నుంచి పిలిపించిన తలారి మాసీ లీవర్ లాగగానే కాసేపు గాలిలో వేలాడిన భగత్ సింగ్ శరీరంలో కదలికలు ఆగిపోయిన కాసేపటి తరువాత ప్రభుత్వ వైద్యుడు లెఫ్టినెంట్ కల్నల్ సోధీ పరీక్షించి ప్రాణం పోయిందని నిర్ధారించాక రాజ్ గురు, ఆ తర్వాత సుఖ్ దేవ్ లకు శిక్ష అమలు చేశారు.

గుట్టుచప్పుడు కాకుండా అంత్య క్రియలు

ముగ్గురి పార్ధివదేహాలను కట్టుదిట్టమైన కాపలా మధ్య లాహోర్ నగరానికి దక్షిణంగా అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న గండాసింగ్ వాలా గ్రామానికి తరలించి, ఒక సిక్కు మతపెద్దనూ, పూజారినీ రప్పించి రాత్రి పది గంటల సమయంలో హడావుడిగా పోలీసులే అంత్యక్రియలు జరిపించి దహనం చేశారు.

ఈ హడావుడి గమనించిన సమీపంలోని ప్రజలు ఒకరొకరుగా రావడం మొదలు పెట్టారు. అవి భగత్ సింగ్, అనుచరుల శవాలు అని ప్రజలు పసిగట్టారు. మరి కాసేపు గడిస్తే ఆవేశంలో ఉన్న ప్రజలను అదుపు చేయడం తమ వల్ల కాదని గమనించిన పోలీసులు సగం కాలిన మృతదేహాలను పక్కనే ఉన్న సట్లెజ్ నదిలో పడేసి అక్కడనుంచి పరారయ్యారు.

“మీరు నన్ను చంపవచ్చు. నా ఆశయాలను చంపలేరు” అని తనకు మరణశిక్ష విధించిన బ్రిటిష్ జడ్జి పి. బి. పూల్ తో భగత్ సింగ్ అన్న మాటలు నిజమని నిరూపిస్తూ తను మరణించిన తొంభై సంవత్సరాల తర్వాత కూడా దేశ ప్రజల హృదయాల్లో నిలిచి ఉన్నాడు భగత్ సింగ్.