Idream media
Idream media
ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. హుసేన్‌సాగర్‌లో దూకాడు. అటువైపు వెళుతుంటే, ఆ వాసనకే ముక్కు మూసుకుంటాం. అక్కడ దూకి చనిపోయాడంటే ఎంత కష్టమొచ్చిందో? అయినా జర్నలిస్టులకి, అందులోనూ సబ్ ఎడిటర్లకి కష్టాలు లేకపోతేనే ఆశ్చర్యం. దుక్కంగా ఉంది. సబ్ ఎడిటర్లలో నూటికి 90 మందికి మిగిలేది అదే!
ప్రభాకర్, నేనూ ఆంధ్రజ్యోతిలో కలిసి పనిచేశాం. పెద్దగా పరిచయం లేదు. చిన్న పలకరింపుల స్నేహం అంతే. మంచివాడు, సహృదయుడు, అందుకే తొందరగా చనిపోయాడు. మంచోళ్లని ఎక్కువ రోజులు బతకనివ్వరు.
తెలుగులో మాస్టర్ డిగ్రీ తీసుకున్న తరువాత, అందరూ లెక్చరర్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటే, నేను జర్నలిస్ట్ కావాలని చాణుక్యశపధం చేశాను. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి టెస్ట్‌లు రాశాను. సెలెక్ట్ కాలేదు. ఆంధ్రజ్యోతికి రాశాను. సమాధానం లేదు. లైబ్రరీసైన్స్ ఎంట్రెన్స్ రాస్తే ఫస్ట్‌ర్యాంక్ వచ్చింది. ఎస్.కె.యూనివర్శిటీలో చేరిపోయా. క్లాసులకి వెళ్లే అలవాటు ఏనాడూ లేదు. లైబ్రరీలోనే జీవితం. కాఫ్కా, హెమింగ్వే, రావిశాస్త్రి, కొడవటిగంటి, భారతి పాత సంచికలన్నీ అయిపోయాయి. ఏడాది తరువాత ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ వచ్చింది. నండూరి రామమోహనరావుగారి ముందు కూచోవడమే చాలా పెద్ద అర్హతగా భావించాను. ఉద్యోగం వచ్చింది.
1988 మే 15వ తేదీ ఉద్యోగంలో చేరాను. కొంతకాలం సరదానే. తరువాత మెల్లగా అర్థమైంది. వూబిలో కాలు పెట్టాను. ఇక వెనక్కి వెళ్లలేనని. నీతులన్నీ అచ్చులో ఉంటాయి. ఏనాడూ బతకడానికి సరిపోయే జీతం రాదు. కార్మికులకి అన్యాయం జరిగితే పేజీలకొద్ది కథనాలు రాస్తారు కానీ, జర్నలిస్ట్‌ల కోసం ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వేజ్‌బోర్డులు అమలు కావు.
రాత్రి అంతా ఉద్యోగం చేయడానికి, పగలు నిద్రపోవడానికి సరిపోతుంది. మా అబ్బాయి బాల్యం అసలు గుర్తే లేదు నాకు. డ్యూటీ నుంచి ఇంటికి వెళ్లేసరికి నిద్రపోతూ ఉండేవాడు. వాడు స్కూల్‌కి వెళ్లే టైంకి నేను నిద్రపోతూ వుండేవాడ్ని. వాడు స్కూల్ నుంచి ఇంటికొచ్చేసరికి నేను ఆఫీసులో వుండేవాడ్ని.
దగ్గరి బంధువుల పెళ్లికి వెళ్లలేం. సెలవు దొరకదు. సరిపోయే స్టాఫ్ వుండరు. నేను సెలవు పెట్టాలంటే ఇంకెవరో ఆఫ్ క్యాన్సిల్ చేసుకోవాలి. ఫంక్షన్లకు వెళ్లలేం. అవి సాయంత్రం జరుగుతాయి. అపుడు డ్యూటీలో వుంటాం. నిద్ర చాలేది కాదు. బార్బర్ షాప్‌లో కూడా నిద్రపోయేవాడ్ని. ఫలితంగా 34 ఏళ్లకే షుగర్.ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన పని ఏంటంటే, ఒక టైం ఫిక్స్ చేసి ఆ డెడ్‌లైన్‌లో పని పూర్తికావాలని చెప్పడం. జర్నలిస్టుల బతుకంతా డెడ్‌లైనే. 12 గంటలకు పేజీలు క్లోజ్ చేయాలంటే 11 నుంచి టెన్షన్.
ప్రపంచంలో జరిగే వార్తలన్నీ సబ్ ఎడిటర్లకి తెలుస్తాయి కానీ, అసలు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. సంతోషం, సరదాలు పక్కనపెడితే వచ్చే జీతం బతకడానికి సరిపోదు. 2000 సంవత్సరంలో ఆంధ్రజ్యోతి మూసేనాటికి నా జీతం 6వేలు. 2002లో తిరిగి చేరితే 8వేలు. 2007లో మానివేసేనాటికి 15 వేలు. జర్నలిస్టులు సత్యం కోసమే కాదు, రేషన్‌షాప్‌లో బియ్యం కోసం కూడా నిలబడాలి.
మీడియా లో పనిచేయాలంటే జీవితాన్ని అంకితం చేయాలి. బాస్ లుగా జర్నలిస్ట్ లు కన్నా జర్నలిజం తో సంభందం లేని బిజినెస్ మేనేజర్లు ఎక్కువగా వస్తుంటారు. వీరి దృష్టి ఎప్పుడూ స్టాఫ్ ని తగ్గించే దానిపైనే ఉంటుంది. తన ప్రతిభని నిరూపించుకోవడానికి స్టాఫ్‌ని తగ్గించడమే పరమావధి అనుకుంటారు. ఇదంతా సబ్ ఎడిటర్లకి అనుక్షణం అభద్రతగా మారుతుంది.
జర్నలిస్టుల్లో కూడా ఒక వర్గం తెలివిగా సంపాదించుకుంటున్నారు. ఇది వాస్తవమే. అయితే వాళ్ల శాతం చాలా తక్కువ. మిగిలిన వాళ్లంతా ప్రభాకర్ లాంటివాళ్లే. అతను చనిపోయాడు, మిగిలిన వాళ్లు బతుకుతున్నారు. అంతే తేడా. సబ్ ఎడిటర్‌గా ఎలాగూ శాంతి లేకుండా జీవించాడు. కనీసం ఆయన ఆత్మకైనా శాంతి కలగాలి.