బెంగాల్ యుద్ధం ముగిసింది! ఫలితాలపైనే ఆసక్తి

దేశంలోనే అతి సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. పశ్చిమ బెంగాల్లో చివరి విడత పోలింగ్ చెదురుమదురు ఘటనల మధ్య గురువారం జరిగింది. సాయంత్రం 5.30 సమయానికి అందిన సమాచారం ప్రకారం 76 శాతం ఓట్లు పోలయ్యాయి. ఎనిమిది విడతల్లో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రతి దశలోనూ భారీ పోలింగ్ నమోదు కావడం విశేషం. దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించినా.. మిగతా రాష్ట్రాలు ఒక ఎత్తు.. బెంగాల్ ఒక ఎత్తు అన్నట్లు అనేక వివాదాల నడుమ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి తుది విడత పోలింగ్ వరకు ఎడతెగని వివాదాలతో బెంగాల్ నిత్యం వార్తల్లో నిలిచింది. సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ, మమత గాయపడటం, బీజేపీ-టీఎంసీ మధ్య మాటల యుద్ధం, కోవిడ్ విజృంభణ, నాలుగో దశ పోలింగులో కాల్పుల ఘటనలు బెంగాల్ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి రేపాయి.

బీజేపీ-టీఎంసీ హోరాహోరీ

2019 సార్వత్రిక ఎన్నికల్లో లభించిన అనూహ్య ఫలితాలతో బెంగాల్ పై ఆశలు పెంచుకున్న బీజేపీ అప్పటినుంచి టీఎంసీ సర్కారుపై వ్యూహాత్మక దాడి ప్రారంభించింది. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా తదితర అగ్రనేతలు వీలు చిక్కినప్పుడల్లా బెంగాల్లో వాలిపోయి ఎన్నికల రాజకీయాలను ఎగదోశారు. టీఎంసీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని మమతను సవాల్ చేశారు. ముఖ్యంగా ఇన్నాళ్లు ఆమెకు కుడి భుజంలా ఉన్న మంత్రి సువేందు అధికారిని తమవైపు తిప్పుకోవడం ద్వారా తృణమూల్ కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచారు. ఆయినా ఏమాత్రం జంకని మమత కమల దళంపై ఒంటరి పోరాటం సాగించారు.

నందిగ్రామ్ సంగ్రామం

బెంగాల్ ఎన్నికల్లో దేశం మొత్తం దృష్టిని నందిగ్రామ్ సంగ్రామం ఆకర్షించింది. తమ పార్టీకి ద్రోహం చేసి బీజేపీలోకి ఫిరాయించిన సువేందు అధికారిని అతని సొంత నియోజకవర్గంలోనే ఓడిస్తానని ప్రతిన పూనిన మమత తన సొంత నియోజకవర్గాన్ని వీడి.. నందిగ్రామ్ బరిలోకి దూకడంతో తొలి విడత పోలింగులో నందిగ్రామ్ ఓ మహా సంగ్రామ క్షేత్రంగా మారింది. నామినేషన్ దాఖలుకు అక్కడికి వెళ్లిన మమత తోపులాటలో గాయపడటం పెను వివాదం, ఉద్రిక్తతలకు దారి తీసింది. కాలికి గాయమైన ఆమె నాలుగు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం కాలిగాయంతో వీల్ ఛైర్లోనే రాష్ట్రమంతా ప్రచారం చేశారు. అయితే దీన్ని ఎన్నికల జిమ్మిక్కుగా బీజేపీ అభివర్ణించింది.

Also Read : బెంగాల్లో సామాజిక సమీక’రణమే’ కీలకం

దళిత, ముస్లిం ఓట్ల కోసం వేట

బెంగాల్లో దళితులు, ముస్లింల ప్రభావం అధికం. ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ ఓట్లతోనే గెలుస్తూ వస్తున్న టీఎంసీకి ఈసారి అవి గంపగుత్తగా లభించే అవకాశాలు కనిపించడంలేదు. రాష్ట్రంలో సుమారు వంద నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేయగల మతువా, రాజ్ బోంగ్ సీ కులాల ఓట్లపై బీజేపీ కన్నేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లోనే ఈ ఓట్లలో కొంత చీలిక తెచ్చిన ఆ పార్టీ ఈసారి మరిన్ని ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నించగా.. తన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు తృణమూల్ సైతం అదే స్థాయిలో పోరాడింది. కాగా రాష్ట్రంలో 27 శాతం వరకు ఉన్న ముస్లిం ఓట్లు ఇప్పటివరకు టీఎంసీకి లభించేవి. కానీ ఈ ఎన్నికల్లో సంయుక్త మోర్చా, ఎంఐఎం ల కారణంగా ఆ ఓట్లలో చీలిక అనివార్యంగా కనిపిస్తోంది.

కోవిడ్ కలకలం

రాష్ట్రంలో అతి సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ, భారీ సభలు, ర్యాలీలు కోవిడ్ విజృంభణకు అవకాశం ఇచ్చాయి. మార్చి 20న బెంగాల్లో 3110గా ఉన్న కేసుల సంఖ్య ఏప్రిల్ 20 నాటికి 53వేలకు ఎగబాకింది. ఈ పరిస్థితుల్లో ఐదో దశ పోలింగ్ అనంతరం మిగిలిన మూడు దశలను కలిపి ఒకేసారి పోలింగ్ నిర్వహించాలని సీఎం మమతా బెనర్జీ చేసిన విజ్ఞప్తిని ఈసీ తిరస్కరించింది. దాంతో ఏడో విడత పోలింగుకు ముందు రోజు ఖుర్దా నియోజకవర్గ టీఎంసీ అభ్యర్థి కాజల్ సిన్హా
కరోనాతో మృతి చెందారు. దీంతో ఈసీ అధికారులపై హత్య కేసు నమోదు చేయాలంటూ అతని సతీమణి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా నాలుగో విడత పోలింగ్ సందర్బంగా కుచ్ బీహార్ జిల్లా సీతల్ కుచి నియోజకవర్గంలో 126వ పోలింగ్ కేంద్రంలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. మొత్తం ఎన్నికల ప్రక్రియలో ఇదొక్కటే హింసాత్మక ఘటన. మిగతా దశల్లో స్వల్ప ఘటనలే చోటుచేసుకున్నాయి.

ఎవరి ధీమా వారిది..

పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపై పడింది. 294 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో ఓటర్లు భారీగా తరలివచ్చి ఓట్లు వేయడం ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతకు సంకేతమని.. ఎన్నికల్లో తమ విజయం ఖాయమని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే తమ ప్రభుత్వానికి ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని.. వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామని తృణమూల్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రీ పోల్ సర్వేలు మమత కే ఓటు వేశాయి. సీట్లు తగ్గినా.. అధికారం మాత్రం టీఎంసీదేనని వెల్లడించాయి. పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా దాదాపు అదే చెప్పాయి. మే రెండో తేదీన ప్రజా తీర్పు ఎలా వస్తుంది మరి.

Also Read : ఎన్నికల కమిషన్ నిష్పాక్షికతపై నీలినీడలు!

Show comments