iDreamPost
android-app
ios-app

Beer Price, 1984 – 1984 డిసెంబ‌ర్ 31, బీరు 8 రూపాయ‌లు!

Beer Price, 1984 – 1984 డిసెంబ‌ర్ 31, బీరు 8 రూపాయ‌లు!

డిసెంబ‌ర్ 31 , మ‌ళ్లీ వ‌చ్చింది. చాలాసార్లు వ‌చ్చింది. కొత్త సంవ‌త్స‌రం అద్భుతాలు మోసుకొస్తుంద‌ని ఆశ‌. అద్భుతాలు ఎదురైన‌ప్పుడు గుర్తు ప‌ట్ట‌లేం, అదే విషాదం. చిన్న‌ప్పుడు గుర్తు లేదు కానీ, 1974 నుంచి జ‌న‌వ‌రి ఫ‌స్ట్ గుర్తు. అప్పుడు గ్రీటింగ్ కార్డులే ప్ర‌పంచం. వాటిని మెడిక‌ల్ షాప్స్‌లో అమ్మేవాళ్లు. ఒక‌ట్రెండు కొని మిత్రుల‌కి ఇచ్చేవాన్ని. శేఖ‌ర్ అనే మిత్రుడు త‌న పేరుతో ప్ర‌త్యేకంగా ప్రింటింగ్ ప్రెస్‌లో అచ్చేసి అంద‌రికీ ఇచ్చేవాడు. పార్టీలు చేసుకునే వ‌య‌సు కాదు, అప్ప‌టికి ఇంకా ఆ క‌ల్చ‌ర్ రాలేదు. సాయంత్రం ఫ‌స్ట్ షోకి వెళ్లేవాళ్లం. న‌ల్లుల‌తో కుట్టించుకుంటూ NTR సినిమా చూసేవాళ్లం. అప్ప‌టికే NTRకి వ‌య‌సైపోయింది. కృష్ణ దూసుకెళుతున్న కాలం. శోభ‌న్‌బాబు లేడీస్ యాక్ట‌ర్‌. అందుకే నచ్చేవాడు కాదు.

1977 నాటికి 31 రాత్రి మేల్కొని గ్రీటింగ్స్ చెప్పుకునే వ‌ర‌కు వ‌చ్చింది. 80 దాటేస‌రికి అనంత‌పురం కొంచెం మారింది. ప‌ట్ట‌ణం రూపు మార్చుకుంది. నింపాదిగా రోడ్డు దాటే కాలం పోయి , జాగ్ర‌త్త‌గా దాటాల్సి వ‌చ్చింది. 84 జ‌న‌వ‌రి 1 కొంచెం కొత్త‌. అధికారంలోకి వ‌చ్చిన TDP స‌మాజాన్ని మారుస్తుంద‌నే ఆశ‌. సాహిత్యం గురించి గంట‌ల త‌ర‌బ‌డి చ‌ర్చ‌లు. మార్క్సిజం ప‌రిచ‌యం అయింది కానీ, అర్థం కాని వ‌య‌సు.

నా వ‌య‌సు వాళ్ల‌లో 10 మందికి 9 మంది సిగ‌రెట్లు తాగేవాళ్లు. అదో స్టైల్‌, క‌ల్చ‌ర్‌, ప్యాష‌న్‌. చిన్న గోల్డ్ ఫ్లేక్ 20 పైస‌లు. స‌న్మాన్ హోట‌ల్లో కాఫీ 40 పైస‌లు. ఒన్ బై టు కాఫీ తాగి, ద‌మ్ము పీల్చి, గోర్కీ నుంచి గుర‌జాడ వ‌ర‌కూ మాట్లాడే కాలం.

బీర్ తాగితే బుగ్గ‌లొస్తాయ‌ని న‌మ్మే అమాయ‌క‌త్వం. ఆ రోజుల్లో అనంత‌పురంలోని ప్ర‌తి నాన్ వెజ్ హోట‌ల్ బారే. అధికారికంగా ఉన్న‌ది ర‌జ‌నీ బార్‌. దాంట్లోకి వెళ్లేంత డ‌బ్బులు, ధైర్యం రెండూ లేవు. బార్ బూత్ బంగ్లాలాంటి ఆరామ్‌ హోట‌ల్ వుండేది. ప్ర‌పంచంలోని సాహిత్యం, రాజ‌కీయాలు అక్క‌డి ఇరుకు గ‌దుల్లో చాయ్‌, బీరు రూపంలో ప్ర‌వ‌హించేవి. కింగ్‌ఫిష‌ర్ బీరు 8 రూపాయ‌లు. అక్క‌డి కుర్రాడికి డ‌బ్బులిస్తే తెచ్చి పెట్టేవాడు. 84 డిసెంబ‌ర్ 31 పార్టీ ఇక్క‌డే జ‌రిగింది. క‌ష్ట‌కాలాల్లో బోలెడు కామెడీ వుంటుంది, గుర్తు ప‌ట్ట‌గ‌లిగితే.

ఒక‌సారి ఆరామ్‌ కుర్రాడికి రూ.50 ఇచ్చి బీర్లు తెచ్చి పెట్ట‌మంటే తిరిగి రాలేదు. ఓన‌ర్ త‌న‌కు సంబంధం లేద‌ని ఒక బోర్డు చూపించాడు. కుర్రాళ్ల‌కి డ‌బ్బులిస్తే మేనేజ్‌మెంట్‌కి సంబంధం లేదు. దాన్ని చూడ‌క‌పోవ‌డం, చ‌ద‌వ‌క‌పోవ‌డం మాదే త‌ప్పు. 50 రూపాయ‌లు పోతే పోయాయి కానీ, 35 ఏళ్లుగా ఎంతో మందికి చెప్పి న‌వ్వుకున్నాను. ఆ కుర్రాడికి జీవిత‌కాల‌పు కృత‌జ్ఞ‌త‌లు.

జాగ్ర‌త్త‌గా జీవిస్తే కామెడీ వుండ‌దు. జీవితం అయిపోతుంది అంతే. కింద‌ప‌డుతూ, ఓడిపోతూ వుంటేనే హాస్యం.

1989 డిసెంబ‌ర్ 1 బాగా గుర్తు. ఆంధ్ర‌జ్యోతి డెస్క్ టీం అంతా త‌లా ఇంత డ‌బ్బులేసుకుని పార్టీ చేసుకున్నాం. మందు తాగే అల‌వాటు లేని కొత్వాల్ అమ‌రేంద్ర‌కి కూల్‌డ్రింక్‌లో క‌లిపి మోస‌గించాం. థ‌మ్స‌ప్ ఎందుకు చేదుగా ఉందో అత‌నికి అర్థం కాలేదు. నిన్న అమ‌రేంద్ర రిటైర్మెంట్. కాలానికి వేగం ఎక్కువ‌.

డిసెంబ‌ర్ 31 , చాలా నిర్ణ‌యాలు తీసుకుంటాం. జ‌న‌వ‌రి 2వ తేదీ అవి గుర్తుండ‌వు. ఫోన్‌లు అందుబాటులోకి వ‌చ్చేస‌రికి గ్రీటింగ్ కార్డులు మాయ‌మ‌య్యాయి. 1999 డిసెంబ‌ర్ 31వ తేదీ అర్థరాత్రి ఎస్టీడీ బూతుల ముందు ప‌డిగాపులు గాచి అంద‌రికీ గ్రీటింగ్స్ చెప్పాం. ఇదంతా ఇప్పుడు న‌వ్వులాట‌. 

2020 డిసెంబ‌ర్ 31 చాలా స్పెష‌ల్‌. యూఎస్‌లోని సెయింట్ అగ‌స్టీనాలో వున్నాను. కోవిడ్ భ‌యం ఉన్నా జ‌నం త‌గ్గ‌లేదు. అన్ని వేల మంది ఉన్నా, ఎక్క‌డా పోలీస్ లేడు, గొడ‌వ లేదు. చ‌ర్చి గంట‌లు మోగుతున్న‌ప్పుడు ఒక కుర్రాడు, అమ్మాయికి ప్ర‌పోజ్ చేశాడు. అమ్మాయి చిరున‌వ్వు, స్నేహితుల ఆనందం ముచ్చ‌ట‌గా అనిపించింది. అన్ని జాతుల వాళ్లు ఒక చోట క‌నిపించారు. తెలుగు వాళ్లు కూడా ఎక్కువే వ‌చ్చారు.

స్వేచ్ఛ కోసం ఆప్రో అమెరిక‌న్స్ ర‌క్తం చిందించిన నేల అది. ఒకావిడ బానిస‌త్వ బాధ‌ల గురించి అప్ప‌టి పాట పాడుతుంటే, అంద‌రూ గొంతు క‌లిపారు. మ‌రిచిపోయేంత చిన్న గాయాలు కాదు క‌దా!

రేప‌టి ఆట‌లో మ‌నం వుంటామో లేదో! ఆకాశంలో న‌క్ష‌త్రాలు మాత్రం ఎప్ప‌టికీ వుంటాయి. జీనా య‌హా అని రాజ్‌క‌పూర్ పాట‌ని త‌ర్వాతి త‌రం కూడా పాడుకుంటూనే వుంటుంది.