Idream media
Idream media
ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేయడంతో.. ఆ స్థానంలో ఎవరిని నియమిస్తారనే ఉత్కంఠకు తెర పడింది. ఒక్క రోజులోనే నూతన ముఖ్యమంత్రిని బీజేపీ ఎంపిక చేసింది. తదుపరి ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మైకు అవకాశం దక్కింది. ఆయనను బీజేపీ నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం బసవరాజ్ బొమ్మై హోం మంత్రిగా పని చేస్తున్నారు. మాజీ సీఎం ఎస్‌ఆర్ బొమ్మై కుమారుడే ఈ బసవరాజ్ బొమ్మై.
నూతన ముఖ్యమంత్రి ఎంపిక విషయంపై బీజేపీ జాతీయ నేతలు ఈ రోజు ఉదయం నుంచి రాష్ట్ర నేతలతో మంతనాలు జరుపుతున్నారు. నూతన ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ పరిశీలకులుగా వెళ్లిన కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జి.కిషన్ రెడ్డిలు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి వరుణ్‌సింగ్‌తో కలసి మొదట మాజీ సీఎం యడ్యూరప్పతో భేటీ అయ్యారు. యడ్యూరప్పతో కలసి వారందరూ ఓ ప్రైవేటు హోటల్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. సమాలోచనలు, అభిప్రాయాలు తీసుకున్న తర్వాత బసవరాజ్ బొమ్మైను సీఎంగా ఎన్నుకునేందుకు అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ విషయాన్ని పరిశీలకులు బీజేపీ అధిష్టానానికి తెలియజేశారు.
2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే యడ్యూరప్ప వారసుడుగా.. ఆయన సామాజికవర్గానికే చెందిన బసరాజ్ బొమ్మైను ఎంపిక చేసింది. కర్ణాటకలో బలమైన లింగాయత్ సామాజికవర్గానికి చెందిన నేతనే ఎంపిక చేయడం ద్వారా.. యడ్యూరప్ప వర్గంలో అసంతృప్తి వ్యక్తం కాకుండా బీజేపీ చూసుకుంది. ముఖ్యమంత్రి రేసులో పది మంది ఉన్నా.. ఆది నుంచి యడ్యూరప్ప.. బసవరాజ్ బొమ్మైకు మద్ధతు ఇస్తున్నారు.
Also Read : యడ్డీ వారసుడు ఎవరో? బీజేపీ పరిశీలనలో 8 పేర్లు