iDreamPost
android-app
ios-app

..లేకుంటే భూమా ఆస్తుల జ‌ప్తు : ఈ దుస్థితికి కార‌ణం ఎవ‌రు?

..లేకుంటే భూమా ఆస్తుల జ‌ప్తు : ఈ దుస్థితికి కార‌ణం ఎవ‌రు?

భూమా నాగిరెడ్డి.. రాయలసీమలో కీలక నాయకుడు. కర్నూలు రాజకీయాల్లో భూమా కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. మొదటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించేవారు. 1984లో రుద్రవరం సహకార సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత 1986-90 వరకు ఆళ్లగడ్డ ఎంపీపీగా పని చేశారు. 1991లో ఆయన సోదరుడు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి మృతి చెందటంతో జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి విజయం సాధించారు. 1996లో ప్రధాని పీవీపై టిడిపి అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించటంతో దేశవ్యాప్తంగా భూమా పేరు అందరి నోటా నానింది. తర్వాత పీవీ నరసింహారావు నంద్యాల స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. అప్పుడు కూడా టిడిపి తరపున బరిలోకి దిగిన భూమా సమీప ప్రత్యర్థి రంగయ్యనాయుడుపై దాదాపు 4,00,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల హ‌యాంలో తెలుగుదేశం అధికారంలో ఉన్న‌ప్పుడు, ఆ త‌ర్వాత కూడా ఎక్క‌డా భూమా ప్ర‌భ త‌గ్గ‌లేదు. తెలుగుదేశంలో ఉన్న‌ప్పుడు కూడా వైఎస్ చేత ఆద‌ర‌ణ పొందేంత చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హారాల‌ను న‌డిపించుకున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా, లేక‌పోయినా.. ఒకే స్థాయి విలువ‌ను పొందారు. అయితే.. ఒకే ఒక యాక్సిడెంట్ ఆ కుటుంబం రాజ‌కీయ గ‌మ‌నాన్ని మార్చేసింది. భూమా శోభా నాగిరెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత భూమా కుటుంబ రాజ‌కీయ పయ‌నంలో అనేక త‌ప్ప‌ట‌డుగులు ప‌డ్డాయి. ఫ‌లితంగా ఆ కుటుంబానికి ఉన్న గౌర‌వం త‌గ్గుతూ వ‌చ్చింది. ఇప్పుడు ఆయ‌న ఆస్తుల జ‌ప్తున‌కు హెచ్చ‌రిక జారీ చేస్తూ ఓ బ్యాంకు ప్ర‌క‌ట‌న ఇచ్చింది.

‘జగత్’ డెయిరీ ప్రారంభానికి భూమా నాగిరెడ్డి బతికున్న హయాంలో నంద్యాల ఆంధ్రా బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నార‌ట‌. ఆయనున్నంత కాలం రుణాన్ని చెల్లిస్తూ వ‌చ్చారు. ఆయన ఆకస్మికమరణంతో రుణ చెల్లింపులకు బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది. తాజాగా జగత్ డెయిరీకి ఆంధ్రా బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించకపోవడంతో సదురు బ్యాంక్ మాతృసంస్థ ‘యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ తాజాగా పత్రికల్లో భూమా కుటుంబ ఆస్తుల జప్తు ప్రకటన ఇవ్వడం సంచలనమైంది. ఈ రుణం భారీగా పెరిగిందని మొత్తం ఇప్పటికీ రూ.16కోట్లకు అప్పులు పెరిగాయని సమాచారం.

అయితే ఈ రుణం పొందేందుకు గతంలో భూమా కుటుంబ సభ్యులకు చెందిన మొత్తం ఆస్తులను సెక్యూరిటీగా పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఆస్తుల విలువ రూ.100 కోట్లపైమాటేనని టాక్ వినిపిస్తోంది. బ్యాంక్ ప్రకటన ప్రకారం.. తమకు బకాయిపడ్డ రుణాలను రెండు నెలల్లోపు చెల్లించాలని లేదంటే మొత్తం ఆస్తులను జప్తు చేస్తామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా హెచ్చరిస్తూ ప్రకటన జారీ చేసిందట.. ఈ మేరకు కర్నూలు జిల్లాలో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. అయితే ఈ తనఖా పెట్టిన ఆస్తులను భూమా అఖిలప్రియ కుటుంబం అమ్మేశారని.. అది అలా చాలా మంది చేతులు మారిందని ప్రచారం సాగుతోంది. తాజాగా బ్యాంకు జప్తు హెచ్చరికల నేపథ్యంలో జప్తు ఉన్న ఆస్తి అని తెలియక కొన్న వారంతా నిండా మునిగారని గగ్గోలు పెడుతున్నారట. మరి దీనిపై భూమా అఖిలప్రియ కుటుంబం ఎలా స్పందిస్తుందో చూడాలి.