iDreamPost
android-app
ios-app

Bandi Sanjay, Unemployment deeksha – ఉద్యోగ దీక్ష.. కాదు రాజకీయ ఉద్యోగం లేక చేస్తున్న దొంగ దీక్ష..!

Bandi Sanjay, Unemployment deeksha – ఉద్యోగ దీక్ష.. కాదు రాజకీయ ఉద్యోగం లేక చేస్తున్న దొంగ దీక్ష..!

అధికార పార్టీ టీఆర్‌ఎస్‌, అధికారం కోసం పోటీ పడుతున్న బీజేపీ రాజ‌కీయాలు తెలంగాణ‌లో కాక పుట్టిస్తున్నాయి. టీఆర్ ఎస్‌.. కేంద్రంపైనే గురి పెడితే.. బీజేపీ రాష్ట్రంలోని ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాలు ర‌చిస్తోంది. ఆందోళ‌న కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుడుతోంది. ఈ క్ర‌మంలో ఇరు పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం ముదురుతోంది. తాజాగా ఉద్యోగాల భర్తీ పేరుతో నేడు బీజేపీ ‘నిరుద్యోగ దీక్ష’ చేప‌డుతోంది. అయితే.. దీన్ని అడ్డుకునేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని బీజేపీ ఆరోపిస్తోంది. తరలివస్తున్న విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నార‌ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని బండి.. నిరుద్యోగ దీక్షతో పీఠం కదిలిపోతుందనే భయంతోనే ప్ర‌భుత్వం ఈ దుందుడుకు చర్యలకు పాల్పడుతోంద‌ని విమర్శించారు. మేధావులు, విద్యావేత్తలు, ప్రజాస్వామికవాదులంతా ఈ చర్యను ఖండించాలని సంజయ్‌ ఒక ప్రకటనలో కోరారు. కాగా, రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలన్న డిమాండ్‌తో సోమవారం బండి సంజయ్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ దీక్ష జరగనుంది. తొలుత ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్‌లో దీక్షను చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నా.. కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో దీక్షను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. కాగా, బండి సంజయ్‌ నిరుద్యోగ దీక్షను అవమానిస్తూ బహిరంగ లేఖ పేరుతో మంత్రి కేటీఆర్‌ విమర్శలు చేయడం.. నిరుద్యోగులను అవమానించడమేనని బీజేఎల్పీ నేత రాజాసింగ్‌ అన్నారు.

నిరుద్యోగ దీక్ష, బండి వ్యాఖ్య‌ల‌కు టీఆర్ ఎస్ కూడా గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇస్తోంది. అన్నిరంగాల్లో దూసుకెళ్తున్న తెలంగాణలో యువతను రెచ్చగొట్టేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దొంగ దీక్షకు సిద్ధమవుతున్నారని మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. సంజయ్‌ చేపట్టింది నిరుద్యోగ దీక్ష కాదు, పచ్చి అవకాశవాద, ఆత్మవంచన దీక్షని దుయ్యబట్టారు. రాష్ట్ర యువత తరపున ప్రశ్నిస్తున్నానని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు దేశంలో ఎన్ని ఉద్యోగాలిచ్చిందో లెక్క చెప్పే దమ్ముందా? అని నిలదీశారు.

బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను పేర్కొంటూ మంత్రి కేటీఆర్‌ ఆదివారం బహిరంగ లేఖ విడుదల చేశారు. ‘‘ఉపాధి కల్పనకు నెలవుగా మారిన తెలంగాణలో మీకు ‘రాజకీయ ఉద్యోగం’ లేక చేస్తున్నదే ‘మీ నిరుద్యోగ దీక్ష.’ రాష్ట్రంలో ఏటా లక్షలాది యువతీ, యువకులు డిగ్రీలతో బయటకు వస్తున్నారు. వీరందరికీ ప్రపంచంలో ఏ దేశం, ఏ ప్రభుత్వమూ ఉద్యోగాలు కల్పించలేదు. ‘అచ్చే దిన్‌’ అంటూ ఆశ చూపి, రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఏం చేశారు, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న ఇచ్చిన మీ హామీని ఏ గంగలో కలిపారో చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు. ఇలా.. ఇరు పార్టీల రాజ‌కీయాల‌తో తెలంగాణ దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.