Idream media
Idream media
హైదరాబాద్ నుంచి హుజూరాబాద్ వరకు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన తొలి విడత పాదయాత్ర ముగింపునకు చేరుకుంది. ముందస్తు ప్లాన్ ప్రకారం.. ఉప ఎన్నిక జరిగే హుజూరాబాద్‌లో ముగిసేలా సంజయ్ ప్రణాళిక రచించుకున్నారు. అక్కడ భారీ సభ ఏర్పాటు చేసి.. సమర శంఖం పూరిద్దాం అనుకున్నారు. సరిగ్గా ఒక రోజు ముందు నోటిఫికేషన్ విడుదల కావడం, నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో బండి సభ ఆంక్షల్లో చిక్కుకుంది. దీంతో సంజయ్ రూట్ మార్చారు. సభా వేదికను హుజూరాబాద్ పక్కనే ఉన్న హుస్నాబాద్‌కు మార్చేశారు. నేడు అక్కడి నుంచే ఉప ఎన్నిక నేపథ్యంలో మాటల తూటాలు పేల్చనున్నారు.
అక్టోబర్ 2న భారీ బహిరంగ సభతో యాత్రను ముగించేందుకు సంజయ్ రెడీ అవుతున్నారు. ఇన్ని రోజులు చేసిన యాత్రలో బీజేపీకి ఊరూరా మద్దతు లభించింది. ప్రజా సంగ్రామ యాత్రగా బండి సంజయ్ తొలి విడత యాత్రను విజయవంతంగా పూర్తి చేయబోతున్నారు. ముగింపు సభ హుస్నాబాద్‌లో జరగనుంది. అయితే, ముగింపు సభకు హుస్నాబాద్‌ను ఎంచుకోవటంపై హుజురాబాద్ పాలిటిక్స్ ఆధారపడ్డాయి. నిజానికి ముగింపు సభ హుజూరాబాద్‌లో నిర్వహించాలి. అక్కడ ఉప ఎన్నికలున్న నేపథ్యంలో పాదయాత్ర ముగింపు సభ ప్లాన్ చేశారు. కానీ ఇంతలోగా హుజురాబాద్ ఉప ఎన్నిక ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేసింది. ఈసీ ఆంక్షల ప్రకారం హుజూరాబాద్‌లో భారీ బహిరంగ సభలకు అనుమతి లేదు. 1000మందికి మినహా గుమిగూడేందుకు అవకాశం లేకపోవటంతో… పక్కనే ఉన్న హుస్నాబాద్ వైపు బండి సంజయ్ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
పేరుకు హుస్నాబాద్ సభే అయినా… హుజురాబాద్ ఉప ఎన్నికకు పార్టీ తరఫున ఇది సమరశంఖం పూరించే సభగా మారనుంది. భారీగా సభా ఏర్పాట్లు పూర్తయ్యాయి. హుజురాబాద్ నుండి పెద్ద ఎత్తున జనసమీకరణ వ్యూహాలు రెడీ అయినట్లు సమాచారం. హుజూరాబాద్ ప్రజలు ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు అభ్యర్థి ఎవరైనా పార్టీ గెలుస్తుందని టీఆర్ఎస్ భావిస్తున్నా.. ఈటల రాజేందర్ మాత్రం తాను ఏ పార్టీలో ఉన్న తనపై హుజూరాబాద్ ప్రజలకు నమ్మకం ఉందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తొలిరోజే(శుక్రవారం) నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నేరుగా హుజురాబాద్ చేరుకున్నారు. ఆర్డీఓ కార్యాలయంలో శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ పత్రాలు సమర్పించారు.
Also Read : మునుపటికి భిన్నంగా ఉప ఎన్నికలు.. ఈ దఫాకేనా ఇలాంటి పరిస్థితి…?