iDreamPost
android-app
ios-app

కొందరి అధికారమదం..సామాన్యుల బలి

కొందరి అధికారమదం..సామాన్యుల బలి

వనమా రాఘవా” తెలంగాణా రాజకీయాల్లో ఈ పేరు ఇప్పుడు ఒక వివాదం… మాజీ మంత్రి, కొత్తగూడెం తెరాస ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు కుమారుడు అయిన వనమా రాఘవ… ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అయ్యాడనే ఆరోపణలు, దానికి సంబంధించి బయటకు వచ్చిన వీడియో… ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ లో ఒకప్పుడు కీలక పాత్ర పోషించి, ఆ తర్వాత తెరాస పార్టీలోకి అడుగు పెట్టి… మంత్రి పదవి రేస్ లో ఉన్న తండ్రికి ఇప్పుడు వనమా రాఘవ తెచ్చిన తంటా ఏ మలుపు తిరుగుతుంది అనేది కీలకంగా మారింది.

మూడు రోజుల క్రితం పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో అదే రోజు రామకృష్ణ, ఆయన భార్య, కూతురు సాహిత్య ప్రాణాలు విడవగా… మరో కుమార్తె సాహితి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఆత్మహత్య చేసుకునే ముందు రామకృష్ణ విడుదల చేసిన వీడియో లో చేసిన ఆరోపణలు తెలంగాణా రాజకీయాలను కుదిపేశాయి. తనను రాఘవ… డబ్బులు అడిగితే ఇచ్చేవాడినన్న రామకృష్ణ… కానీ తన భార్యను పంపమని అడిగాడంటూ సెల్ఫీ వీడియోలో తన బాధను బయటపెట్టాడు.అయితే తాను వాళ్ళను ఎదిరించే అంత శక్తివంతుడిని కాదని చెప్తూ అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని వీడియోలో పేర్కొన్నాడు. దీనితో ప్రతిపక్షాలతో పాటుగా ప్రజా సంఘాలు ఎమ్మెల్యే తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసాయి. ఇక ఈ విషయంలో పోలీసులపై ఆరోపణలు వచ్చినా సరే… అతన్ని అరెస్ట్ చేసే విషయంలో పోలీసులు ఎక్కడా వెనక్కు తగ్గలేదు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సీరియస్ గా ఉన్న నేపథ్యంలో… ఎమ్మెల్యే కూడా ఈ విషయంలో ఏం మాట్లాడలేని పరిస్థితి వచ్చింది.

తన కొడుకుని నియోజకవర్గానికి దూరంగా ఉంచుతానని, తన కొడుకుని పోలీసులకు అప్పగిస్తానని ఒక లేఖ విడుదల చేశారు. ఆ లేఖ విడుదల చేసిన కాసేపటికి పోలీసులు రాఘవను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. పోలీసులు చేయబోయే ఏ రకమైన విచారణకు అయినా తన పూర్తి సహకారం ఉంటుందని చెప్తూ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేంత వరకూ తన కొడుకును రాజకీయాలకు దూరంగా ఉంచుతానని ఆయన ప్రకటించారు. ఇక ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఈ విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ నుంచి డీజీపీ వివరాలు అడిగినట్టుగా సమాచారం. అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు కావడంతో రాఘవను పోలీసులు అరెస్ట్ చేయలేదని ముందు ఆరోపణలు వచ్చినా పోలీసులు చేయాల్సింది చేశారు. ఇక ఈ ఘటనపై సీరియస్ గా విచారణ చేయాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు. పలు సెక్షన్ ల కింద పోలీసులు కేసులు నమోదు చేసి… విచారణ ముమ్మరం చేశారు.

అయితే ఈ వ్యవహారానికి సంబంధించి… వనమా వెంకటేశ్వరావు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

కాంగ్రెస్ హయాంలో మంత్రిగా మంచి పేరు సంపాదించుకున్న ఆయనకు, సౌమ్యుడిగా మంచి పేరుంది. వివాదాలకు కూడా ఆయన దూరంగా ఉండటంతో అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఆయనకు కీలక పదవులు దక్కాయి. అటు ప్రజలకు కూడా ఆయన నిత్యం అందుబాటులో ఉంటారనే పేరు ఉంది. ఇటువంటి పరిస్థితిలో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా వనమా ఒత్తిడిలోకి వెళ్ళిపోయారు.

మహిళల భద్రత విషయంలో తెలంగాణ సర్కార్ ముందు నుంచి సీరియస్ గా ఉన్న తరుణంలో ఈ విషయంలో పోలీసులు కూడా ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. రాజకీయంగా కూడా తెరాస పార్టీ పై విమర్శలు పెరిగే అవకాశం ఉండటంతో స్వయంగా సిఎం జోక్యం చేసుకున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక మీడియాలో వస్తున్న వార్తలను ప్రస్తుత పరిస్థితిలో బిజెపి గట్టిగా వాడుకునే అవకాశం ఉండటంతో ఈ విచారణలో ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా పోలీసు శాఖ ముందుకు వెళ్తుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక ఈ విషయంలో అనవసర ఆరోపణలు చేసే వారి మీద కూడా పోలీసులు ఒక కన్నేసి ఉంచారు. లేనిపోని ప్రచారాలు చేసే సోషల్ మీడియా వ్యక్తులను కొందరిని అదుపులోకి తీసుకున్నారు.