iDreamPost
iDreamPost
నిండా మూడు పదుల వయస్సు లేని యువకునిపై మోయలేని భారం మోపుతోంది తెలుగుదేశం పార్టీ. అమలాపురం పార్లమెంట్ ఇన్‌చార్జిగా దివంగత లోక్‌సభ స్పీకర్ జి.ఎం.సి.బాలయోగి కుమారుడు జి.హరీష్ మాధుర్‌ను నియమించి పార్టీ చేతులు దులుపుకుంది. గత ఎన్నికల ముందు పార్టీలో చేరిన మాధుర్‌కు అమలాపురం ఎంపీ సీటు ఇచ్చిన సమయంలోనూ… ఎన్నికల తరువాత పార్టీ ఇన్‌చార్జిగా నియమించి తరువాత కూడా పార్టీ చేతులు దులుపుకుందే తప్ప అతనికి దన్నుగా నిలవలేదు. కాని పార్టీని నడిపించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని మాత్రం నియమించకుండా ముప్పుతిప్పలు పెడుతోంది. పేరుకు దాదాపుగా 40 ఏళ్ల పార్టీ… ఐదుసార్లు అధికారంలోకి వచ్చిందని గొప్పగా చెప్పుకోవడమే తప్ప… అమలాపురం పార్లమెంట్ పరిధిలో పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. దీనితో పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి మాధుర్ చెమటోడ్చాల్సిన దుస్థితి నెలకొంది.
అమలాపురం పార్లమెంట్ పరిధిలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఇక్కడ పార్టీని పటిష్టం చేసే పని అధిష్టానం ఎప్పుడో గాలికి వదిలేసింది. దీనితో ఆ భారం యువకుడైన హరీష్ మాధుర్‌పై పడింది. పార్లమెంట్ పరిధిలో కంచుకోటగా ఉన్న మండపేటలోనే పార్టీకి గడ్డుకాలం దాపురించింది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వేగుళ్ల జోగేశ్వరరావు రానురాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మకంగా ఇక్కడ టీడీపీ నుంచి వచ్చిన తోట త్రిమూర్తులకు ఇన్‌చార్జి ఇవ్వడం, ఎమ్మెల్సీ కేటాయించడంతో ఆ పార్టీకి తిరుగులేకుండా పోయింది. ఇక రామచంద్రపురంలో తోట వెళ్లిపోయిన తరువాత పార్టీ నడిపించే నాయకుడు లేడు. శాసనమండలి వైస్ చైర్మన్‌గా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యానికి ఇన్‌చార్జి ఇచ్చినా ఆయన చుట్టంచూపుగా వచ్చి వెళ్లిపోతున్నారు. ముమ్మిడివరం, కొత్తపేట, అమలాపురం, రాజోలుకు మాజీ ఎమ్మెల్యేలే ఇన్‌చార్జిలుగా ఉన్నారు. వీరిలో దాట్ల బుచ్చిబాబు, గొల్లపల్లి సూర్యారావు, బండారు సత్యానందరావు, అయితాబత్తుల ఆనందరావులు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నారు. అయితే వీరంతా సీనియర్లు కావడంతో మాధుర్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక పి.గన్నవరం నియోజకవర్గానికి గత ఎన్నికల నాటి నుంచి ఇన్‌చార్జ్ లేకపోవడం గమనార్హం. దీనితో ఆ బాధ్యతను కూడా మాధుర్ మోయాల్సి వస్తోంది.
గత ఎన్నికల ముందు మాధుర్ టీడీపీలో చేరగా, ఎంపీ స్థానం కేటాయించారు. ఆ ఎన్నికల్లో మాధుర్‌ను ఓటర్లను బాగానే ఆకట్టుకున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ చింతా అనూరాధకు 4 లక్షల 85 వేల 313 ఓట్లు రాగా, హరీష్‌కు 4 లక్షల 45 వేల 347 ఓట్లు వచ్చాయి. అనూరాధకు మెజార్టీ 39 వేల 966 ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల కన్నా మాధూర్‌కు 8,500 ఓట్లు అదనంగా వచ్చాయి. కొత్తపేట, అమలాపురం, పి.గన్నవరాల్లో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు మాధుర్‌కు రావడం విశేషం. అప్పటికన్నా ఇప్పుడు పార్టీ పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. దీనితో మాధుర్ నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. జిల్లాలో పార్టీ పెద్దలైన యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పలకు పార్టీ పరిస్థితి వివరిస్తున్నా వారు కూడా పట్టించుకోకపోవడం హరీష్ మాధుర్‌కు ఇబ్బందికరంగా మారింది.