Puneeth final rites: పునీత్ చివరి చూపు కోసం

హఠాత్తుగా కన్నుమూసిన కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కడచూపు కోసం బెంగళూరు కంఠీరవ స్టేడియం జనసందోహంగా మారిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న అభిమానులతో నగరం మొత్తం ఒకరకమైన విషాద నిశ్శబ్దాన్ని ఆవహించుకుంది. నిన్న ఉదయం దాకా చలాకిగా ఉన్న ఓ మంచి వ్యక్తి ఇప్పుడు లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి కుటుంబ సభ్యులకే కాదు సగటు సినిమా ప్రేమికుడికి సైతం మనసొప్పడం లేదు. పునీత్ ఇప్పటిదాకా చేసింది ముప్పై సినిమాలే అయినా వంద చిత్రాలు చేసినా సంపాదించుకోలేని గొప్ప పేరుని తెచ్చుకోవడానికి నిదర్శనంగా ఈ కన్నీటి నివాళినే చెప్పొచ్చు

టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు బెంగళూరు నగరం చేరుకున్నారు. నందమూరి బాలకృష్ణ ఉద్వేగాన్ని తట్టుకోలేక పార్ధీవ దేహం ముందు కంటతడి పెట్టుకోవడం అందరినీ కదిలించింది.ఇది ఎంత ఖర్మో అనుకునేలా ఆయన బాధను వ్యక్తం చేసిన తీరు మనసులో నుంచి వచ్చింది. గంభీరంగా ఉండే బాలయ్య లాంటి వ్యక్తి సైతం ఇంతగా అల్లాడిపోయారంటే పునీత్ అందరితో పెట్టుకున్న అనుబంధం ఏ స్థాయిదో అర్థమవుతుంది. ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవా వ్యక్తిగతంగా వచ్చి దర్శనం చేసుకున్నారు. తెలుగు నుంచి నరేష్, శివ బాలాజీలు వెళ్లి నివాళి అర్పించారు. రానా కూడా వచ్చినట్టు సమాచారం.

మధ్యాన్నం నుంచి మరికొందరు ప్రముఖుల తాకిడి ఖాయంగా కనిపిస్తోంది. మెగా స్టార్ చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ తదితరులు అక్కడికి చేరుకునే అవకాశం ఉందని కన్నడ మీడియా టాక్. ఇక్కడి నుంచి బయలుదేరింది లేనిది ఇంకా తెలియలేదు. చరణ్ పూణేలో ఉండటంతో సాధ్య పడలేదు. ఇవాళ సాయంత్రానికి పునీత్ పెద్ద కుమార్తె యుఎస్ నుంచి బెంగళూరుకు చేరుకోనున్నారు. రేపు అధికారిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరగబోతున్నాయి. పట్టుమని యాభై సినిమాలు కూడా లేని ఒక హీరోకి ఇంత గౌరవం దక్కడం వెనుక ఉన్నది ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కాదు. ఉన్నతమైన వ్యక్తిత్వం అంతమించిన మంచితనం

Also Read : సినీ ప్రపంచానికి ప్రేక్షకుడి లేఖ..

Show comments