ఏపీలో బద్వేల్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో ఏకగ్రీవం ఖాయమని అనుకుంటున్న సమయంలో బీజేపీ సడన్ ట్విస్ట్ ఇచ్చింది. అసలు జనసేన తమతో కలిసి వచ్చినా రాకున్నా బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. బీజేపీ జనసేన పొత్తులో ఉన్నా సరే ఆ పార్టీ పాలసీ వేరు, తమ పాలసీ వేరు అంటోంది బీజేపీ. వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం అంటూ బీజేపీ రంగంలోకి దిగింది. అయితే రెండు రోజుల్లో నామినేషన్ గడువు కూడా పూర్తికానున్న క్రమంలో ఆ పార్టీ అభ్యర్థి ఎవరు అనే దానిపై భిన్న ప్రచారాలు జరుగుతున్నాయి.
వైసీపీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేల్‌కు ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. బద్వేల్ ఉప ఎన్నిక అక్టోబర్ 30న జరగనుంది. మృతి చెందిన ఎమ్మెల్యే భార్యకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన క్రమంలో గత సంప్రదాయాల ప్రకారం పోటీ చేయమని జనసేన ముందు ప్రకటించింది, దీంతో ముందు పోటీకి సై అన్న తెలుగుదేశం పార్టీ కూడా వెనక్కి తగ్గింది. బీజేపీ మాత్రం వారసత్వ రాజకీయాలకు మేము దూరం అని మేము అభ్యర్థిని దింపుతామని ప్రకటించింది. అలాగే మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కూడా బద్వేల్ ఉపఎన్నికకు అభ్యర్థిని ప్రకటించింది. ఆ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పోటీ చేస్తారని కాంగ్రెస్ మంగళవారం ప్రకటించింది.
ఇక బద్వేల్ ఉపఎన్నికలో పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించినప్పటికీ.. అభ్యర్థి పేరును మాత్రం ఆ పార్టీ ఖరారు చేయలేదు. తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు ఆ పార్టీ ఐదుగురు అభ్యర్థుల పేర్లను అధిష్టానానికి పంపింది. ఆ ఐదుగురు ఎవరు అనే విషయాలు బయటకు రాకపోయినా ఇద్దరి పేర్లు మాత్రం బయట ప్రచారం అవుతున్నాయి. అందులో ఒకరు మాజీ ఎమ్మెల్యే జయరాములు కాగా మరొకరు యువనేత సురేష్.
Also Read : బద్వేల్ ఉప ఎన్నిక – కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే
తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు ఏపీ బీజేపీ నుంచి బద్వేల్ ఉపఎన్నికల్లో అభ్యర్థిగా సురేష్ పనతాల పోటీ చేయబోతున్నట్లు సమాచారం. ఏబీవీపీ స్టూడెంట్ లీడర్ గా 14 సంవత్సరాలు పనిచేసిన అనుభవంతో పాటు రెండేళ్లు బీజేపీ యూత్ వింగ్ అయిన భారతీయ జనతా పార్టీ యువ మోర్చా(బీ.జే.వై.ఎమ్) నేషనల్ సెక్రటరీగా పనిచేసిన రమేష్‌కు సంఘ్ పరివార్‌తో పరిచయాలు కూడా ప్లస్ పాయింట్ గా నిలవడంతో టికెట్ ఖరారు అయిందని అంటున్నారు.
బద్వేల్ అభ్యర్థిగా సురేష్ పనతాలను ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రకటించబోతున్నారని అంటున్నారు. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే చిత్తూరు పర్యటనలో ఉన్న ఆయన అటు నుంచి అటు బద్వేల్ వెళ్లి నామినేషన్ కూడా వేయించి వస్తారని అంటున్నారు. రాష్ట్ర నాయకత్వం నుంచి సూచనలు అందడంతో బద్వేల్ వెళ్లిన సురేష్ లోకల్ క్యాడర్ తో భేటీ కూడా అయ్యారట.
కడప టౌన్ కి చెందిన సురేష్ అయితే అన్ని విధాలా సరిపోతుందని అధిష్టానానికి రాష్ట్ర నాయకత్వం సూచనలు చేయడంతో ఆయన పేరు ఖరారు అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ ఎన్నికల విషయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ప్రచారానికి పిలుస్తామని చెప్పారు కానీ పోటీ చేయడమే ఇష్టం లేని పవన్ వస్తారా? అంటే అనుమానమే. ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో గెలుపుపై వైసీపీ నేతలు సహా అభ్యర్థి డాక్టర్ సుధ సైతం పూర్తి ధీమాగా ఉన్నారు.
Also Read : బద్వేల్ ఏకగ్రీవమయ్యేనా ?