iDreamPost
android-app
ios-app

జ‌గ‌న్.. ఒక్క పిలుపు చాలు..!

జ‌గ‌న్.. ఒక్క పిలుపు చాలు..!

రికార్డు స్థాయి ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు పెట్టింది పేరుగా ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిలుస్తున్నారు. ఎంపీగా గెలిచినా, ఎమ్మెల్యే అయినా రికార్డు స్థాయి మెజార్టీలే. అధికారంలోకి రావ‌డం కూడా రికార్డు స్థాయి సీట్ల‌తోనే. అధికారంలోకి వ‌చ్చిన రెండేళ్ల త‌ర్వాత కూడా ఆయ‌న పార్టీ రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తూనే ఉంది. తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక ఫ‌లితాల‌తో పాటు, స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాలు చూస్తే అది అర్థ‌మ‌వుతుంది. ఇక్క‌డ విశేషం ఏంటంటే.. అసెంబ్లీ మిన‌హా.. రికార్డు స్థాయి ఫ‌లితాలు సాధించిన ఏ ఎన్నిక‌కు కూడా జ‌గ‌న్ ప్ర‌చారంలో పాల్గొన‌లేదు. ప‌నిచేసే వారికి ప‌ట్టంక‌ట్టాల‌ని తిరుప‌తి, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌కు కేవ‌లం పిలుపు ఇచ్చారంతే..! జ‌గ‌న్ ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు రాక‌పోయినా వైసీపీని బంప‌ర్ మెజార్టీతో గెలిపించారు.

క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు చూస్తుంటే తాజా ఉప ఎన్నిక‌కు సంబంధించి అదే జ‌రిగేలా క‌నిపిస్తోంది. కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి అడుగుపెట్టాల్సిన అవసరం రాకపోవచ్చు. ఎందుకంటే ప్రత్యర్ధులు గట్టిగా లేని ఈ ఉపఎన్నికలో జగన్ అవసరం మాత్రం ఏముంటుంది ? ఈమధ్యనే జరిగిన తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో కూడా జగన్ అసలు ప్రచారానికే రాలేదు. అప్పట్లో టీడీపీ తరపున స్టార్ క్యాంపైనర్లుగా చంద్రబాబునాయుడు నారాలోకేష్ అండ్ ఎంతగా ప్రచారాన్ని హోరెత్తించారో అందరు చూసిందే. అయినా వాటిని ప్ర‌జ‌లు ఆద‌రించ‌లేదు. ఒకవైపు టీడీపీ నుండి మరోవైపు బీజేపీ ప్రచారాన్ని హోరెత్తించేసినా జగన్ మాత్రం నియోజకవర్గంలోకి అడుగుపెట్టలేదు.

తిరుప‌తి ప్ర‌చారానికి మొదట్లో రావాలని జగన్ అనుకున్నా తర్వాత కరోనా వైరస్ కారణంగా విరమించుకున్నారు. అప్పటికే చంద్రబాబు అండ్ కో ప్రచారంలో పాల్గొంటున్నా జగన్ మాత్రం పట్టించుకోలేదు. అంతటి బిజీగా జరిగిన పార్లమెంటు ఉఫఎన్నికలోనే అడుగుపెట్టని జగన్ ఇఫుడు గట్టిపోటీయే లేని బద్వేలు ఉపఎన్నికలో పాల్గొంటారా ? అందుకనే ఉపఎన్నిక మొత్తాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికే బాధ్యత అప్పగించారు. ఒవరాల్ గా బాధ్యతను పెద్దిరెడ్డి భుజాన వేసుకున్నా మళ్ళీ మండలాల్లో ఎక్కడికక్కడ ఇతర మంత్రులు ఎంఎల్ఏలు కూడా బాధ్యతను మోస్తున్నారు.

నిజానికి బద్వేలు ఉపఎన్నికలో వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకనే చెప్పాలి. పోటీలో టీడీపీ ఉన్నా జరిగేదిదే లేకపోయినా జరిగేదిదే అని అందరికీ తెలిసిందే. అలాంటిది పోటీలో కాంగ్రెస్ బీజేపీలున్నపుడు వైసీపీ లెక్క చేయాల్సిన అవసరమేలేదని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ అతి విశ్వాసానికి పోకుండా వైసీపీ అభ్య‌ర్థిని గ‌తం కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించుకోవాల‌ని జ‌గ‌న్ పార్టీ శ్రేణుల‌కు పిలుపు ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ నేరుగా ప్ర‌చారానికి రాకున్నా.. వ‌రుస ఎన్నిక‌ల మాదిరిగానే బ‌ద్వేలు లో కూడా వైసీపీ కి బంప‌ర్ మెజార్టీ ఖాయ‌మ‌నే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.