తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఆసక్తి రేపిన ఉప ఎన్నికలలో ఎవరు గెలిచారు అనేది మరి కొద్ది గంటల్లో తేలనుంది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో విజేతలం మేమే అని ఎవరికి వారు అంచనా వేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్.. తెలంగాణ రాష్ట్రంలో హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ మరికాసేపట్లో మొదలు కానుంది. అయితే బద్వేల్ విషయంలో వార్ వన్ సైడ్ కాగా, కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో మాత్రం విపరీతమైన టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ప్రజా తీర్పు ఎలా ఉండబోతోందనే ఉత్కంఠతో తెలంగాణతో పాటు తెలుగు వారంతా కూడా ఎదురుచూస్తున్నారు.
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు కానుండగా.. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ఆ తర్వాత 8.30 నుంచి ఈవీఎంలు లెక్కింపు మొదలు కానుంది. ఆంధ్ర ప్రదేశ్ లోని బద్వేల్ విషయానికి వస్తే ఇక్కడ గెలుపు ఖరారయినట్టే. టీడీపీ పోటీలో లేదు, ఒకవేళ ఉన్నా సానుభూతి పవనాలతో పాటు ఏపీ సీఎం జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాల దెబ్బకు ఎలానూ వైసీపీనే గెలిచేది. ఇక ఇప్పుడు బీజేపీ బరిలో ఉండగా ఎట్టిపరిస్థితుల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేననే అంచనాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మెజారిటీ విషయం మీద ఆసక్తి నెలకొంది. 75 వేలకు పైగా మెజారిటీ వస్తుందని వైసీపీ ధీమాగా ఉండగా, అసలు డిపాజిట్లు అయినా వస్తాయో రావో అని బీజేపీ టెన్షన్లో ఉంది. ఇక్కడ వైసీపీ నుంచి దివంగత వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్ సుధ బరిలో ఉండగా, బీజేపీ సురేష్ అనే వ్యక్తిని రంగంలోకి దించింది.
ఇక దీని మీద ఈరోజు మధ్యాహ్నానికి క్లారిటీ రానుంది. బద్వేల్ పట్టణ శివారులోని బాలయోగి గురుకుల పాఠశాలలో కౌంటింగ్ జరగబోతుండగా, 281 పోలింగ్ కేంద్రాలకు ఒకే చోట కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పోటీలో లేకపోవడంతో రెండు పార్టీల ఓట్లు తమకే పడతాయని, బీజేపీ భావించింది. కానీ బోర్లా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోపక్క హుజురాబాద్‌లో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడిచింది. ఇక్కడ బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేయగా అధికార టీఆరెఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేశారు. ఆత్మగౌరవం అంటూ జనంలోకి వెళ్ళిన ఈటెల ఖచ్ఛితంగా గెలిచి తీరతాడని బీజేపీ భావిస్తుంటే, మా అభివృద్ధి, దళిత బంధు పథకాలు గెలిపిస్తాయని టీఆరెఎస్ భావిస్తోంది. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనే దాని మీద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు ఉప ఎన్నికల ఫలితాలు మధ్యాహ్నానికి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Also Read : Badvel Bypoll : 30 వేల దొంగ ఓట్లా..? ఆరోపిస్తే అర్థముండాలి వీర్రాజు..!