Idream media
Idream media
ఆశ లేనిదే మనిషి బతుకు లేదు. కానీ ఆశకు హద్దు ఉంటుంది. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహఖ అధ్యక్షుడు తులసిరెడ్డి విస్మరిస్తున్నట్లున్నారు. ప్రస్తుతం జరుగుతోన్న బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీపై తులసిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆయన ఆశకు హద్దులేదు,మాటల్లో అర్థం లేదని అర్థమవుతోంది. బద్వేలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్,నకిలీ కాంగ్రెస్ మధ్యనే పోటీ అన్నారు తులసిరెడ్డి. ఒరిజనల్ కాంగ్రెస్ గుర్తు హస్తం అని, నకిలీ కాంగ్రెస్ గుర్తు ఫ్యాన్ అన్నారు. కాంగ్రెస్ రాజ్యంలో ఇంటింటా సౌభాగ్యం, నకిలీ కాంగ్రెస్ రాజ్యంలో దౌర్జన్యం అన్న తులసి రెడ్డి బద్వేలు ఉప ఎన్నికల్లో నకిలీ కాంగ్రెస్‌కు సరైన బుద్ధి చెప్పాలన్నారు.
ఆశలు సరే విషయం ఏదీ..
బద్వేలు ఉప ఎన్నికల్లో వైసీపీకి, కాంగ్రెస్‌కు మధ్య పోటీ అంటూ తులసి రెడ్డి అన్న మాటలు ఆయనకు ఆత్మసంతృప్తిని ఇవ్వొచ్చు. అంతేకానీ వైసీపీతో పోటీ పడే సత్తా కాంగ్రెస్ ఉందా..? లేదా..? అనే విషయం ఆయనకు తెలియంది కాదు. వైఎస్ కుటుంబం కాంగ్రెస్‌కు దూరం కాక ముందు ఆ పార్టీ బలమైనదే.కానీ ఆ తర్వాత ఎలాంటి పరిస్థితో తెలిసిన విషయమే. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కాదు కదా..కనీసం ఒక్క చోట కూడా డిపాజిట్ దక్కలేదు.నోటా కన్నా కాంగ్రెస్ పార్టీకి తక్కువ ఓట్లు వచ్చాయి.ఈ గణాంకాలు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలిసి కూడా వైసీపీకి, కాంగ్రెస్‌కు మధ్య పోటీ అంటూ తులసి రెడ్డి ఆశించడం అత్యాశకు మించి ఉంది. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం డిపాజిట్ వచ్చినా అది గొప్ప విషయమే అవుతుంది.
Also Read : Badvel By Poll YCP Jagan -బద్వేల్ ఉప ఎన్నిక : జగన్ కొత్త ఒరవడి..!
కడుపు మంట చల్లారేది కాదు..
వైసీపీని నకిలీ కాంగ్రెస్‌తో పోల్చిన తులసి రెడ్డి తన కడుపు మంటను చల్లార్చుకునే ప్రయత్నం చేశారు. తులసిరెడ్డిలో వైసీపీ పట్ల కడుపు మంట ఉండడం అత్యంత సహజం. కాంగ్రెస్ పార్టీకి, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేకపోయినా అధిష్టానానికి భజనచేసి పదవులు తెచ్చుకునే నేతలకు భవిష్యత్ లేకుండా పోయింది. ఇక భవిష్యత్‌లోనూ కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పూర్వవైభవం కలే. ఘనమైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ గతి పట్టించిన వైసీపీపై తులసిరెడ్డికి ఆ మాత్రం కడుపు మంట ఉండడంలో అర్థముంది. అందుకే సందర్భం వచినప్పుడల్లా వైసీపీని తూలనాడుతూ తనలోని కడుపు మంటను కొంతైనా చల్లార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తులసిరెడ్డి.
సౌభాగ్యం అయితే… ఈ గతి ఎందుకు..?
కాంగ్రెస్ రాజ్యంలో ఇంటింటా సౌభాగ్యం..నకిలీ కాంగ్రెస్ రాజ్యంలో దౌర్జన్యం అన్న తులసి రెడ్డి.. నిజంగా అలాంటి పరిస్థితే ఉంటే.. కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి గతి ఎందుకు పట్టిందో చెప్పాల్సి ఉంటుంది. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించడం, విభజన వల్ల నష్టపోతున్న ఏపీకి న్యాయం చేయకపోవడం తులసిరెడ్డి దృష్టిలో సౌభాగ్యం అవుతుందేమో..? ఏపీకి ఈ గతి పట్టించిన కాంగ్రెస్‌కు ప్రజలు ఎప్పుడో బుద్ధి చెప్పారు. వైసీపీ రాజ్యం దౌర్జన్యం అయితే.. పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి సాధారణ ఎన్నికల కన్నా ఘనమైన పట్టం ఎందుకు కడతారు..? తర్కం లేకుండా వ్యాఖ్యలు, విమర్శలు చేయడం వల్ల మీడియాలో ప్రచారం దొరుకుతుందేమో గానీ.. ప్రజల్లో పలుచన అవుతామని తులసిరెడ్డి ఎప్పుడు గ్రహిస్తారో..?
Also Read : RBK – ఏపీ బాటలో కేరళ.. జగన్ ఆలోచన అమలుకు సిద్ధమైన కేరళ సర్కార్