Idream media
Idream media
వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పొట్టిపోగు మేరి కమలమ్మ పోటీ చేయబోతున్నారు. నామినేషన్ల దాఖలుకు మరో మూడు రోజులే గడువు ఉన్న నేపథ్యంలో.. కమలమ్మ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు (మంగళవారం) ఖరారు చేసింది. దీంతో ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలు దూరంగా ఉన్న ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు బరిలోకి దిగడం ఖరారైంది.
పొట్టిపోగు మేరీ కమలమ్మ 2009లో తొలిసారి బద్వేలు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్లకు చెందిన కమలమ్మ వృత్తి రీత్యా అధ్యాపకురాలు. చిత్తూరు జిల్లాలో పలు జూనియర్ కాలేజీల్లో అధ్యాపకురాలిగా పని చేశారు. ఆమె భర్త ప్రభాకర్ కూడా డిగ్రీ కాలేజీ అధ్యాపకుడుగా పని చేశారు. 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో.. బద్వేలు ఎస్సీ రిజర్డ్వ్ అయింది.
రాజకీయాలపై ఆసక్తి ఉన్న కమలమ్మ.. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని భర్త ప్రభాకర్‌తో వెళ్లి కలిసి తన ఆసక్తిని వెలిబుచ్చారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ దక్కింది. ఆ సమయంలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్‌గా పని చేస్తున్న కమలమ్మ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఐదేళ్ల సర్వీసు ఉన్నా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రావడంతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న కమలమ్మ బద్వేలులో 36,594 ఓట్ల మోజారిటీతో గెలిచారు.
Also Read : మండలి ఖాళీల భర్తీ.. వైసీపీలో ఆశావాహుల సందడి
వైసీపీ ఆవిర్భావం తర్వాత వైఎస్ జగన్ వెంట కమలమ్మ కొంతకాలం నడిచారు. అయితే 2011లో జరిగిన కడప లోక్ సభ ఉప ఎన్నికల సమయంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. స్థానిక నేత, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ గోవింద రెడ్డికి తనకన్నా ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారనే కారణంతో.. కమలమ్మ వైఎస్ జగన్‌తో విభేధించి.. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డీఎల్ రవీంద్రరెడ్డికి మద్ధతు తెలిపారు. అనంతరం నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కలిశారు. ఉప ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలిచినా.. తాను మాత్రం వెళ్లబోనని చెప్పారు.
వైఎస్ జగన్‌తో విభేధించి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన కమలమ్మకు మంచి ప్రతిఫలమే దక్కింది. 2014 సాధారణ ఎన్నికలకు రెండు నెలల ముందు కమలమ్మను నాటి యూపీఏ ప్రభుత్వం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలుగా నియమించింది. 2014 మార్చి 6వ తేదీన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలుగా నియమితులైన కమలమ్మ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2017 మే వరకు మూడేళ్లపాటు ఆమె ఎస్సీ కమిషన్ సభ్యురాలుగా పని చేశారు. 2019 ఎన్నికల్లో బద్వేలు నుంచి మరోసారి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన కమలమ్మ కేవలం 2,337 ఓట్ల సాధించి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు. మరోసారి ఉప ఎన్నికల్లో తన అదృష్టాన్ని కమలమ్మ పరీక్షించుకోబోతున్నారు. మరి మునపటి కన్నా ఈ సారి కమలమ్మ ఎక్కువ ఓట్లు సంపాదిస్తారా..? లేదా..? చూడాలి.
Also Read : బద్వేల్ బీజేపీ అభ్యర్థి ఆ మాజీ ఎమ్మెల్యేనేనా..?