iDreamPost
android-app
ios-app

Badvel Bypoll – గెలుపోట‌మ‌లుపై కాదు.. వైసీపీ మెజారిటీపైనే చ‌ర్చ‌!

Badvel Bypoll –  గెలుపోట‌మ‌లుపై కాదు.. వైసీపీ మెజారిటీపైనే చ‌ర్చ‌!

బ‌ద్వేలు ఉప ఎన్నిక ప్ర‌చారం ముగింపు ద‌శ‌కు చేరుకుంది. సాధార‌ణంగా ఎన్నిక‌లంటే పార్టీల అభ్య‌ర్థుల గెలుపోట‌ముల‌పైనే ప్ర‌ధాన చ‌ర్చ జ‌రుగుతుంది. కానీ ఈ ఉప ఎన్నిక‌లో ఆస‌క్తిక‌రంగా కేవ‌లం వైసీపీ మెజారిటీపైనే చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అంటే.. ఆ పార్టీ గెలుపు లాంఛ‌న‌మే అన్న విష‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తెలుగుదేశం పోటీ నుంచి త‌ప్పుకోవ‌డంతో అధికార పార్టీ వైసీపీకి పోటీ పెద్ద‌గా లేదు.

అయిన‌ప్ప‌టికీ బీజేపీ, కాంగ్రెస్ మాత్రం హ‌డావిడి చేస్తున్నాయి. ఇరు పార్టీల అభ్య‌ర్థులూ అగ్ర నేత‌ల‌ను వెంట తిప్పుకుని ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు నానా తంటాలు ప‌డుతున్నాయి. ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య ఆకస్మిక మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో అధికార పార్టీ తరఫున వెంకట సుబ్బయ్య సతీమణి సుధ బరిలో నిలిచారు. ఇక బీజేపీ నుంచి పనతల సురేశ్‌, కాంగ్రెస్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే కుతూహలమ్మ పోటీ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో ఫ్యాన్ హ‌వా కొన‌సాగుతోంది. బ‌ద్వేలు కూడా ఫ్యాన్ కు తిరుగులేద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే, మెజారిటీపైనే లెక్క‌లు న‌డుస్తున్నాయి.

సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా కావ‌డంతో వైసీపీ నేత‌ల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ నెల 30న ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం. నవంబర్ 2వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. బద్వేల్‌లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేనలు పోటీలో లేవు. కానీ, బీజేపీ, ఇండిపెండెంట్లు, మరో పార్టీ కాంగ్రెస్ తన అభ్యర్ధుల్ని బరిలో నిలిపింది. ఎలాగైనా తమ సత్తా చాటాలని బీజేపీ, కాంగ్రెస్‌లు ముందుకెళుతున్నాయి. అయితే, గత అనుభవాల దృష్ట్యా ఆయా పార్టీల ప్రభావం అంతగా ఉండదని తేలిపోయింది. గెలుపు పక్కా అని తెలిసినా.. మెజారిటీ గురించే వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారు. సీఎం స్వంత జిల్లా కావడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పక్కనే వున్న చిత్తూరు నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరుండి మరీ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

Also Read : BJP Wanted Agents – బద్వేలు ఉప ఎన్నిక – పోలింగ్‌ ఏజెంట్లు కావలెను..!

బీజేపీ, కాంగ్రెస్‌లను వైసీపీ నేతలు లైట్ తీసుకుంటున్నారు. అక్కడ మాత్రం హడావిడి కొనసాగుతోంది. వైసీపీ, కాంగ్రెస్, బీజేపీలు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నాయి.. మూడు పార్టీల నేతలు అక్కడే మకాం వేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రచారంపై క్లారిటీ వచ్చింది. బద్వేల్ రాలేకపోతున్నానని.. వైసీపీ అభ్యర్థి సుధకు ఓటు వేయాలని ఓటర్లకు ముఖ్యమంత్రి జగన్ లేఖ పంపారు. కరోనా పరిస్థితులు, ఎన్నికల సంఘం నిబంధనలతో తాను బద్వేల్ రాలేకపోతున్నానని భారీ మెజారిటీతో వైసీపీని గెలిపించాలని కోరారు. బద్వేల్ నియోజకవర్గంలోని అక్కచెల్లెమ్మలకు, అన్మదమ్ములకు ఆత్మీయ లేఖ రాశారు. ఉప ఎన్నిక సందర్భంగా తన కుటుంబ సభ్యులైన ఓటర్లతో బద్వేల్ వచ్చి గడపాలని.. ప్రత్యక్షంగా బహిరంగ సభ ద్వారా ఓట్లు అడగాలని భావించాను అన్నారు.

కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రాలేకపోతున్నానని.. అక్కడికి వచ్చి ఓటు అడగలేకపోతున్నానని లేఖలో ప్రస్తావించారు. తాను అక్కడికి వస్తే.. భారీగా జనాలు ఒక్కసారిగా గుమిగూడితే వారిలో ఏ కొందరికైనా కొవిడ్‌ వచ్చే ప్రమాదం ఉందని జగన్ అన్నారు. అందరి ఆరోగ్యాలను, ప్రాణాలను, కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని తన పర్యటనను రద్దు చేసుకుంటున్నా అన్నారు జగన్. ఈ పరిస్థితుల్లో తన భావాలను ప్రత్యక్షంగా పంచుకునేందుకు ఈ ఉత్తరం రాస్తున్నాను అన్నారు. లేఖలో నవరత్న పథకాల ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరిందో కుటుంబాల వారీగా వివరించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి లక్ష్యాలుగా ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు.

సీఎం వైఎస్‌ జగన్‌ రాసిన ఈ లేఖను ముద్రించి స్థానిక నేతలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు పేరు పేరున స్వయంగా అందిస్తున్నారు. ప్రచార సమయం ముగింపు దశకు చేరుకోనుండడంతో వైసీపీ నేతలు వేగం పెంచారు. గతంలోనూ తిరుపతిలో లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారంలో జగన్ పాల్గొనలేదు. ఓటర్లకు లేఖలు రాశారు. గతంలో ఎన్నడూ లేనంతగా అక్కడ భారీ మెజారిటీ వైసీపీ సొంత‌మైంది. దీంతో బ‌ద్వేలులోనూ అదే సీను రిపీట్ కానున్న‌ట్లు ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో తమ అభ్యర్థిగా రాజశేఖర్‌బాబుని బరిలోకి దింపింది టీడీపీ. ఇక 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ లోకి జంప్‌ అయిన జయరాములు ఎన్నికల ముందు బీజేపీలో చేరి పార్టీ టికెట్‌ దక్కించుకున్నారు.

Also Read : Huzurabad Konda Survey – నిజమవుతుందా?

ఇక కాంగ్రెస్‌ తరఫున కుతూహలమ్మ బరిలోకి దిగారు. అయితే వీరందరిని కాదని ప్రజలు వెంకట సుబ్బయ్యకే పట్టం కట్టారు. వైసీపీ తరఫున బరిలోకి దిగిన ఆయన 44వేల మెజారిటీతో విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి రాజశేఖర్‌ రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కుతుహలమ్మకు కేవలం 2, 337 ఓట్లు మాత్రమే రాగా బీజేపీ అభ్యర్థి 735 ఓట్లతో డిపాజిట్‌ కూడా దక్కించుకోలేకపోయారు. ఆయా పార్టీల‌కు ఇప్పుడు అదే ప‌రిస్థితి అయ్యే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. ఏం జ‌ర‌గ‌నుంద‌నేది న‌వంబ‌ర్ 2న తేల‌నుంది.