iDreamPost
android-app
ios-app

AP BJP Adinarayanareddy – బద్వేల్ ఉప ఎన్నిక – ఆదినారాయణరెడ్డి స్వంత అజెండా

AP BJP Adinarayanareddy – బద్వేల్ ఉప ఎన్నిక – ఆదినారాయణరెడ్డి స్వంత అజెండా

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపించే నాయకుడు కరువయ్యాడు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నాయకత్వ సమస్య తో ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ ఒక్క కార్యక్రమాన్ని కూడా సమర్థవంతంగా చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఎప్పుడూ లేదు. బిజెపి రాష్ట్ర నాయకత్వం సమర్థవంతంగా లేకపోయినా సరే కేంద్ర నాయకత్వం మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేసినా సరే సమర్థిస్తూ ఉంటారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది అనే కామెంట్స్ కూడా బీజేపీ వర్గాలలో వినబడుతున్నాయి.

బిజెపి బలంగా లేకపోయినా క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం లేకపోయినా, ఆ పార్టీని ముందుకు నడిపించే నాయకత్వం ఏ నియోజకవర్గంలో కనపడకపోయినా, కనీసం సోము వీర్రాజు సొంత జిల్లాలో కూడా పార్టీ నాయకత్వానికి సమర్థవంతమైన నాయకుడు లేకపోయినా సరే, ప్రతి ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి భారతీయ జనతా పార్టీ ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. తిరుపతి ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. కాపు సామాజికవర్గ ఓటర్లు ఉన్న ప్రాంతం లో జనసేన పార్టీ అభ్యర్థిని నిలబెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని కనీసం ఒక 50 వేల ఓట్లయినా సరే వచ్చి ఉండేవి అని చాలామంది వ్యాఖ్యానించారు.

ఇక బద్వేల్ ఉప ఎన్నికల విషయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తప్పుకున్నా సరే, జనసేన పార్టీ పోటీ లో ఉండేది లేదని చెప్పినా సరే,భారతీయ జనతా పార్టీ నేతలు మొండి పట్టుదలతో బరిలోకి దిగారు. అయితే ఈ బరిలోకి దిగడం వెనుక ప్రధాన కారణం మరొకటి ఉంది అనే మాట ఎక్కువగా వినపడుతోంది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో కాస్తో కూస్తో బలమైన నాయకుడిగా కనపడుతున్న మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తన బలం చూపించేందుకు బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ అధిష్టానాన్ని కాస్త ఎక్కువగా విజ్ఞప్తి చేశారని, నియోజకవర్గంలో ప్రచారం ఖర్చు మొత్తం కూడా తానే చూసుకుంటా అని చెప్పారని అంటున్నారు.

Also Read :Badvel By Polls -బద్వేలు ఉప ఎన్నికలు, మెజార్టీపై మొదలయిన పందాలు

బద్వేల్ ఉప ఎన్నికల్లో కనీసం పార్టీకి 25 నుంచి 30 వేల ఓట్లు వస్తే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ఆయన సిద్ధమవుతున్నారని అంటున్నారు. సొంత జిల్లాలో బలం చూపించిన తర్వాత పార్టీ అధిష్టానానికి లెక్కలను పంపించి రాష్ట్ర అధ్యక్ష పదవిని అడిగే అవకాశం ఉందని, సోము వీర్రాజు విఫలమయ్యారు కాబట్టి తాను పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతానని పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. అందుకే నియోజకవర్గంలో గతంలో తనతో సన్నిహితంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా చర్చలు జరుపుతూ బిజెపికి ఓటు వేయాలని కోరుతున్నారు అని అంటున్నారు. ఆయన కూడా స్వయంగా బిజెపికి ఓటు వేయాలని టిడిపి వాళ్లను విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదు.

రెండుసార్లు కాపు సామాజిక వర్గానికి అదేవిధంగా ఒకసారి కమ్మ సామాజిక వర్గానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వరించింది. రాష్ట్రంలో కీలక పాత్ర పోషించే రెడ్డి సామాజిక వర్గానికి ఆ పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకపోవడం తోనే పార్టీ కొన్ని ప్రాంతాల్లో బలం పుంజుకునే అవకాశం ఉన్నా సరే బలపడటం లేదని వ్యాఖ్యలు వినిపించాయి. ఇవన్నీ అంచనా వేసుకున్న ఆదినారాయణరెడ్డి రాయలసీమకు చెందిన ఒక ఎంపీ గారి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. టిడిపిలో ఉన్నప్పుడు తనతో సన్నిహితంగా మెలిగిన సదరు ఎంపీ గారి ప్రోద్బలంతో ఆదినారాయణరెడ్డి రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం గాలం వేశారని అంటున్నారు.

ఆయనకు తెలంగాణ బీజేపీ నాయకుల నుంచి కూడా కాస్త మద్దతు ఉంది అని ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇక్కడ ఆదినారాయణ రెడ్డి వైఖరి అటు బీజేపీ ఇటు తెలుగుదేశం పార్టీలో కూడా చర్చనీయాంశం అవుతోంది. జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన ఆదినారాయణ రెడ్డి తన అన్న కుమారుడు భూపేష్ రెడ్డిని నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించుకున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఆ తర్వాత ఆయన సోదరుడు అలాగే మాజీ ఎమ్మెల్సీ గా ఉన్న నారాయణరెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి పంపించారు. అటు బీజేపీ ఇటు తెలుగుదేశం పార్టీలో రెండు పార్టీల్లో కూడా తన పట్టు నిలుపుకోవడానికి కీలక పదవులు కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్యలు వినపడుతున్నాయి. అయితే ఇటువంటి వాటిని పెద్దగా బీజేపీ అధిష్టానం లెక్క చేసే అవకాశం ఉండకపోవచ్చని, రాష్ట్రంలో ఆ పార్టీకి కాపు సామాజికవర్గం కీలకమని, అందుకే జనసేన పార్టీతో కూడా కలిసి ముందుకు వెళుతుందని, కాబట్టి ఆదినారాయణ రెడ్డిని లెక్క చేసే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు.

Also Read : Huzurabad By Poll – హోరెత్తిన హుజూరాబాద్