iDreamPost
android-app
ios-app

BJP Wanted Agents – బద్వేలు ఉప ఎన్నిక – పోలింగ్‌ ఏజెంట్లు కావలెను..!

BJP Wanted Agents – బద్వేలు ఉప ఎన్నిక –  పోలింగ్‌ ఏజెంట్లు కావలెను..!

బద్వేలు ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ అధికార దుర్వినియోగం చేస్తోంది.. ప్రలోభాలకు గురి చేస్తోంది.. బీజేపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారు. స్టేషన్లకు పిలిచి వేధిస్తున్నారు.. ఎస్సై నుంచి డీఎస్పీ వరకు అందరినీ బదిలీ చేయండి… అంటూ రెండు రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల అధికారికి లేఖలు రాయడం వెనుక పెద్ద కథే ఉందని తాజాగా వెల్లడైంది. బెదిరింపులు, బీజేపీ కార్యర్తలపై కేసులు అంటూ బీజేపీ విమర్శలు చేయడం వెనుక.. బద్వేలులో ఆ పార్టీకి పోలింగ్‌ ఏజెంట్లు దొరకని పరిస్థితే కారణం.

బద్వేలులో స్థానికేతరులను పోలింగ్‌ ఏజెంట్లుగా నియమించుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ బీజేపీ నేతలు తాజాగా ఎన్నికల అబ్జర్వర్‌ భీష్మకుమార్‌కు విజ్ఞప్తి చేశారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర అదనపు ఇంఛార్జి సునిల్‌ దియోధర్, ఎంపీ జీవీఎల్‌ నరశింహారావు, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, సీఎం రమేష్, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిలు కడపలో భీష్మకుమార్‌ను కలసి వినతిపత్రం అందించారు. బద్వేలులో అధికార పార్టీ వైసీపీ తమ పార్టీ నేతలను బెదిరిస్తోందని, అందువల్ల… ఏజెంట్లుగా కూర్చునేందుకు ఎవరూ ముందుకురావడం లేదంటూ పేర్కొంది. ఈ కారణంగా స్థానికేతరుల (కడప జిల్లాకు చెందిన వారు) ను పోలింగ్‌ ఏజెంట్లుగా నియమించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

తమ డిమాండ్‌ సహేతుకమైనదేనని తెలిపేందుకు.. బీజేపీ నేతలు పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు జరిగిన తీరును ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో స్థానికేతరులను ఏజెంట్లుగా నియమించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి అవకాశం ఇచ్చిందని కమలం పార్టీ నేతలు ఎన్నికల అబ్జర్వర్‌ భీష్మకుమార్‌కు గుర్తుచేశారు. పశ్చిమ బెంగాల్‌లో మాదిరిగా బద్వేలు ఉప ఎన్నికల్లోనూ స్థానికేతరులను ఏజెంట్లుగా నియమించుకునేందుకు అవకాశం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేయడం విశేషం.

బీజేపీ నేతల వినతి.. బద్వేలులో ఆ పార్టీ పరిస్థితిని తెలియజేస్తోంది. పోలింగ్‌ ఏజెంట్లుగా కూర్చునే బీజేపీ కార్యకర్తలను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారనేది కేవలం ఆరోపణ మాత్రమే. స్థానికంగా ఏజెంట్లు కూడా లేని దుస్థితి బీజేపీది. ఉప ఎన్నికల్లో స్థానికేతరులను ఏజెంట్లుగా పెట్టుకునేందుకు అధికార పార్టీపై విమర్శలను బీజేపీ ఆధారంగా చేసుకుందనడంలో సందేహం లేదు. బీజేపీ శక్తి ఏమిటో ఆపార్టీ నేతలకు కూడా తెలిసిన విషయమే. రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి ఏమిటో గత ఎన్నికల్లో అందరూ చూశారు. ఉభయగోదావరి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీకి అంతో ఇంతో క్యాడర్‌ ఉంది. బద్వేలు ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీకి మద్ధతు తెలియజేస్తోంది. అయితే జనసేన మద్ధతు ఉన్నా.. కనీసం ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి బీజేపీ–జనసేన కూటమిది.

Also Read : Veerraju Over Expectation – ఎబ్బెట్టుగా అనిపించడం లేదా వీర్రాజు..?